Reading Time: 2 minutes
Ys Jagan Demands Cbi Probe Into Ap Dsc Irregularities Nara Lokesh Resignation

YS Jagan on DSC 2025 irregularities: ఏపీ డీఎస్సీ 2025లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న ప్రశ్నపత్రం లీకేజీ, అవకతవకల అంశంపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మరోసారి స్పందించారు. డీఎస్సీ వ్యవహారంలో తాము చేస్తున్న ఆరోపణలు వాస్తవమేనని ప్రభుత్వం అంగీకరిస్తోందన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, డీఎస్సీ అవకతవకలపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ ప్రశ్నపత్రాల తయారీ, పరీక్షల నిర్వహణ వంటి కీలక బాధ్యతలను ఒకే అధికారి చేతిలో పెట్టడమే అక్రమాలకు కారణమైందని ఆరోపించారు. ప్రతిపక్షం లేకుండా తండ్రీకొడుకులే బౌలింగ్, బ్యాటింగ్ చేసుకుంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌పై జగన్ విమర్శలు చేశారు.

వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ… ‘ఏపీపీఎస్సీ గ్రూప్-1పై ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేసింది. డీఎస్సీ అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలి. తప్పు చేశారు అని క్లియర్ కట్‌గా ఉన్నా.. సీబీఐ విచారణకు ఒప్పుకోవడం లేదు. డీఎస్సీలో అక్రమాలపై పోరాడుతున్నాం. మేం పోరాడుతున్న అంశాలు వాస్తవమే అని ప్రభుత్వం అంగీకరించింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి, సీబీఐ ఎంక్వైరీ వేయాలి. డీఎస్సీలో అక్రమాలపై ఆధారాలు ప్రజల ముందు ఉంచాం. డీఎస్సీలో అక్రమాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రశ్నిస్తే గింజుకుంటున్నారు తప్పు ఒప్పుకోవడం లేదు. అసెంబ్లీలో మాట్లడతారు కానీ కౌన్సిల్‌లో మాట్లాడరు. అందరికీ అర్థమవుతుందనే మండలిలో చర్చించడం లేదు. తప్పులను ప్రతిపక్షం ఎత్తిచూపుతుందని సీఎం చంద్రబాబుకు భయం. డీఎస్సీ పేపర్ తయారీ, పరీక్షల నిర్వహణ ఒకే అధికారి చేతిలో పెట్టి తప్పేముందని లోకేష్ అంటున్నారు. ఏపీ డీఎస్సీ నియామకాల చరిత్రలో రెండు బాధ్యతలు ఒకే వ్యక్తికి ఎప్పుడూ అప్పగించలేదు. రెండూ ఒక్కరికే అప్పగించడం వల్ల అక్రమాలకు బీజం పడింది’ అన్నారు.

‘డీఎస్సీ పేపర్ తయారీ, నిర్వహణ ఒక్కరే చేయడం వల్ల చెక్స్ అండ్ బ్యాలెన్స్ తప్పి స్కాంకు నాంది పడింది. ఒకే వ్యక్తి చేతిలో ఈ బాధ్యతలు ఎందుకు పెట్టారు?. డీఎస్సీ పేపర్ తయారు చేసిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగి నవీన్‌కు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని అసెంబ్లీలో చంద్రబాబు, లోకేష్ ఒప్పుకున్నారు. ఆ తర్వాత నవీన్ పేరు తీసేసి సెకండ్ మెరిట్ లిస్ట్ ఇచ్చారు. ఫస్ట్ మెరిట్ లిస్టులో ఉన్న ఫస్ట్ ర్యాంకర్ నవీన్‌కు ఎందుకు ఉద్యోగం రాలేదు. నవీన్ పేరు తీసేసి సెకండ్ మెరిట్ లిస్ట్ ఎందుకు ఇచ్చారు?. సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు రానందునే నవీన్‌కు ఉద్యోగం ఇవ్వలేదని చంద్రబాబు, లోకేష్ అంటున్నారు. ఇదే వాస్తవం అయితే నవీన్ కోర్టుకు ఎందుకెళ్లాడు?. తన లాగిన్ ఐడీ బ్లాక్ చేశారని, కాల్ లెటర్ పంపలేదని నవీన్ కోర్టుకెళ్లాడు. తన లాగిన్ ఐడీ బ్లాక్ చేశారంటూ విద్యాశాఖకు నవీన్ మెయిల్ పెట్టాడు. కాల్ లెటర్ పంపనప్పుడు నవీన్ సర్టిఫికేషన్‌కు ఎందుకు వస్తాడు?’ అని వైఎస్ జగన్ ప్రశ్నించాడు.

ఏపీపీఎస్సీ గ్రూప్-1 అంశంలో ప్రభుత్వం తమపై తప్పుడు ఆరోపణలు చేసిందని వైఎస్ జగన్ ఆరోపించారు. డీఎస్సీ అక్రమాలపై తాము ప్రజల ముందు అనేక అంశాలను ఉంచామని, వాటిపై ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉందని అన్నారు. తమను ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వం అంగీకరించడం లేదని కూడా ఆరోపించారు. ప్రతిపక్ష నేతగా తమకు అసెంబ్లీలో ఎక్కువ సమయం ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే తమను ఆ హోదాలో అంగీకరించడం లేదని వ్యాఖ్యానించారు.