Reading Time: < 1 minute

ప్రిన్సిపాల్ రూపారెడ్డి కేసులో సంచలన నిజాలను బయటపెట్టిన నల్గొండ జిల్లా ఎస్పీ !

Caption of Image.

నల్గొండ: నల్గొండ జిల్లాలో స్కూల్ ప్రిన్సిపాల్ హత్య కేసులో మిస్టరీ వీడింది. నాగార్జున కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది అదే స్కూల్లో చదువుతున్న టెన్త్ క్లాస్ విద్యార్థులేనని పోలీసులు తేల్చారు. ఈ కేసుకు సంబంధించి నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రెస్ మీట్లో కీలక విషయాలను మీడియాకు వెల్లడించారు.

ప్రిన్సిపాల్ ఇంట్లో హత్యకు ముందు రోజు కొందరు విద్యార్థులు దొంగతనానికి వెళ్లారని.. అయితే ప్రిన్సిపాల్ రూపారెడ్డి విద్యార్థులను గుర్తుపట్టిందని ఎస్పీ శరత్ చెప్పారు. బయట చెప్తుందనే భయంతోనే ఆమెను చంపేశారని ఎస్పీ ఈ హత్య కేసులో మిస్టరీ గురించి వివరించారు. ముగ్గురు నిందితులు నాగార్జున కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులేనని చెప్పారు. జల్సాలకు అలవాటు పడి డబ్బుల కోసమే హత్య చేశారని ఎస్పీ వెల్లడించారు. నిందితులను నల్గొండ జిల్లా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

ఆగస్ట్ 11న నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య జరిగిన విషయం విదితమే. హత్య తర్వాత 4 లక్షల రూపాయలు చోరీ చేశారు. ఈ హత్య కేసులో మొత్తం 80 మందిని పోలీసులు విచారించారు. ప్రిన్సిపాల్ చనిపోతే స్కూల్కు 4 రోజులు సెలవు ఇచ్చారని ఎస్పీ శరత్ తెలిపారు. అనుమానం ఉన్న ఐదుగురిని విచారించామని, హత్య చేసినోళ్లంతా మైనర్లేనని ఎస్పీ శరత్ చెప్పారు.

ఈ ఘోరానికి పాల్పడిన విద్యార్థుల దగ్గర లక్షా 65 వేల డబ్బు దొరికిందని, వాళ్ల దగ్గర ఉన్న డబ్బుపై రక్తపు మరకలు ఉన్నాయని తెలిపారు. వీళ్లలో ఒక విద్యార్థి ఐఫోన్ కొన్నాడని, సీజ్ చేశామని ఎస్పీ చెప్పారు. రూపారెడ్డి చివరి సారిగా బాబూ అని పిలిచిందని, బాబు అని ఎవరిని పిలిచిందనే కోణంలో విచారించామని ఎస్పీ శరత్ వివరించారు. ప్రిన్సిపాల్ రూపారెడ్డిని 27 సార్లు కత్తితో పొడిచారని ఎస్పీ కీలక విషయాలను వెల్లడించారు.

©️ VIL Media Pvt Ltd.