
మైనర్ల ChatGPT ఖాతాలకు ఇప్పటికే అందుబాటులో ఉన్న పలు భద్రతా చర్యలను ఈ టీన్ మోడ్‌లో మరింతగా అమలు చేస్తున్నారు. ముఖ్యంగా ఆత్మహత్య, స్వీయహాని, హింస, ఈటింగ్ డిజార్డర్స్, గ్రాఫిక్ లైంగిక కంటెంట్ వంటి సున్నితమైన అంశాలకు సంబంధించిన చాటింగ్‌పై కఠినమైన పరిమితులు ఉంటాయి. టీనేజర్ల కోసం రూపొందించిన వెర్షన్‌లో తరచూ విరామం తీసుకోవాలని గుర్తుచేసే Break Reminders ఉంటాయి. అలాగే నిర్దిష్ట సమయాల్లో ChatGPT వినియోగాన్ని నిలిపివేసే Quiet Hours సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది. అదే విధంగా Study Mode కూడా ఇందులో ఉంటుంది. ఇందులో విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు నేరుగా సమాధానం చెప్పకుండా, విషయాన్ని అర్థం చేసుకునేలా మార్గనిర్దేశక ప్రశ్నలు అడుగుతూ ChatGPT స్పందిస్తుంది. దీనివల్ల విద్యార్థులు సమాధానాన్ని కాపీ చేసుకోవడం కంటే, పాఠ్యాంశాన్ని అర్థం చేసుకునేలా చేయడమే లక్ష్యమని OpenAI తెలిపింది.
టీనేజర్లతో ChatGPT సంభాషణల్లో మరికొన్ని ప్రత్యేక పరిమితులను కూడా విధించారు. ChatGPT తనకు వినియోగదారుపై వ్యక్తిగత భావాలు ఉన్నాయని సూచించడం లేదా తనకు స్వంత చైతన్యం ఉందని చెప్పడం వంటి స్పందనలను నిరోధిస్తారు. అలాగే కొన్ని ఫీచర్లను టీన్ మోడ్‌లో నిలిపివేశారు. ఉదాహరణకు Voice Mode వంటి కొన్ని మోడాలిటీలను ఉపయోగించుకునే అవకాశం ఉండదు. తల్లిదండ్రులు తమ టీనేజర్ ChatGPT ఖాతాను తమ ఖాతాతో లింక్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. పిల్లలతో ChatGPT సంభాషణల్లో స్వీయహాని, ఆత్మహత్య వంటి అధిక ప్రమాద పరిస్థితులకు సంబంధించిన చర్చలు కనిపిస్తే తల్లిదండ్రులకు అలర్ట్ వచ్చేలా ఈ వ్యవస్థను రూపొందించారు. అయితే తల్లిదండ్రులకు పంపే అలర్ట్‌లను మానవ మోడరేటర్లు సమీక్షిస్తారు. పిల్లల గోప్యతను కాపాడేందుకు చాట్ లాగ్‌లలోని నిర్దిష్ట వివరాలను తొలగించిన తర్వాతే సంబంధిత సమాచారం అందిస్తారు.
మరోవైపు టీనేజర్ల కోసం ప్రత్యేక ChatGPT మోడ్‌ను తీసుకురావడం వెనుక OpenAIపై పెరుగుతున్న న్యాయ, నియంత్రణ ఒత్తిడి కూడా ఒక కారణంగా కనిపిస్తోంది. ChatGPT వినియోగానికి సంబంధించి పలు Wrongful Death Lawsuitsను OpenAI ఎదుర్కొంటోంది. 16 ఏళ్ల ఆడమ్ రైన్ ఆత్మహత్య చేసుకున్న ఘటనలో ChatGPT అతనికి హానికరమైన పద్ధతులను సూచించిందని అతని తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ ఘటనపై దాఖలైన కేసు సహా పలు న్యాయపరమైన వివాదాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉన్నాయి. ఇక పిల్లలు, టీనేజర్లు ఉపయోగించే AI చాట్‌బాట్‌ల వల్ల కలిగే ప్రమాదాలపై అమెరికా Federal Trade Commission (FTC) కూడా దర్యాప్తు ప్రారంభించింది. ముఖ్యంగా డిజిటల్ కంపానియన్‌లుగా పనిచేసే AI చాట్‌బాట్‌ల వల్ల పిల్లలు, టీనేజర్లపై పడే ప్రభావాన్ని పరిశీలిస్తోంది.