
ప్రముఖ రైడ్ షేరింగ్ సంస్థ ఉబర్ దేశవ్యాప్తంగా తన సేవల విస్తరణలో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది. భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా మరో 100 నగరాల్లోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించగా, ఇందులో తెలంగాణకు చెందిన 10 ముఖ్యమైన పట్టణాలు చోటు దక్కించుకున్నాయి. తెలంగాణలోని ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలైన ఖమ్మం, నిజామాబాద్, రామగుండం, మహబూబ్‌నగర్, నల్లగొండ, కొత్తగూడెం, సిద్ధిపేట, కామారెడ్డి, సూర్యాపేట , ఆదిలాబాద్ పట్టణాల్లో ఈ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ఈ విస్తరణ ద్వారా దేశవ్యాప్తంగా ఉబర్ నెట్‌వర్క్ కవరేజ్ 225 కంటే ఎక్కువ నగరాలకు చేరుకుంది.
చిన్న నగరాలు, పట్టణాల్లో ప్రయాణికులకు సులువైన, అందుబాటు ధరల్లో ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడమే లక్ష్యంగా ముఖ్యంగా ‘ఉబర్ బైక్’ సేవలపై దృష్టి సారించినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. స్థానికంగా ఉన్న ద్విచక్ర వాహనదారులకు ఇది అదనపు ఆదాయ వనరుగా, ఉపాధి అవకాశంగా మారనుంది. అంతేకాకుండా.. తొలిసారిగా ఉబర్ యాప్‌ను ఉపయోగించే కొత్త ప్రయాణికులను ఆకట్టుకోవడానికి పరిమిత కాలం పాటు మొదటి రైడ్‌ను ఉచితంగా అందిస్తున్నట్లు సంస్థ వివరించింది. ఈ విస్తరణతో మెట్రో నగరాలకే పరిమితమైన యాప్ ఆధారిత ప్రయాణ సేవలు తెలంగాణలోని ఇతర ప్రాంతీయ కేంద్రాల్లోకి కూడా సులభంగా అందుబాటులోకి వచ్చాయి.