
సాధారణంగా ఎవరైనా సరే ముందు క్రమశిక్షణ నేర్చుకుని, ఆ తర్వాత సంపాదన పెంచుకుంటారు. కానీ తమిళనాడుకు చెందిన 30 ఏళ్ల మణిమారన్ కృష్ణన్ ప్రయాణం ఇందుకు పూర్తి భిన్నంగా సాగింది. ముందుగా భారీగా డబ్బు చేతికి రావడం.. ఆ తర్వాత ఎదురుదెబ్బ తగలడంతో అసలు సిసలు ఆర్థిక పాఠాలు నేర్చుకున్న అతని క్రేజీ జర్నీ గిగ్ వర్కర్లకు, కంటెంట్ క్రియేటర్లకు ఒక చక్కటి గుణపాఠం.
నెలకు రూ.9,500 జీతం నుంచి..
తిరువన్నమాళిలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన మణిమారన్ సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమా పూర్తి చేసి చెన్నైకి వలస వెళ్లారు. అక్కడ సైట్ సూపర్‌వైజర్‌గా నెలకు కేవలం రూ.9,500 జీతంతో తన కెరీర్‌ను ప్రారంభించారు. నోట్ల రద్దు సమయంలో పనులు నిలిచిపోవడంతో ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి మారారు. ఆ తర్వాత 2022లో ఫేస్‌బుక్‌లో వీడియోలు చేయడం ప్రారంభించారు. సుమారు ఏడాది పాటు కష్టపడిన తర్వాత ఆయనకు పాడ్‌కాస్ట్ క్లిప్స్ చేసే విధానం కలిసొచ్చింది. అల్గారిథమ్ సహకరించడంతో ఒక్కసారిగా అతని సంపాదన ఊహించని స్థాయిలో పెరిగింది.
భారీగా వచ్చిపడిన సంపాదన..
మొదటి నెలలో సుమారు 1,200 డాలర్లు సంపాదించిన ఆయన.. తర్వాతి నెలల్లో క్రమంగా 4,000, 6,000, 7,000 డాలర్ల వరకు ఆర్జించారు. సుమారు నాలుగు నెలల కాలంలో ఆయన ప్లాట్‌ఫామ్ డిడక్షన్లు పోను దాదాపు 20వేల 600 డాలర్లు అంటే ఇది అప్పటి భారత కరెన్సీలో సుమారు రూ.16 లక్షలకు పైనే. అయితే అనుకోకుండా ఇంత డబ్బు చేతికి రావడంతో ఆయన మొదట్లో కొన్ని తప్పులు చేశారు. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ నష్టాలు, ట్రిప్స్, ఖరీదైన షాపింగ్ కోసం రూ. 4 నుంచి 5 లక్షలు ఖర్చు పెట్టారు. అద్దెకు ఫోర్డ్ ముస్తాంగ్ జీటీ కారు తెచ్చుకుని కేవలం డీజిల్‌కే రూ.23 వేల వరకు తగలేశారు.
అప్పులు లేని ఇల్లు.. ఊహించని షాక్
డబ్బు విచ్చలవిడిగా ఖర్చవుతున్న సమయంలోనే ఆయనలో మార్పు వచ్చింది. ఒకవేళ ఫేస్‌బుక్ డబ్బు ఇవ్వడం ఆపేస్తే నా పరిస్థితి ఏంటి? అనే ఆలోచన ఆయనను కదిలించింది. వెంటనే అప్రమత్తమై చెన్నైలో ఎలాంటి హోమ్ లోన్ లేకుండా నేరుగా క్యాష్ చెల్లించి ఒక ఫ్లాట్‌ను కొనుక్కున్నాడు. సరిగ్గా అదే సమయంలో మెటా పాలసీలో మార్పులు చేసింది. ఇన్‌స్ట్రీమ్ యాడ్స్, రీల్స్ బోనస్‌లను నిలిపివేయడంతో మణిమారన్ సంపాదన ఒక్కసారిగా సున్నాకి పడిపోయింది. ఆ సమయంలో ఆయన ఏడాది సంపాదన సుమారు రూ.80 లక్షల వరకు ఉన్నప్పటికీ.. ఒకే ఒక్క పాలసీ అప్‌డేట్ వల్ల ఆ ఆదాయం పూర్తిగా ఆవిరైపోయింది.
ఫ్రీలాన్సింగ్, ఎస్ఐపీలతో కొత్త జీవితం
ప్రస్తుతం ఆయన ఫ్రీలాన్సింగ్ చేస్తూ నెలకు రూ.50వేల నుంచి రూ.లక్షా 50వేల వరకు సంపాదిస్తున్నారు. సంపాదన అస్థిరంగా ఉన్నప్పటికీ తప్పుల నుంచి పాఠం నేర్చుకుని క్రమశిక్షణను అలవర్చుకున్నారు. ప్రస్తుతం ఆయన పెట్టుబడుల విలువ సుమారు రూ.50 లక్షలకు చేరుకుంది. ప్రతినెలా రూ.50వేల చొప్పున స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌లో SIP కొనసాగిస్తున్నారు. మార్కెట్ పడిపోయినా భయపడకుండా దీర్ఘకాలిక లక్ష్యాల వైపు అడుగులు వేస్తున్నారు. అధిక ఆదాయం వేరు, ఆర్థిక భద్రత వేరు అనే సత్యాన్ని చిన్న వయసులోనే గ్రహించిన మణిమారన్ ప్రయాణం ప్రస్తుతం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. అందుకే పెద్దోళ్లు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలని చెబుతుంటారు.