
వాహనం కదులుతుండగా ఒక ట్రక్ డ్రైవర్ తన సీటు నుండి దిగి ట్రక్కు పైకి ఎక్కుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ తర్వాత అతను ట్రక్కు పైకప్పుపై డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ఆ వీడియోలో డ్రైవర్ తిరిగి తన సీటులోకి వచ్చి వాహనాన్ని నడపడం కొనసాగిస్తాడు. కొద్దిసేపటి తర్వాత, అతను మళ్లీ వాహనం నుండి దిగి అదే డ్యాన్స్ చేస్తాడు. ఈ దృశ్యం ప్రజలకు షాకింగ్‌గా అనిపించవచ్చు. కానీ, రహదారి భద్రత దృష్ట్యా ఇది అత్యంత ప్రమాదకరమైన ప్రవర్తన. వాహనం రోడ్డుపై వెళ్తుండగా అతడు చేసిన ఈ నిర్లక్ష్యపు స్టంట్ చూసి నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇతని లైసెన్స్ రద్దు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేస్తున్నారు.
హేమంత్ కుమార్ అనే యూజర్ X లో పోస్ట్ చేసిన ఈ వీడియోలో, ఒక హెవీ ట్రక్కు రోడ్డుపై వేగంగా వెళ్తుండటం కనిపిస్తుంది. అయితే, సీటులో ఉండి వాహనాన్ని నియంత్రించాల్సిన డ్రైవర్, ఉన్నట్టుండి కదిలే ట్రక్కు డ్రైవింగ్ సీటును ఖాళీ చేసి బయటకు వచ్చాడు. అంతటితో ఆగకుండా, పరుగెడుతున్న ఆ ట్రక్కు పైకప్పు మీదికి ఎక్కి నిలబడి డాన్స్ చేయడం ప్రారంభించాడు.
కొద్దిసేపు పైన డాన్స్ చేసిన తర్వాత, అతడు మళ్లీ కిందకు దిగి సీటులో కూర్చుని వాహనాన్ని నడిపాడు. కానీ, అంతటితో ఆ ప్రమాదకరమైన విన్యాసం ఆగలేదు. కాసేపటికే అతను మళ్లీ బయటకు వచ్చి, ట్రక్కు బయటి భాగంలో నిలబడి డాన్స్ చేస్తూ విన్యాసాలు చేశాడు. రోడ్డుపై ఇతర వాహనాలు కూడా వెళ్తున్న సమయంలో, డ్రైవర్ ఏమాత్రం భయం లేకుండా చేసిన ఈ నిర్లక్ష్యపు పని అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.
ట్రాఫిక్ నిబంధనలను బొటనవేలితో మీటుతూ, తన ప్రాణాలకే కాకుండా రోడ్డుపై వెళ్లే ఇతర ప్రయాణికుల ప్రాణాలకు కూడా ముప్పు తలపెట్టిన ఈ డ్రైవర్ వైఖరిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఇలాంటి వ్యక్తులకు రోడ్డుపై వాహనాలు నడిపే అర్హత లేదు, వెంటనే అతడి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయాలి. అని ఒకరు డిమాండ్ చేశారు.
अलवर में इस ट्रक ड्राइवर ने तो लोगों की साँसे ऊपर नीचे कर दी pic.twitter.com/mFPwViF6jZ
— Hemant Kumar (@hemantkumarnews) August 15, 2026
యమధర్మరాజు ఇప్పుడు దున్నపోతును వదిలేసి ట్రక్కు ఎక్కి వస్తున్నాడు అని మరొకరు ఎద్దేవా చేశారు. స్థానిక పోలీసులను టాగ్ చేస్తూ, ఆ డ్రైవర్ వివరాలు సేకరించి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరారు. ఏమాత్రం నియంత్రణ తప్పినా భారీ ప్రమాదం జరిగే అవకాశమున్న ఇలాంటి ప్రమాదకర స్టంట్లు చేయడం చట్టరీత్యా నేరమని, సరదా కోసం ప్రాణాలతో ఆడుకోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.