Reading Time: < 1 minute
Mahbubabad Students Protest Ci Viral Video

CI Viral Video : మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన బాట పట్టిన పాలిటెక్నిక్ విద్యార్థుల పట్ల పోలీస్ అధికారి అత్యంత దురుసుగా ప్రవర్తించడం కలకలం రేపింది. ఆందోళన చేస్తున్న సమయంలో సీఐ రఘుపతి రెడ్డి ఇద్దరు విద్యార్థుల గొంతును గట్టిగా నొక్కి పట్టి కాసేపటి వరకు వదలకుండా చేయడంతో ఆ విద్యార్థులు ఊపిరాడక తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

సోషల్ మీడియాలో వీడియో వైరల్.. మండిపడుతున్న స్థానికులు

శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై సీఐ రఘుపతి రెడ్డి చెయ్యి చేసుకుని గొంతు నొక్కి పట్టిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. పరిస్థితిని సమన్వయంతో అదుపులోకి తీసుకురావాల్సిన బాధ్యతాయుతమైన పోలీస్ ಅಧಿಕారి, విద్యార్థుల పట్ల ఇలా ప్రవర్తించడం పట్ల స్థానికులు, ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ హక్కుల కోసం, న్యాయమైన డిమాండ్ల కోసం ఆందోళన బాట పట్టిన విద్యార్థుల పట్ల పోలీసుల ఈ వైఖరిపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.

సీఐపై చర్యలకు విద్యార్థి సంఘాల డిమాండ్

విద్యార్థులపై అమానుషంగా ప్రవర్తించిన సీఐ రఘుపతి రెడ్డిపై తక్షణమే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని పలు విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. విద్యార్థుల ప్రాణాలకు ముప్పు కలిగించేలా ప్రవర్తించిన సదరు అధికారిని విధుల్లోంచి తొలగించాలని, బాధితులకు న్యాయం చేయాలని వారు స్పష్టం చేస్తున్నారు.