Reading Time: 2 minutes

పిల్లల్లో వైకల్యాలను గుర్తించేందుకే ప్రశస్త్ యాప్ : డైరెక్టర్ నవీన్ నికోలస్

Caption of Image.
  •     ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ విద్యార్థుల వరకు 21 రకాల దివ్యాంగ లక్షణాలపై స్క్రీనింగ్ చేయాలి
  •     అధికారులకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశం 

హైదరాబాద్, వెలుగు: విద్యార్థుల్లో ఉన్న వివిధ రకాల వైకల్యాలను గుర్తించేందుకు ‘ప్రశస్త్’ మొబైల్ యాప్‌‌‌‌ను పక్కాగా అమలు చేయాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ అధికారులను ఆదేశించారు. బడికి వచ్చే పిల్లల్లో శారీరక, మానసిక లోపాలను ముందుగా గుర్తిస్తే వారికి మెరుగైన భవిష్యత్తును అందించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమ మార్గదర్శకాలను మంగళవారం ఆయన విడుదల చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, రెసిడెన్షియల్ స్కూళ్లలో ఈ స్క్రీనింగ్ ప్రక్రియను మిషన్ మోడ్‌‌‌‌లో చేపట్టాలని స్పష్టం చేశారు. 

ప్రీ-ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరినీ ఈ ప్రోగ్రామ్ కింద కవర్ చేస్తామని తెలిపారు. ఎన్సీఈఆర్టీ రూపొందించిన ఈ యాప్ ద్వారా మొత్తం 21 రకాల వైకల్యాలను టీచర్లు స్క్రీనింగ్ చేయాలని సూచించారు. తొలుత రెగ్యులర్ టీచర్లు పిల్లల ప్రవర్తన, శారీరక లక్షణాలను గమనించి యాప్‌‌‌‌లో నమోదు చేస్తారని, అవసరమైతే స్పెషల్ ఎడ్యుకేటర్లతో రెండో విడత వెరిఫికేషన్ చేయిస్తామని వివరించారు. ఇది కేవలం ప్రాథమిక గుర్తింపు మాత్రమేనని, వైద్య నిర్ధారణ కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రక్రియపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 3.65 లక్షల మంది టీచర్లకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. యూడైస్ ప్లస్‌‌‌‌లో నమోదైన ప్రతి టీచర్ ‘ప్రశస్త్’ యాప్‌‌‌‌ లేదా పోర్టల్‌‌‌‌లోని ట్రైనింగ్ వీడియోలు, మాడ్యూల్స్ చూసి ఆగస్టు 31వ తేదీలోపు శిక్షణ పూర్తి చేయాలని ఆదేశించారు.

బడులకు ‘స్వచ్ఛ’ రేటింగ్..

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో పరిశుభ్రత, పచ్చదనంపై ‘స్వచ్ఛ ఏవం హరిత్ విద్యాలయ రేటింగ్’ 2026ను పకడ్బందీగా అమలు చేయాలని డైరెక్టర్ నవీన్ నికోలస్ అధికారులను ఆదేశించారు. స్కూళ్లలో తాగునీరు, మరుగుదొడ్లు, వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ చర్యలపై ఈ రేటింగ్ ఇస్తారని తెలిపారు. రాష్ట్రంలోని 42,082 పాఠశాలలు సెప్టెంబర్ 30లోగా పోర్టల్‌‌‌‌లో రిజిస్టర్ చేసుకొని సెల్ఫ్ అసెస్‌‌‌‌మెంట్ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. గతేడాది తెలంగాణ నుంచి 10 స్కూళ్లు జాతీయ స్థాయి గుర్తింపు సాధించాయని, ఈసారి మరిన్ని బడులు ‘క్లీన్ అండ్ గ్రీన్’ రేటింగ్ సాధించి దేశంలోనే తెలంగాణను అగ్రస్థానంలో నిలపాలని పిలుపునిచ్చారు.

©️ VIL Media Pvt Ltd.