Reading Time: < 1 minute
Sugar Price Hike Rs 18 In 18 Days Madhya Pradesh Bhopal Festival Season

Sugar Price Hike: మధ్యప్రదేశ్‌లో చక్కెర ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. కేవలం 18 రోజుల వ్యవధిలోనే కిలో చక్కెర ధర దాదాపు రూ.18 వరకు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. దీంతో భోపాల్‌ హోల్‌సేల్‌ మార్కెట్‌లో కిలో చక్కెర ధర రూ.61కు చేరింది. ఇంత తక్కువ సమయంలో చక్కెర ధరలు ఈ స్థాయిలో పెరగడం గతంలో ఎప్పుడూ చూడలేదని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. చక్కెర ధరల పెరుగుదలకు కేంద్ర ప్రభుత్వ స్టాక్‌ విధానం కూడా ఓ కారణమని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం చక్కెర నిల్వల పరిమితిని ఎక్కువగా ఉంచిందని, దీనివల్ల మార్కెట్‌లో సరఫరాపై ప్రభావం పడుతోందని అంటున్నారు. స్టాక్‌ పరిమితిని తగ్గిస్తే మార్కెట్‌లో చక్కెర లభ్యత పెరిగి ధరలను కొంతవరకు నియంత్రించే అవకాశం ఉంటుందని వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు.

చక్కెర ధరల పెరుగుదలకు మరో ప్రధాన కారణంగా చెరకు నుంచి ఇథనాల్‌ ఉత్పత్తి పెరగడాన్ని వ్యాపారులు సూచిస్తున్నారు. చక్కెర తయారీకి వినియోగించే చెరకులో కొంత భాగాన్ని ఇథనాల్‌ ఉత్పత్తికి మళ్లించడంతో చక్కెర తయారీపై ప్రభావం పడుతోందని వారు అభిప్రాయపడుతున్నారు. డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా లేకపోవడంతో ధరలు పెరుగుతున్నాయని మార్కెట్‌ వర్గాల అంచనా వేస్తున్నాయి. మరోవైపు త్వరలో పండుగల సీజన్‌ ప్రారంభం కానుండటంతో చక్కెరకు డిమాండ్‌ మరింత పెరిగే అవకాశం ఉంది. ధరల పెరుగుదల కొనసాగితే స్వీట్లు, ఇతర ఆహార పదార్థాల ధరలపై కూడా ఈ ప్రభావం పడొచ్చని వ్యాపారులు చెబుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రోజుల్లో చక్కెర మరింత ప్రియం కావచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో ఈసారి పండుగల సమయంలో స్వీట్లు కొనుగోలు చేయడం సామాన్యుల జేబుకు మరింత భారంగా మారే అవకాశం కనిపిస్తోంది.