Reading Time: 2 minutes
డిజిటల్ చెల్లింపులు పెరిగినా నగదుకు తగ్గని డిమాండ్.. ప్రపంచంలోనే అత్యధిక కరెన్సీ నోట్లు భారత్‌లోనే.. ఎన్ని కోట్లంటే?

దేశంలో డిజిటల్ చెల్లింపులు వేగంగా పెరుగుతున్నప్పటికీ.. నగదుపై ఆధారపడటం మాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా తక్కువ విలువ కలిగిన కరెన్సీ నోట్లకు భారీగా డిమాండ్ కొనసాగుతోంది. ఫలితంగా దేశంలో చలామణీలో ఉన్న కరెన్సీ నోట్ల సంఖ్య ఏకంగా 17,600 కోట్లకు చేరుకుంది. భారత కరెన్సీలో తక్కువ విలువ కలిగిన ₹1, ₹5, ₹10, ₹20, ₹50, ₹100, ₹200, ₹500 నోట్లు పెద్ద మొత్తంలో చలామణిలో ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) డిప్యూటీ గవర్నర్ శిరీష్ చంద్ర ముర్ము వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం దేశంలో సుమారు 17,600 కోట్ల కరెన్సీ నోట్లు ప్రజల వినియోగంలో ఉన్నాయి.

అయితే, ఇది ప్రపంచ వ్యాప్తంగా చెలామణిలో ఉన్న డాలర్ నోట్లు 5600 కోట్ల కంటే ఇవి 3 రెట్లు, యూరో నోట్లు 3000 కోట్లు కంటే 6 రెట్లు అధికం కావడం గమనార్హం. జకార్తాలో జరిగిన బ్యాంక్ ఆఫ్ ఇండోనేషియా క్యాష్ మేనేజ్‌మెంట్ సదస్సులో ఈ వివరాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. ప్రపంచంలోని ఇతర ప్రధాన కరెన్సీలతో పోలిస్తే భారతదేశంలో చలామణిలో ఉన్న నోట్ల సంఖ్య గణనీయంగా ఎక్కువగా ఉండటం ఆసక్తికరంగా మారింది.

ఏటా 3,000 కోట్ల కొత్త నోట్లు

భారత్‌లో నగదు లావాదేవీల్లో తక్కువ విలువ కలిగిన నోట్ల వినియోగం అధికంగా ఉండటంతో.. వాటి అవసరం కూడా ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా పాత నోట్లు పాడైపోవడం, వినియోగానికి పనికిరాకపోవడం వంటి కారణాలతో వాటి స్థానంలో కొత్త నోట్లను ముద్రించాల్సి వస్తోంది. RBI గణాంకాల ప్రకారం దేశంలో ఏటా దాదాపు 3,000 కోట్ల వరకు కొత్త కరెన్సీ నోట్లు ముద్రిస్తున్నారు. అదే సమయంలో పాడైన, చిరిగిన లేదా వినియోగానికి పనికిరాని సుమారు 2,100 కోట్ల నోట్లను ఏటా ఉపసంహరించి ధ్వంసం చేస్తున్నారు.

డిజిటల్ చెల్లింపులు పెరిగినా.. నగదుకు డిమాండ్ ఎందుకు?

UPI, ఇంటర్నెట్ బ్యాంకింగ్, కార్డులు వంటి డిజిటల్ చెల్లింపు విధానాలు విస్తృతంగా అందుబాటులోకి వచ్చినప్పటికీ.. దేశంలో నగదు వినియోగం పూర్తిగా తగ్గలేదు. ముఖ్యంగా చిన్న మొత్తాల లావాదేవీలు, గ్రామీణ ప్రాంతాలు, చిన్న వ్యాపారాల్లో నగదు ఇప్పటికీ కీలక పాత్ర పోషిస్తోంది.

డిజిటల్ చెల్లింపులు పెరుగుతున్న సమయంలోనే నగదు చెలామణి కూడా వృద్ధి చెందడం భారత ఆర్థిక వ్యవస్థలో నగదుకు ఉన్న ప్రాధాన్యతను సూచిస్తోంది. దీంతో ఒకవైపు డిజిటల్ ఎకానమీ విస్తరిస్తుండగా.. మరోవైపు కరెన్సీ నోట్ల అవసరం కూడా కొనసాగుతోంది.

కరెన్సీ నిర్వహణపై RBI దృష్టి

నోట్ల ముద్రణ, పాత నోట్ల ఉపసంహరణ, వాటి స్థానంలో కొత్త నోట్లను ప్రవేశపెట్టడం వంటి ప్రక్రియలకు భారీ స్థాయిలో మౌలిక సదుపాయాలు, నిర్వహణ అవసరం అవుతాయి. ఈ నేపథ్యంలో కరెన్సీ నిర్వహణ వ్యయాన్ని తగ్గించడం, నోట్ల జీవితకాలాన్ని పెంచడం వంటి అంశాలపై RBI దృష్టి సారిస్తోంది. డిజిటల్ చెల్లింపుల విస్తరణ కొనసాగుతున్నప్పటికీ.. దేశ ఆర్థిక వ్యవస్థలో నగదు పాత్ర ఇప్పటికీ కీలకంగానే ఉందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.