
ఫిలిప్పీన్స్ దేశానికి చెందిన జెస్సర్ సెర్వంటెస్ అనే జాలరి ఓ చిన్న చెక్క పడవపై సముద్రంలో వేటకు వెళ్లాడు. చేపలు పడుతుండగా అతని గాలానికి ఒక పెద్ద ఆక్టోపస్ చిక్కింది. సంతోషంగా దాన్ని పడవలోకి లాగాడు. ఆ మరుక్షణమే ఊహించని ప్రమాదంలోకి వెళ్లాడు! గాలం నుంచి విడిపించుకునే క్రమంలో ఆ ఆక్టోపస్ ఒక్కసారిగా జెస్సర్ ముఖంపైకి దూకింది. తన బలమైన కాళ్లతో అతని తల చుట్టూ బిగించేసింది. శక్తివంతమైన ‘సక్కర్స్’ సహాయంతో అతని ముఖాన్ని గట్టిగా పట్టుకుంది.
నోరు, ముక్కును ఒత్తి పట్టి మూసేసింది!
ఆక్టోపస్ బంధం నుంచి విడిపించుకోవడానికి జెస్సర్ ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. పైగా అది అతని నోటిని, ముక్కును బలంగా పట్టేసుకుంది. దాంతో అతనికి ఊపిరి ఆడటం కష్టంగా మారింది. ముఖంపై చర్మం ఊడిపోతుందా అన్నంత తీవ్ర నొప్పితో విలవిలలాడాడు. కంటిచూపు కనిపించక, సముద్రం మధ్యలో ఒంటరిగా ఊపిరాడక అతను పడిన తపన వర్ణనాతీతం!
చివరి క్షణంలో సాహసోపేత పోరాటం
పడవలో ఉన్న జెస్సర్ ప్రాణాలు కాపాడుకోవడానికి శక్తులన్నీ కూడదీసుకున్నాడు. చేతికి చిక్కిన ఒక వెదురు బొంగు ముక్కను అందుకుని, ముఖానికి చుట్టుకుని ఉన్న ఆక్టోపస్‌పై బలంగా దెబ్బలు కొట్టడం ప్రారంభించాడు.అలా వరుసగా దెబ్బలు వేయడంతో ఆక్టోపస్ తన పట్టును సడలించింది. వెంటనే దాన్ని ముఖం పై నుంచి లాగి సముద్రంలోకి విసిరేసి, గాలి తీసుకుంటూ ఊపిరి పీల్చుకున్నాడు.
“ముఖం ఊడి వస్తుందేమో అనిపించింది!”
ఆ భయంకర అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ.. “నా జీవితంలో ఇంత కష్టమైన పరిస్థితిని ఎప్పుడూ చూడలేదు. ఆ ఆక్టోపస్ దెబ్బకు నా ముఖం ఊడిపోతుందేమో అనిపించింది” అని జెస్సర్ వాపోయాడు.
దీనికి సంబంధించిన షాకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు “సముద్రంలో వేట ఇంత ప్రమాదకరమా” అని కామెంట్లు చేస్తున్నారు.