
India All-Time Test XI: భారత క్రికెట్ జట్టు టెస్టు చరిత్రలో 600 మ్యాచ్‌ల మైలురాయిని పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. గాలె వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టు టీమిండియాకు 600వ మ్యాచ్. ఈ సందర్భంగా భారత మాజీ క్రికెటర్ దొడ్డ గణేశ్ టీమిండియా ‘ఆల్‌టైమ్ బెస్ట్ టెస్టు ఎలెవన్’ను ఎంపిక చేశాడు. ఈ జట్టులో మాజీ, ప్రస్తుత భారత క్రికెటర్లకు చోటు కల్పించిన ఆయన.. కెప్టెన్‌గా కింగ్ విరాట్ కోహ్లీని ఎంచుకున్నాడు. అయితే ఈ ఆల్‌టైమ్ ఎలెవన్‌లో కొన్ని ఎంపికలు క్రికెట్ అభిమానుల్లో తీవ్ర చర్చకు దారితీసేలా ఉన్నాయి.
కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ:
దొడ్డ గణేశ్ ఎంపిక చేసిన జట్టుకు విరాట్ కోహ్లీని కెప్టెన్‌గా నియమించడం ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఈ జట్టులో 1983లో భారత్‌కు తొలి వన్డే ప్రపంచ కప్ అందించిన దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్ కూడా ఉన్నాడు. అయినప్పటికీ కోహ్లీకి నాయకత్వ బాధ్యతలు అప్పగించాడు. టెస్టు కెప్టెన్‌గా కోహ్లీ భారత జట్టును మరో స్థాయికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. అతడి నాయకత్వంలో టీమిండియా టెస్టు క్రికెట్‌లో ఎన్నో విజయాలు సాధించింది.
ఆసక్తికరమైన ఎంపికలు:
బ్యాటింగ్ ఆర్డర్‌లో కూడా దొడ్డ గణేశ్ ఆసక్తికరమైన ఎంపికలు చేశాడు. ఓపెనర్లుగా దిగ్గజ బ్యాటర్ సునీల్ గవాస్కర్, విధ్వంసకర ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ను ఎంపిక చేశాడు. మూడో స్థానంలో ‘ది వాల్’ రాహుల్ ద్రవిడ్‌కు చోటు కల్పించాడు. నాలుగో స్థానంలో సచిన్ టెండూల్కర్‌ను ఎంచుకున్నాడు. దీంతో కెప్టెన్ విరాట్ కోహ్లీని ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు పంపించాడు.
ధోనీ, కిర్మాణీలకు బదులుగా పంత్:
వికెట్ కీపర్ బ్యాటర్‌గా రిషభ్ పంత్‌కు చోటు కల్పించడం కూడా దొడ్డ గణేశ్ జట్టులో మరో ఆశ్చర్యకరమైన ఎంపిక అనే చెప్పాలి. భారత దిగ్గజ వికెట్ కీపర్లైన ఎంఎస్ ధోనీ, సయ్యద్ కిర్మాణీలను పక్కనపెట్టి పంత్‌ను ఎంచుకున్నాడు. అయితే పంత్‌ను ఎందుకు ఎంపిక చేశాడనే దానిపై దొడ్డ గణేశ్ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఆధునిక టెస్టు క్రికెట్‌లో పంత్ తన దూకుడైన, అంచనాలకు అందని బ్యాటింగ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నేపథ్యంలో ఈ ఎంపిక చేసి ఉండొచ్చు.
అశ్విన్‌కు చోటు.. జడేజాకు నో ఛాన్స్:
ఆల్‌రౌండర్ల విభాగంలో కపిల్ దేవ్, రవిచంద్రన్ అశ్విన్‌కు చోటు దక్కింది. కపిల్ దేవ్ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కాగా.. అశ్విన్ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా జట్టుకు వైవిధ్యాన్ని తీసుకురాగలరని చెప్పాడు. అశ్విన్‌కు చోటు కల్పించిన దొడ్డ గణేశ్.. మరో దిగ్గజ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను ఎంపిక చేయలేదు. టెస్టు క్రికెట్‌లో బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ అద్భుతంగా రాణించిన జడేజాకు ఆల్‌టైమ్ ఎలెవన్‌లో చోటు దక్కకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే దొడ్డ గణేశ్ తన ఎంపికకు ఎలాంటి కారణాలను వెల్లడించలేదు.
బౌలింగ్ విభాగంలో దిగ్గజాలే:
దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే, మాజీ పేసర్ జవగళ్ శ్రీనాథ్‌తో పాటు ప్రస్తుత భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు దొడ్డ గణేశ్ చోటు కల్పించాడు. జట్టులో ఇప్పటికే పలువురు బ్యాటర్లు, ఇద్దరు ఆల్‌రౌండర్లు ఉండటంతో బౌలర్లకు పరిమిత స్థానాలే ఉన్నాయి. ఆ స్థానాల్లో కుంబ్లే, శ్రీనాథ్, బుమ్రాలను ఎంపిక చేయడం ఆసక్తికరంగా మారింది. విరాట్ కోహ్లీని కెప్టెన్‌గా ఎంచుకోవడం, రిషభ్ పంత్‌కు ధోనీ కంటే ప్రాధాన్యం ఇవ్వడం, రవీంద్ర జడేజాను పక్కనపెట్టడం వంటి నిర్ణయాలు క్రికెట్ అభిమానుల్లో చర్చకు దారితీసే అవకాశం ఉంది.
దొడ్డ గణేశ్ ఆల్‌టైమ్ ఇండియా టెస్టు ఎలెవన్ ఇదే:
సునీల్ గవాస్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), కపిల్ దేవ్, రవిచంద్రన్ అశ్విన్, అనిల్ కుంబ్లే, జవగళ్ శ్రీనాథ్, జస్ప్రీత్ బుమ్రా.