Reading Time: 2 minutes

హిందూ వివాహం విడదీయరాని పవిత్ర సంస్కారం కాదు.. ఒక ఒప్పందమే: విడాకులపై ఏపీ హైకోర్టు తీర్పు

Caption of Image.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు హిందూ వివాహ చట్టానికి సంబంధించి ఒక సంచనాత్మక తీర్పును వెలువరించింది. 5 దశాబ్దాలకు పైగా వివాహ బంధంలో ఉండి.. దాదాపు 49 సంవత్సరాలుగా వేర్వేరుగా జీవిస్తున్న వృద్ధ దంపతుల వివాసాన్ని రద్దు చేస్తూ ధర్మాసనం తీర్పు వెలువరించింది. హిందూ వివాహం అనేది విడదీయరాని పవిత్ర సంస్కారంగా కాకుండా.. ఒక ఒప్పంద రూపంగా మారిందని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. అమరావతిలోని హైకోర్టులో జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ సునీత గంధంలతో కూడిన డివిజన్ బెంచ్ ఆగస్టు 13, 2026 న ఈ తీర్పును వెలువరించింది. 

కేసు వివరాలు:
ఈ దంపతులకు జూన్ 4, 1972 లో హిందూ ఆచారాల ప్రకారం వివాహం జరిగింది. వీరికి సంతానం కలగలేదు. పెళ్లయిన కొద్ది కాలానికే మనస్పర్థలు రావడంతో సెప్టెంబర్ 1, 1978 జంట వేర్వేరుగా ఉంటున్నారు. అంటే దాదాపు 49 సంవత్సరాలుగా వారు విడిగానే జీవిస్తున్నారు. 77 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగి అయిన భర్త నెల్లూరు ఫ్యామిలీ కోర్టులో క్రూరత్వం, విడిచిపెట్టి వెళ్లడం వంటి కారణాల ఆధారంగా విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశారు. 2024 జూన్ లో ఫ్యామిలీ కోర్టు ఆ పిటిషన్‌ను అనుమతించింది. దీనిని సవాల్ చేస్తూ భార్య 72 ఏళ్ల వయస్సులో హైకోర్టును ఆశ్రయించారు.

పరస్పర అంగీకార విడాకులు:
హైకోర్టులో అప్పీలు పెండింగ్‌లో ఉన్న సమయంలో ఇరుపక్షాలు రాజీకి వచ్చాయి. కంటెస్టెడ్ డైవర్స్ పిటిషన్‌ను హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 13-బి కింద పరస్పర అంగీకార విడాకులుగా మార్చాలని కోరుతూ భార్య దరఖాస్తు చేసుకున్నారు. భర్త నెలకు రూ. 20వేలు భరణం చెల్లించడం, ఒకరిపై ఒకరు పెట్టిన క్రిమినల్ కేసులను ఉపసంహరించుకోవడం వంటి షరతులతో ఇరుపక్షాలు రాజీ మెమోను దాఖలు చేశాయి. కోర్టు ఇరువైపులా రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించినప్పటికీ.. ఏళ్లుగా కొనసాగుతున్న విభేదాల కారణంగా వారు కలిసి ఉండేందుకు అంగీకరించలేదు.

కూలింగ్ ఆఫ్ పీరియడ్ నిబంధనపై హైకోర్టు స్పష్టత:
హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 13-బి(2) ప్రకారం మొదటి, రెండో మోషన్‌ల మధ్య 6 నెలల కూలింగ్ ఆఫ్ పీరియడ్ ఉండాలి. అయితే ఈ నిబంధన తూచా తప్పకుండా పాటించాల్సిన తప్పనిసరి రూల్ కాదని, కేవలం నిర్దేశితం మాత్రమేనని హైకోర్టు స్పష్టం చేసింది. ‘శిల్పా శైలేష్ వర్సెస్ వరుణ్ శ్రీనివాసన్’ కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును బెంచ్ ప్రాతిపదికగా తీసుకుంది. వివాహం మళ్లీ కుదిరే అవకాశం లేనప్పుడు, 6 నెలల నిరీక్షణ కాలం దంపతుల బాధను మరింత పెంచుతుందని ధర్మాసనం గతంలో పేర్కొంది.

సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం వివాహం పూర్తిగా కోలుకోలేని విధంగా దెబ్బతిన్నదని కోర్టు నిర్ధారించుకున్న తరుణంలో ఈ నిబంధనను మినహాయించవచ్చు. ఈ కేసుకు సంబంధించి ఇరువర్గాల మధ్య సయోధ్య కుదిరే అవకాశం లేకపోవడంతో.. ఆరు నెలల వెయిటింగ్ కాలాన్ని హైకోర్టు మినహాయించింది. దంపతులు దాఖలు చేసిన రాజీ మెమోను ఆమోదించి, నెల్లూరు ఫ్యామిలీ కోర్టు గత ఆదేశాలను రద్దు చేస్తూ హైకోర్టు పరస్పర అంగీకారంతో అధికారికంగా విడాకులు మంజూరు చేసింది.

©️ VIL Media Pvt Ltd.