Reading Time: 3 minutes
Jharkhand Jssc Cgl Selected Candidate Wife Job Loss Protest

జార్ఖండ్‌లో JSSC-CGL 2024 సహా పలు ప్రభుత్వ నియామక పరీక్షలను రద్దు చేస్తూ హేమంత్ సోరెన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మరో కొత్త ఆందోళనకు దారితీసింది. పరీక్షల రద్దును కోరుతూ దాదాపు నెల రోజులుగా విద్యార్థులు చేస్తున్న నిరసనలకు ప్రభుత్వం స్పందించి రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటికే JSSC-CGL 2024లో ఎంపికై ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరిన 1,975 మంది అభ్యర్థులు ఇప్పుడు రోడ్డున పడ్డారు. తమ ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి రావడంతో ఆందోళనకు దిగారు. తమ ఉద్యోగాలను రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం భారీ వర్షంలోనూ అభ్యర్థులు రాంచీలోని జార్ఖండ్ సచివాలయం దగ్గర నిరసన చేపట్టారు.

సీఎం చేతుల మీదుగా అపాయింట్‌మెంట్ లెటర్

ఛత్రా జిల్లాకు చెందిన రఘువేంద్ర JSSC-CGL పరీక్షలో ఉత్తీర్ణత సాధించి సచివాలయంలో ఉద్యోగం చేస్తున్నారు. అంతకుముందు గయలో సోషల్ సైన్స్ టీచర్‌గా పనిచేశారు. ‘‘ముఖ్యమంత్రి స్వయంగా నాకు అపాయింట్‌మెంట్ లెటర్ అందించారు. ఇప్పుడు ఆయనే నా ఉద్యోగాన్ని తీసేశారు’’ అంటూ రఘువేంద్ర భావోద్వేగానికి గురయ్యారు. CGL నియామక ఫలితాలు వచ్చినప్పుడు ఉద్యోగంలో చేరడంపై కొంత సందేహం ఉన్నప్పటికీ.. 2026 జనవరి 5న సుప్రీంకోర్టు నియామకాలను రద్దు చేయాలన్న డిమాండ్‌ను తిరస్కరించడంతో జనవరి 8న గయలోని తన టీచర్ ఉద్యోగానికి రాజీనామా చేసి JSSC ఉద్యోగంలో చేరినట్లు తెలిపారు.

‘‘ఇప్పుడు నాకు కొత్త ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలు రాసే వయసు కూడా దాటిపోయింది. ప్రభుత్వం అప్పుడే నియామకాన్ని రద్దు చేసి ఉంటే నేను ఈ ఉద్యోగంలో చేరేవాడిని కాదు. ఇప్పుడు అటు టీచర్ ఉద్యోగం లేదు.. ఇటు ఈ ఉద్యోగం కూడా లేదు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక కోడెర్మాకు చెందిన సందీప్ యాదవ్ విజిలెన్స్ శాఖలో పనిచేస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రాజెక్ట్ భవన్‌లో విధులు నిర్వహించేవారు. అయితే మంగళవారం అదే కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా గార్డు అడ్డుకున్నారని తెలిపారు. ‘‘నా ఐడీ కార్డు చూసి లోపలికి అనుమతించబోమని చెప్పారు. పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత గత ఏడాది ఉద్యోగంలో చేరాను. ఎవరి దయతోనూ నాకు ఉద్యోగం రాలేదు. అయినా ఇప్పుడు ఆఫీసులోకి వెళ్లేందుకు కూడా అనుమతి లేదు. ప్రజల ఒత్తిడితో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది’’ అని సందీప్ అన్నారు. సందీప్‌కు రెండు నెలల క్రితమే వివాహమైంది. ఉద్యోగం కోల్పోవడం తన వైవాహిక జీవితంపై కూడా ప్రభావం చూపుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘ఇంటికి వెళ్లి నా భార్యతో.. ‘నువ్వు నాకు ఉద్యోగం ఉందని పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు నాకు ఉద్యోగం లేదు. కావాలంటే ఈ బంధాన్ని ముగించుకోవచ్చు’ అని చెప్పాను’’ అని సందీప్ ఆవేదన వ్యక్తం చేశారు.

‘మమ్మల్ని ఎవరు నమ్మాలి?’

దియోఘర్‌కు చెందిన లలన్ పాండే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ASO)గా ఎంపికై జంషెడ్‌పూర్‌లో పోస్టింగ్ పొందారు. తల్లిదండ్రులు, భార్య, ఇద్దరు పిల్లలతో కూడిన కుటుంబానికి ఆయనే ప్రధాన ఆధారం. ‘‘ఇప్పుడు మరో నియామక పరీక్ష రాసే వయసు కూడా లేదు. చిన్న పిల్లలు ఉన్నారు. వారి చదువులు ఎలా కొనసాగించాలి? మాపై జరుగుతున్నది తీవ్ర అన్యాయం. ప్రభుత్వం మమ్మల్ని కాల్చి చంపితేనే బాగుండేది’’ అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

గుంజన్ సింగ్ కూడా ఇదే తరహాలో స్పందించారు. అంతకుముందు ఆయన రైల్వేలోని అసన్సోల్ డివిజన్‌లో పనిచేశారు. సొంత ప్రాంతానికి తిరిగి రావాలనే ఉద్దేశంతో JSSC ఉద్యోగాన్ని ఎంచుకున్నానని చెప్పారు. ‘‘మా ఉద్యోగాలు తీసుకోవడం ద్వారా ప్రభుత్వం మమ్మల్ని చంపేసినట్టే. కాల్చి చంపితేనే బాగుండేది. ఇంటికి తిరిగి రావాలని ఎవరు కోరుకోరు?’’ అని ప్రశ్నించారు. తనపై ఎలాంటి విచారణకైనా సిద్ధమని, అవసరమైతే నార్కో టెస్ట్‌కు కూడా సిద్ధమని గుంజన్ తెలిపారు. ‘‘సుప్రీంకోర్టు తీర్పు తర్వాతే మేము ఉద్యోగాల్లో చేరాం. పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించినప్పుడు నా చెవులను నేనే నమ్మలేకపోయాను. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా నియామకాలను రద్దు చేస్తే.. ఇక మమ్మల్ని ఎవరు నమ్మాలి?’’ అని ప్రశ్నించారు.

మొదటి నుంచీ వివాదాలే..

JSSC-CGL 2024 నియామక ప్రక్రియ ప్రారంభం నుంచే వివాదాల్లో చిక్కుకుంది. 2024 జనవరిలో తొలిసారి పరీక్ష నిర్వహించగా ప్రశ్నపత్రం లీక్ కావడంతో పరీక్షను వెంటనే రద్దు చేశారు. అనంతరం సెప్టెంబర్‌లో మళ్లీ పరీక్ష నిర్వహించారు. అయితే ఈసారి కూడా అక్రమాలకు సంబంధించిన తీవ్ర ఆరోపణలు వచ్చాయి. CID దర్యాప్తు నివేదిక ప్రకారం.. పరీక్షకు ముందు కొందరు అభ్యర్థులను హజారీబాగ్, బొకారో, అసన్సోల్, అంతేకాకుండా నేపాల్‌కు కూడా తీసుకెళ్లినట్లు ఆరోపణలు వచ్చాయి. అక్కడ 150 ప్రశ్నల్లో 120 ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలను వారికి కంఠస్థం చేయించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ వ్యవహారం జార్ఖండ్ హైకోర్టుకు చేరడంతో FIR కూడా నమోదైంది.

2025 డిసెంబర్‌లో అనుమానితులను మినహాయించి మిగిలిన అభ్యర్థులందరికీ అపాయింట్‌మెంట్ లెటర్లు ఇవ్వాలని జార్ఖండ్ హైకోర్టు ఆదేశించింది. 2026 జనవరిలో నియామకాలను రద్దు చేయాలన్న డిమాండ్‌ను సుప్రీంకోర్టు కూడా తిరస్కరించింది. దీంతో ఇప్పుడు ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితిని ఎదుర్కొంటున్న 1,975 మంది ఎంపికైన అభ్యర్థులు ఆ తీర్పులను ప్రస్తావిస్తున్నారు.

విద్యార్థులపై కోపం లేదంటున్న ఎంపికైన అభ్యర్థులు

పరీక్షల రద్దు కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థులపై తమకు ఎలాంటి కోపం లేదని ఎంపికైన అభ్యర్థి ప్రిన్స్ తెలిపారు. ‘‘వారిపై మాకు ఎలాంటి ద్వేషం లేదు. వారు మా తమ్ముళ్లు, అన్నదమ్ముల్లాంటి వారు. ఇది అదృష్టం, కష్టం, అవకాశానికి సంబంధించిన విషయం. ఏదో ఒక రోజు వారు కూడా ఉద్యోగాలకు ఎంపికయ్యే అవకాశం ఉంది’’ అని అన్నారు. అయితే తమ సమస్యలకు పరిష్కారం లభించే వరకు నిరసనలు కొనసాగిస్తామని ఎంపికైన అభ్యర్థులు స్పష్టం చేశారు. అవసరమైతే న్యాయపరమైన చర్యలు కూడా తీసుకుంటామని తెలిపారు.