Reading Time: 2 minutes
Shaheen Afridi: ఒకే మ్యాచ్‌లో 7 వికెట్లు.. హ్యాట్రిక్‌తో అఫ్రీదీ విధ్వంసం.. జట్టును ఛాంపియన్‌గా నిలిపిన పేసర్

Shaheen Afridi: పాకిస్థాన్ స్టార్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా అఫ్రీదీ వన్డే క్రికెట్‌లో మరపురాని రికార్డు నమోదు చేశాడు. నేషనల్ ఛాంపియన్స్ కప్ 2026 ఫైనల్ పోరులో అద్భుతమైన హ్యాట్రిక్‌తో పాటు ఏకంగా 7 వికెట్లు పడగొట్టి తన కెరీర్‌లోనే అత్యుత్తమ ప్రదర్శనతో జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. నేషనల్ ఛాంపియన్స్ కప్ ఫైనల్ పోరులో పాకిస్థాన్ గోల్డ్, పాకిస్థాన్ గ్రీన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ గోల్డ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన షాహీన్ అఫ్రీదీ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. బ్యాటర్లు అద్భుతంగా రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో పాకిస్థాన్ గోల్డ్ జట్టు 340 పరుగుల భారీ స్కోరు సాధించింది. కొండంత లక్ష్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యతను ప్రధాన బౌలర్‌గా, కెప్టెన్‌గా షాహీన్ తన భుజాలపై వేసుకున్నాడు. మైదానంలోకి దిగిన మొదటి ఓవర్ నుంచే ప్రత్యర్థిపై తీవ్రమైన ఒత్తిడి పెంచుతూ వికెట్ల పతనాన్ని శాసించాడు.

పాకిస్థాన్ గ్రీన్ జట్టుకు 341 పరుగుల భారీ లక్ష్యం మైండ్ గేమ్‌గా మారింది. దానికి తోడు షాహీన్ వేసే వేగవంతమైన బంతులకు వారి వద్ద సమాధానమే లేకుండా పోయింది. మొదటి 6 ఓవర్లలోనే 29 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు తీసిన షాహీన్, ఆ తర్వాత మరింత భయంకరంగా మారాడు. తదుపరి వేసిన కేవలం 15 బంతుల్లోనే 7 పరుగులు మాత్రమే ఇచ్చి మరో 4 వికెట్లు పడగొట్టాడు. ఈ అద్భుత స్పెల్‌తో ప్రత్యర్థి జట్టు కోలుకోలేని దెబ్బతిని కనీసం పోరాటం కూడా చేయలేకపోయింది.

ఈ ఇన్నింగ్స్‌లో షాహీన్ సాధించిన హ్యాట్రిక్ మ్యాచ్‌కే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మెహ్రాన్ ముమ్తాజ్, సల్మాన్ మీర్జా, మొహమ్మద్ హస్నైన్ వరుస బంతుల్లో షాహీన్ దాడికి బలైపోయారు. ఈ హ్యాట్రిక్‌తోనే పాకిస్థాన్ గ్రీన్ జట్టు ఇన్నింగ్స్ ముగిసింది. మొత్తంగా 8.3 ఓవర్లు బౌలింగ్ చేసిన షాహీన్ అఫ్రీదీ 36 పరుగులు మాత్రమే ఇచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. ఇది అతని లిస్ట్-ఎ లేదా వన్డే కెరీర్‌లోనే అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనగా నిలిచింది.

కెప్టెన్ షాహీన్ సృష్టించిన విధ్వంసంతో 341 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ గ్రీన్ జట్టు 37.3 ఓవర్లలో కేవలం 239 పరుగులకే ఆలౌటైంది. దీంతో పాకిస్థాన్ గోల్డ్ జట్టు 101 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించి ఛాంపియన్‌గా నిలిచింది. టెస్టు జట్టుకు దూరంగా ఉన్నప్పటికీ, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తాను ఎంతటి ప్రమాదకరమైన బౌలరో షాహీన్ మరోసారి రుజువు చేసుకున్నాడు.

 

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..