Reading Time: 2 minutes

మెక్‌డొనాల్డ్‌లో శ్రావణ మాస ప్రత్యేక మెనూ: ఉల్లి, వెల్లుల్లి లేని బర్గర్స్ సోషల్ మీడియాలో వైరల్!

Caption of Image.

ఫాస్ట్‌ఫుడ్ దిగ్గజం మెక్‌డొనాల్డ్స్ భారతదేశంలో ఎప్పుడూ తన మెనూను స్థానిక రుచులకు తగినట్లుగా మలుచుకుంటూనే ఉంటుంది. తాజాగా ఒక కస్టమర్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోతో మెక్‌డొనాల్డ్స్ మరోసారి ఫుడ్ లవర్స్ దృష్టిని ఆకట్టుకుంటోంది. పవిత్రమైన శ్రావణ మాసాన్ని దృష్టిలో ఉంచుకుని మెక్‌డొనాల్డ్స్ ప్రత్యేకంగా “శ్రావణ స్పెషల్” మెనూను ప్రవేశపెట్టడం ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వినూత్న ప్రయోగం ఫుడ్ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది. 

మెక్‌డొనాల్డ్స్ అవుట్‌లెట్‌లో పూర్తిగా ఉల్లి, వెల్లుల్లి లేని వంటకాలతో కూడిన ప్రత్యేక మెనూ సోషల్ మీడియాలో షేరింగ్ అవుతోంది. ఇందులో ముఖ్యంగా ఎంకాటూ టిక్కి నాంగ్ బర్గర్, మెక్సికన్ ఎంకాటూ టిక్కి నాంగ్ బర్గర్, మెక్‌చీజ్ బర్గర్ (వెజ్), సిగ్నేచర్ 7 వెగ్గీస్ బర్గర్ వంటి ఐటమ్స్ ఉన్నాయి. వీటితో పాటు ఉప్పు లేని ఫ్రెంచ్ ఫ్రైస్, స్ట్రాబెర్రీ లేదా చాక్లెట్ షేక్స్‌తో కూడిన కాంబో మీల్స్‌ను కూడా ఈ శ్రావణ మెనూలో చేర్చారు. శ్రావణ మాసంలో ఉపవాసాలు ఉండే వారు.. సాత్విక ఆహారం కోరుకునే వారిని లక్ష్యంగా చేసుకునే ఈ మెనూను రూపొందించినట్లు తెలుస్తోంది.

ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. మెక్‌డొనాల్డ్స్ శ్రావణ మాసపు ఉపవాస భోజనాన్ని అందించడం చూడటం ఇదే మొదటిసారంటూ కొందరు సరదాగా కామెంట్లు చేస్తుంటే.. మరికొందరు గ్లోబల్ బ్రాండ్లు మన దేశ సంప్రదాయాలకు ఎలా తలవంచాల్సి వస్తోందో అని ప్రశంసిస్తున్నారు. మరోవైపు కేఎఫ్‌సీలో లెమన్ రైస్ దొరికినట్లే.. మెక్‌డొనాల్డ్స్ కూడా మన లోకల్ టేస్ట్ కల్చర్‌కు పూర్తిగా అడాప్ట్ అయిపోయిందని ఫుడ్ లవర్స్ అంటున్నారు..

ఈ మెనూపై కొన్ని భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇది నిజమైన శ్రావణ ఉపవాస ఆహారమేనా అనే అనుమానాన్ని కొందరు లేవనెత్తారు. సాంప్రదాయ ఉపవాసాలలో సాధారణ బర్గర్ బ్రెడ్, మైదా పదార్థాలను తినరు కాబట్టి.. సగ్గుబియ్యం, బంగాళాదుంపలతో కూడిన వంటకాలు ఉండాలని కొందరు అభిప్రాయపడ్డారు. కేవలం ఉల్లి, వెల్లుల్లిని తొలగించి దానిని ‘శ్రావణ స్పెషల్’ అనడం కొంత గందరగోళానికి గురిచేస్తోందని విమర్శించారు. ఏదేమైనా ఫాస్ట్‌ఫుడ్ ప్రియులకు, ట్రెడిషనల్ ఫుడ్స్‌కు మధ్య మెక్‌డొనాల్డ్స్ చేసిన ఈ ప్రయోగం మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

©️ VIL Media Pvt Ltd.