
హైదరాబాద్, వెలుగు: అంతర్జాతీయ స్థాయి బోధనా పద్ధతులపై అధ్యయనం చేసేందుకు జపాన్ వెళ్లే టీచర్లు, ఆఫీసర్ల ఫైనల్ లిస్టును ప్రభుత్వం ఖరారు చేసింది. ఇప్పటికే 29 మంది టీచర్లు, హెడ్‌మాస్టర్ల పేర్లను ప్రకటించిన సర్కారు.. తాజాగా మరో 11 మంది అధికారుల పేర్లను వెల్లడించింది. దీంతో మొత్తం ప్రతినిధుల సంఖ్య 40కి చేరింది. సెప్టెంబర్ 5 నుంచి 12 వరకు వారం రోజుల పాటు పర్యటన కొనసాగనుంది. ఈ సందర్భంగా జపాన్‌లోని విద్యా విధానం, అక్కడి స్కూళ్లలో అమలు చేస్తున్న ఉత్తమ పద్ధతులను బృందం పరిశీలించనుంది.
ఇద్దరు ఐఏఎస్‌లు..
జపాన్ టూర్‌కు ఇద్దరు ఐఏఎస్‌లను ఎంపిక చేశారు. స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్, పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష ఉన్నారు. మిగిలిన వారిలో స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి 8 మంది, ఇంటర్ విద్యతో పాటు ఇతర విభాగాలకు చెందిన అధికారులు కూడా బృందంలో ఉన్నారు. ఎం. రాధారెడ్డి (టెక్స్ట్‌బుక్ డైరెక్టర్), పి. రాజీవ్ (ఓపెన్ స్కూల్ జాయింట్ డైరెక్టర్), కె. రాము (జగిత్యాల డీఈఓ), టి. శ్రీనివాస్ (నిజామాబాద్ డైట్ ప్రిన్సిపాల్), బి. శ్రీనివాస్ (సమగ్ర శిక్ష క్వాలిటీ కోఆర్డినేటర్), సీవీ హరికృష్ణ (ఎస్సీఈఆర్టీ ఫ్యాకల్టీ), దామోదర్ ప్రసాద్ (ఖమ్మం జిల్లా తల్లాడ ఎంఓఈ), నాగరాజు (వీఎస్కే ఇన్‌చార్జి) ఎంపికయ్యారు.
ఇంటర్ విభాగం నుంచి ఖమ్మం జిల్లా కారేపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీ లెక్చరర్ దుర్గాప్రసాద్‌ను ఎంపిక చేశారు. ఎంపికైన వారంతా వెంటనే తమ శాఖల నుంచి ఎన్ఓసీ తీసుకోవాలని విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశించారు. వీసా ప్రక్రియ, విదేశీ పర్యటన నిబంధనలపై అవగాహన కల్పించేందుకు మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ఆన్‌లైన్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ నిర్వహించనున్నారు.