Reading Time: 2 minutes
లేఆఫ్స్ ఎఫెక్ట్.. ఉద్యోగం దొరక్క స్కూల్ బస్ డ్రైవర్‌గా మారిన Adobe టెకీ! నెట్టింట రచ్చ

స్ట్రాన్ గతంలో Adobe Digital Video విభాగంలో సీనియర్ సాఫ్ట్‌వేర్ క్వాలిటీ ఇంజినీర్‌గా పనిచేశారు. 2025 ఆగస్టులో ఆయన ఉద్యోగం కోల్పోయారు. ఆ తర్వాత మరో టెక్ ఉద్యోగం కోసం విస్తృతంగా ప్రయత్నించినప్పటికీ ఆశించిన ఫలితం రాలేదు. సుదీర్ఘంగా ఉద్యోగం కోసం వెతకడం తనను తీవ్ర నిరాశకు గురిచేసిందని ఆయన తెలిపారు.

ఏడాదికి పైగా ఉద్యోగ వేట.. జీతం తక్కువే.. కానీ పని నచ్చింది

టెక్ రంగంలో 25 ఏళ్ల అనుభవం ఉన్నప్పటికీ కొత్త ఉద్యోగం దొరకకపోవడంతో స్ట్రాన్ చివరకు తన కెరీర్‌ను పూర్తిగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు. స్థానిక స్కూల్ డిస్ట్రిక్ట్‌లో స్కూల్ బస్ డ్రైవర్‌గా ఉద్యోగాన్ని స్వీకరించారు. తన కొత్త ఉద్యోగం గురించి LinkedInలో ఆయన చేసిన పోస్టు వైరల్‌గా మారింది. ఏడాదికి పైగా సాగిన కఠినమైన ఉద్యోగ వేట తనను నిరుత్సాహానికి గురిచేసిందని, హైటెక్ పరిశ్రమలో వివక్షను కూడా ఎదుర్కొన్నానని పేర్కొన్నారు. అయితే ఇప్పుడు తన జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైనందుకు సంతోషంగా ఉందన్నారు.

తాను గతంలో పొందిన జీతంతో పోలిస్తే స్కూల్ బస్ డ్రైవర్ ఉద్యోగంలో ఆదాయం చాలా తక్కువగా ఉంటుందని స్ట్రాన్ అంగీకరించారు. అయినప్పటికీ కొత్త పని తనకు ఆనందాన్ని ఇస్తోందని చెప్పారు. స్కూల్ బస్ నడపడం సరదాగా ఉందని, పిల్లలు కూడా ఎక్కువగా మంచివారేనని, కొత్త సహోద్యోగులు ఎంతో ఆప్యాయంగా, మంచితనంతో, సింపుల్‌గా ఉంటారని ఆయన తెలిపారు. నా కొత్త, చివరి కెరీర్‌గా స్కూల్ బస్ డ్రైవర్‌గా పని ప్రారంభిస్తున్నాను. నా గత ఉద్యోగం కంటే జీతం చాలా తక్కువ. కానీ ఈ పని సరదాగా ఉంది. పిల్లలు కూడా ఎక్కువగా మంచివారే. నా సహోద్యోగులు ఎంతో ఆప్యాయంగా, దయతో ఉంటారు’ అని ఆయన పేర్కొన్నారు. తన ఉద్యోగ వేటలో మద్దతుగా నిలిచిన మాజీ సహోద్యోగులు, LinkedIn పరిచయస్తులకు స్ట్రాన్ కృతజ్ఞతలు తెలిపారు. అదే సమయంలో తనను ఉద్యోగంలో కొనసాగించకుండా చివరకు తొలగించిన మాజీ సంస్థపై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

James Strawn Linkedin Post

తనను తిరస్కరించిన వారే తనకు మెరుగైన భవిష్యత్తుకు దారి చూపించారని అన్నారు. అలాగే తన దరఖాస్తులను పరిశీలించకుండానే తిరస్కరించిన, నేరుగా సంప్రదించినా స్పందించని, ఇంటర్వ్యూలకు కూడా హాజరుకాని రిక్రూటర్లపై అసంతృప్తి వ్యక్తం చేశారు. టెక్ పరిశ్రమ మళ్లీ ఉద్యోగులను గౌరవించే విధానానికి తిరిగి రావాలని ఆయన ఆకాంక్షించారు. స్ట్రాన్ కథ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ముఖ్యంగా టెక్ పరిశ్రమలో జరుగుతున్న ఉద్యోగాల తొలగింపులు, వయసు ఆధారంగా వివక్ష వంటి అంశాలపై పలువురు మండిపడుతున్నారు. బస్ డ్రైవర్ పని కూడా Adobeలో చేసిన ఉద్యోగం అంతే ముఖ్యమని, ఆ పనిని అంకితభావంతో చేస్తే ఊహించని విధంగా ఒకరి జీవితంపై ప్రభావం చూపగలరని ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు. కార్పొరేట్ ప్రపంచం మంచి నైపుణ్యం ఉన్న ఎంతోమంది వ్యక్తులను కోల్పోతోందని, దాని ప్రభావం భవిష్యత్ తరాల్లో కనిపిస్తుందని మరో నెటిజన్‌ పేర్కొన్నారు. పిల్లలను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చడం ఎంతో బాధ్యతతో కూడుకున్న పని అని పలువురు ప్రశంసించారు. 25 ఏళ్ల టెక్ కెరీర్ తర్వాత పూర్తిగా భిన్నమైన రంగంలోకి అడుగుపెట్టిన జేమ్స్ స్ట్రాన్ కథ.. ఉద్యోగం కోల్పోయిన తర్వాత కూడా కొత్త అవకాశాలను వెతుక్కోవచ్చని, కెరీర్‌లో మార్పుకు వయసు అడ్డంకి కాదని చెప్పేందుకు ఉదాహరణగా నిలుస్తోంది.