Reading Time: < 1 minute
Ap High Court Warns Officials Over Delay In Court Orders

AP High Court: కోర్టు ఆదేశాల అమలులో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న అంశంపై ఏపీ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. వివిధ కేసుల్లో కౌంటర్లు, స్థాయి నివేదికలు, మెమోలు దాఖలు చేయాలని ఆదేశిస్తున్నప్పటికీ అధికారులు వాటిని తేలిగ్గా తీసుకుంటున్నట్లు తమ దృష్టికి వస్తోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. చాలా కేసుల్లో విచారణకు ముందు రోజు లేదా విచారణ జరిగే రోజే కౌంటర్లు, నివేదికలు దాఖలు చేస్తున్నారని హైకోర్టు పేర్కొంది. ఈ విధానం సరైనది కాదని స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాలను సకాలంలో అమలు చేసి, అవసరమైన వివరాలను ముందుగానే సమర్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించింది.

అధికారులపై కఠినంగా వ్యవహరించాలి
కౌంటర్లు, నివేదికలు సమర్పించడంలో జాప్యం చేస్తున్న అధికారుల విషయంలో ఉదారంగా వ్యవహరించవద్దని అడ్వొకేట్ జనరల్‌కు హైకోర్టు స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాలను అధికారులు గౌరవించేలా చర్యలు తీసుకోవాలని, నిర్దేశించిన సమయంలోనే వివరాలు సమర్పించేలా చూడాలని ఏజీకి సూచించింది. అయితే ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్నట్లు భావించవద్దని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. అయినప్పటికీ సకాలంలో నివేదికలు సమర్పించకపోవడంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది.

పోలీస్ శాఖలో ఖాళీల భర్తీపై పిల్
ఇదిలా ఉండగా, పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులను భర్తీ చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై కూడా ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. అదేవిధంగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పోలీసుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను పరిశీలించేందుకు హైకోర్టు సుమోటోగా పిటిషన్ నమోదు చేసి విచారణ చేపట్టింది. ఈ రెండు పిటిషన్లను బుధవారం విచారించిన హైకోర్టు ధర్మాసనం.. సంబంధిత వివరాలతో నివేదికలు సమర్పించాలని ఆదేశించింది. అయితే నివేదికలు దాఖలు చేసేందుకు ప్రభుత్వం తరఫున మరింత సమయం కోరడంతో ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాల అమలులో ఇకపై ఇలాంటి జాప్యాలు లేకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని హైకోర్టు సూచించింది.