Reading Time: 5 minutes
Story Board About Super El Nino Threat In India Monsoon Drought And Food Crisis

Story Board: పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతుండటంతో.. కొనసాగుతున్న ఎల్‌నినో అసాధారణంగా తీవ్రంగా మారుతున్నట్లు పలువురు అంతర్జాతీయ శాస్త్రవేత్తలు, వాతావరణ సంస్థలు పేర్కొంటున్నాయి. ఈ పరిణామం వేగంగా అభివృద్ధి చెందడం, ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రభావాలు చూపే అవకాశం ఉండటంతో కొందరు దీనిని సూపర్ ఎల్‌నినోగా అభివర్ణిస్తున్నారు. అయితే ఈ పదం ప్రామాణిక వాతావరణ వర్గీకరణలో భాగం కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఐఎండీ వివరాల ప్రకారం.. ఈ ఏడాది జూన్‌లో బలహీన స్థాయిలో ఎల్‌నినో పరిస్థితులు మొదలయ్యాయి. జూలై నాటికి ఇవి మోస్తరు స్థాయికి చేరుకున్నాయి. అక్టోబర్ నుంచి డిసెంబర్ 2026 మధ్య ఎల్‌నినో ప్రభావం మరింత బలపడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ సమయంలో ఎల్‌నినో అత్యంత బలమైన కేటగిరీకి చేరుకోవచ్చని వాతావరణ అంచనాలు సూచిస్తున్నాయి. అంతేకాదు ఈ సూపర్ ఎల్‌నినో వచ్చే ఏడాది మార్చి వరకూ కొనసాగుతుందనే విశ్లేషణలు.. మరింత గడ్డు పరిస్థితుల్ని కళ్లకు కడుతున్నాయి.

ప్రభుత్వం సూపర్ ఎల్‌నినో అనే పదానికి అధికారిక గుర్తింపు లేదని స్పష్టం చేసినప్పటికీ.. ప్రపంచవ్యాప్తంగా ఎల్‌నినో బలపడుతున్న సంకేతాలు ఇప్పటికే కనిపిస్తున్నాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. పలు ప్రాంతాల్లో దీర్ఘకాలిక ఉష్ణతరంగాలు, కరువు, అడవి మంటలు, వర్షపాతంలో అసాధారణ మార్పులు ఇప్పటికే నమోదయ్యాయి. ఈ పరిస్థితుల్లో.. 150 ఏళ్ల క్రితం వచ్చిన సూపర్ ఎల్‌నినోను శాస్త్రవేత్తలు గుర్తుచేసుకుంటున్నారు. అయితే అప్పట్లో అది సూపర్ ఎల్‌నినో అని ముందు తెలియలేదు. తీరా ప్రకృతి విపత్తు విరుచుకుపడి.. భారీ నష్టం చేశాకే.. అది సూపర్‌ ఎల్‌నినో అని నిర్ధారణ అయింది. ఇంకా వివరంగా చెప్పాలంటే.. అది 1876-78 మధ్య కాలం. వానాకాలంలో సరైన వర్షాలు పడక పంటలు ఎండిపోయాయి. మండే ఎండలతో నదులు ఇంకిపోయాయి. తాగడానికి చుక్కనీరు దొరుకని దుస్థితి. పళ్లెంలో మెతుకు గగనమై పోయింది. మొత్తంగా ఏదో మహమ్మారి విరుచుకుపడ్డట్టు ప్రపంచ దేశాలు అతలాకుతలమైపోయాయి. కరువు రక్కసి దెబ్బకు తాళలేక ప్రజలు పిట్టల్లా రాలిపోయారు. ఆ ఉత్పాతంలో భారత్‌లో 96 లక్షల మంది, ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల మంది తిండిలేక మృత్యువాతపడ్డారు. ప్రజల ప్రాణాలు బలి తీసుకొన్న ఆ ప్రకృతి విలయాన్నే సూపర్‌ ఎల్‌నినోగా పరిశోధకులు పిలుస్తున్నారు. ఇప్పుడు కూడా రాబోయే రోజుల్లో ఇలాంటి పరిస్థితులు రావచ్చనే అంచనాలు అందర్నీ భయపెడుతున్నాయి.

సూపర్‌ ఎల్‌నినో గురించి తెలుసుకోవాలంటే ముందుగా ఎల్‌నినో గురించి తెలుసుకోవాలి. భూమధ్యరేఖ వెంబడి దక్షిణ అమెరికా ఖండం పశ్చిమతీరం వైపు పెరూ, ఈక్వెడార్‌ దేశాల సమీపంలో పసిఫిక్‌ మహా సముద్రజలాలు విస్తరించి ఉంటాయి. ఈ జలాలు అతిగా వేడెక్కితే, సముద్రగాలులు పశ్చిమానికి బదులు తూర్పునకు పయనిస్తాయి. దీంతో భారత్‌ వంటి ఆసియా దేశాల్లో వర్షపాతం తగ్గే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితినే ఎల్‌నినో అంటారు. సముద్రపు ఉష్ణోగ్రతలు 0.5 డిగ్రీల సెల్సియస్‌ వరకూ పెరుగడం సాధారణంగా జరిగేదే. అయితే ఈ ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీల సెల్సియస్‌ కంటే ఎక్కువగా పెరిగితే అది సూపర్‌ ఎల్‌నినోకు దారితీస్తుంది. ఫలితంగా భారత్‌ సహా పశ్చిమాసియా దేశాల్లో అనావృష్టి తాండవిస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో పసిఫిక్‌ మహా సముద్రపు ఉపరితల జలాలను పరిశీలించగా, మరోమారు అత్యధిక స్థాయికి ఉష్ణోగ్రతలు చేరినట్టు వెల్లడైంది. ఇది గతంలోని బెంచ్‌ మార్క్‌ కన్నా 1.43 డిగ్రీల సెల్సియస్‌ మేర ఎక్కువగా నమోదైనట్టు తేలింది. ఈ ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరుగుతూ పోయాయి. జులై చివరినాటికి ఈ ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల సెల్సియస్‌కు చేరాయి. ఈ పరిణామమే సూపర్‌ ఎల్‌నినోకు దారితీసిందని అంచనా. ఐఎండీ తాజా అంచనాల ప్రకారం ఈ ఏడాది వర్షపాతం దీర్ఘకాలిక సగటులో కేవలం 92 శాతమే ఉండొచ్చని తేలింది. అందుకు తగ్గట్టుగానే ఇప్పటిదాకా కంటితుడుపు వర్షాలే తప్ప.. సాగుకు పనికొచ్చే వాన పడలేదు. దీనికి తోడు అల్పపీడనాలు కూడా తుపాన్లుగా మారకముందే బలహీనపడుతూ నిరాశపరుస్తున్నాయి.

మన దేశానికి ఎల్‌నినో పరిస్థితులు కొత్త కాదు. 2015లో ఎల్‌నినో ఎఫెక్ట్ వచ్చినప్పుడు జూన్‌లో తీవ్ర ప్రభావం చూపించింది. మొదట్లో కాస్త వర్షాలు కురిసినా రానురాను వాతావరణం పొడిగా మారింది. ఈ ఏడాది కూడా ఆలస్యంగా జులైలో మొదలైన వానలు.. మునుపటిలాగే కాస్త మురిపించి మళ్లీ ముఖం చాటేశాయి. అందుకే ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరగకపోగా.. మరింతగా అడుగంటుతున్నాయి. అంతేకాదు గతానికి భిన్నంగా వర్షాకాలంలో వేసవిని మించి విద్యుత్ వినియోగం నమోదవుతోంది. దేశంలో 1997లోనూ శక్తిమంతమైన ఎల్‌నినో ఏర్పడింది. ఆ సమయంలో పసిఫిక్ మహా సముద్ర జలాల ఉష్ణోగ్రతలు 2 డిగ్రీలకు మించాయి. అప్పుడే భారత్‌లోని ఉత్తరాది, మధ్య రాష్ట్రాలపై ప్రభావం గట్టిగా పడింది. అయితే ఈ సారి అంతకు మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉండడం వల్ల పలు రాష్ట్రాల్లో కరవు సంభవించే అవకాశాలు ఉన్నాయి.

ఎల్‌నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా వర్షపాతం సమానంగా ఉండదు. కొన్ని ప్రాంతాల్లో సాధారణ లేదా అధిక వర్షాలు పడినా, మరికొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన కొరత ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా మధ్య భారత్​లో పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంది. వర్షపాతం తగ్గితే వ్యవసాయం, గ్రామీణ ప్రాంతాల నీటి సరఫరా, స్థానిక ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఖరీఫ్‌ పంటలపై ప్రభావం అధికంగా ఉండొచ్చు. తక్కువ వర్షాలు కేవలం వ్యవసాయానికే కాదు, పర్యావరణానికి కూడా ముప్పు అందని నిపుణులు అంటున్నారు. అడవుల్లో తేమ తగ్గడం, వాగులు, నదులు ఎండిపోవడం, పక్షుల వలసలు, జంతువుల జీవన చక్రాలు దెబ్బతినడం వంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు. ఇప్పటివరకు ఎల్‌నినో పరిస్థితులు.. పడిన వర్షాలను విశ్లేషిస్తే.. కేవలం కొన్ని రాష్ట్రాల్లోనే కంటి తుడుపు వర్షం పడింది. పలు రాష్ట్రాల్లో చినుకు జాడలేదు. దీంతో ప్రభుత్వాలన్నీ సాగునీటి సంగతి వదిలేసి.. తాగునీటి సమస్య రాకుండా జాగ్రత్తపడుతున్నాయి. సాగుకు నీరందించే దిశగా ఎవరూ ఆలోచించడం లేదు. ఎలాగూ సాగునీటిపై ఆశలు వదులుకోవాలని ముందే రైతుల్ని అప్రమత్తం చేసిన ప్రభుత్వాలు.. వచ్చే నైరుతి వరకు తాగునీటికి కటకట లేకుండా ప్రణాళికలు రూపొందిచుకోవడంలో నిమగ్నమయ్యాయి. ప్రాజెక్టుల్లో ఉన్న కొద్దిపాటి నీటిని జాగ్రత్తగా వాడుకోవాలని ఫిక్సౌతున్నాయి. శాస్త్రవేత్తలైతే తీవ్రస్థాయి హెచ్చరికలే జారీ చేస్తున్నారు. అసలిప్పటిదాకా ఎల్‌నినో చూపించింది ట్రైలరేనని.. త్వరలోనే సూపర్ ఎల్‌నినో సినిమా మొదలౌతుందని భయపెడుతున్నారు.

మునుపెన్నడూ చూడని విధంగా ఈ వేసవిలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భూమిపైనే అత్యంత వేడి దేశంగా భారత్‌ రికార్డులకెక్కింది. ప్రస్తుతం ప్రపంచంలోని అత్యంత వేడి నగరాల జాబితాలో ఉన్న 100 నగరాలు భారత్‌కు చెందినవే. సూపర్‌ ఎల్‌నినో ఏర్పడే పరిస్థితులు అంతకంతకూ పెరుగుతుండటం అన్నదాతలకు కొత్త భయాలను తీసుకొస్తోంది. ఖరీఫ్‌ లోనే దేశంలో 65-70 శాతం వరకూ ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉంది. సూపర్‌ ఎల్‌నినో కారణంగా ఈసారి ఖరీఫ్‌లో సరైన వర్షాలు పడలేదు. ఇకపై పరిస్థితి మరీ క్లిష్టంగా ఉంటుందనే సూచనలు ఇప్పటికే కనిపిస్తున్నాయి. ఫలితంగా లక్షలాది మంది రైతులు గడ్డు పరిస్థితులను ఎదుర్కోనున్నట్టు హెచ్చరిస్తున్నారు. సరైన వానలు లేక ధాన్యం దిగుబడి గణనీయంగా పడిపోయి దేశంలో ఆహార సంక్షోభం కూడా తలెత్తే ప్రమాదం ఉన్నదని మరికొందరు అంచనా వేస్తున్నారు. దిగుబడి రాకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు ఆదాయాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే యుద్ధాలతో పతనమైన ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలపై సూపర్‌ ఎల్‌నినో దెబ్బ మరింత గట్టిగా పడనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మే మూడోవారం వరకు ఉన్న అంచనాల ప్రకా రం.. సూపర్‌ ఎల్‌నినో కారణంగా పంజాబ్‌, హర్యానా, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్రలో తీవ్ర కరువు తలెత్తే ప్రమాదం ఉంది. ఢిల్లీ, తెలంగాణ, ఈశాన్య రాష్ర్టాల్లోనూ వానలు అంతంత మాత్రంగానే పడొచ్చని, సూపర్‌ ఎల్‌నినో ప్రభావం ఈ రాష్ర్టాలపైనా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. తమిళనాడు, ఏపీ వంటి తీర ప్రాంత రాష్ర్టాల్లో సూపర్‌ ఎల్‌నినో కారణంగా అధిక వర్షపాతం కురిసే అవకాశం ఉన్నట్టు నిపుణులు చెప్తున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితి, ఇప్పటిదాకా కురిసిన వర్షపాతాన్ని గమనంలోకి తీసుకుంటే.. గతంలో వేసిన అంచనాలకు మించిన నష్టం తప్పదనే ఆందోళన కనిపిస్తోంది. ఇంకా చిత్రంగా వర్షం పడ్డా కూడా పంటలకు ఉపయోగం లేకుండా కురుస్తుండటం.. రైతుల్ని మరింత దిగాలు పడేలా చేస్తోంది. దిగుబడులు బాగా రావాలంటే కేవలం వర్షం పడితే సరిపోదు. అదనులో వాన కురవాలి. కానీ ప్రస్తుతం దేశంలో ఎక్కడా సరైన సమయంలో సరైన వర్షం పడని మాట నిజం. కాబట్టి పంటలపై ఆశలు పెట్టుకునే పరిస్థితులు పెద్దగా కనిపించడం లేదు. ఎక్కడైనా పంటలు పండినా.. అవి అదృష్టవశాత్తు పండాల్సిందేననే అంచనాలు కలవరపరుస్తున్నాయి. అదే జరిగితే ఇప్పటిదాకా దేశానికి పెట్టని కోటలా నిలబడ్డ సాగు రంగం.. సంక్షోభంలో పడిపోయే ప్రమాదం కనిపిస్తోంది. తద్వారా మొత్తంగా గ్రామీణ భారతమే పెను ప్రమాదంలోకి జారిపోయే అవకాశాలున్నాయి. ఈ దుర్భర పరిస్థితి రూరల్ ఎకానమీని బాగా దెబ్బతీయటమే కాకుండా.. ఈ ఎకానమీపై ఆధారపడ్డ దేశంలోని మిగతా రంగాల్నీ దెబ్బతీసి.. చివరకు జీడీపీ గణాంకాలపై గణనీయ ప్రభావం ఖాయమే.

ప్రపంచ వాతావరణ సంస్థ సూపర్ ఎల్‌నినో పరిస్థితులపై కీలక హెచ్చరిక జారీ చేసింది. రానున్న వారాల్లో ఎల్‌నినో ప్రభావం మరింత బలపడే అవకాశం ఉందని, అక్టోబర్ నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో అసాధారణ వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశముందని పేర్కొంది. దేశంలో కొన్ని రోజులపాటు కురిసే అతిభారీ వర్షాలు వారాలు, నెలల తరబడి నెలకొన్న వ్యవసాయ, నీటి ఒత్తిడిని తగ్గించలేవనీ, వరదలను మాత్రమే తీసుకువస్తాయనేది నిష్ఠుర సత్యం. సూపర్‌ ఎల్‌నినో అభివృద్ధి చెందుతున్నందు వల్ల మున్ముందు భయంకరమైన ఉష్ణోగ్రతల ప్రభావం తప్పకపోవచ్చు. ఇప్పటికే వర్షాకాలం మొదలై రెండున్నర నెలలు గడిచినా.. రాత్రి ఉష్ణోగ్రతలు ఇంకా అదుపులోకి రాలేదు. అర్జెంటీనా ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ మ్యాచ్‌లు చూసిన వారెవరైనా ఈ ఏడాది దేశంలో రుతుపవనాలను అర్థం చేసుకోవచ్చు. చాలా సమయం వరకు ఎలాంటి గోల్స్‌ రావు, ఆలస్యంగా గోల్స్‌ వచ్చి మొత్తం స్కోరు పరిస్థితే మారిపోతుంది. ప్రస్తుతం రుతుపవనాలు కూడా ఇలాగే ఉన్నాయి. సాధారణ వర్షపాతంకంటే జూన్‌లో 40శాతం లోటు రికార్డయ్యింది. జులై ఆరంభంలో కొన్నిచోట్ల బాగా వర్షాలు కురిశాయి. పశ్చిమ కనుమల్లో కేవలం 48 గంటల్లో వెయ్యి మి.మీ. వర్షపాతం నమోదైంది. జాతీయ సగటు లోటు 14శాతానికి పడిపోయింది. అయినా వర్షాభావ పరిస్థితులు పోలేదు. లోటు పెరిగి జులై మధ్యనాటికి 25శాతానికి వచ్చింది. జాతీయ సగటు ప్రాంతీయంగా ఉన్న భిన్న పరిస్థితులను మరుగున పడేస్తోంది. జులై 20 నాటికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు సాధారణ వర్షపాతం కంటే 31శాతం లోటుతో ఉన్నాయి. తెలంగాణలో 31 జిల్లాల్లో లోటు ఉంది. పది జిల్లాల్లో 40శాతానికి మించి లోటు కనిపిస్తోంది. ఏపీలోని 26 జిల్లాలకు 19 జిల్లాల్లో లోటు వర్షపాతం రికార్డయ్యింది. పశ్చిమగోదావరి జిల్లాలో సాధారణ వర్షపాతం కంటే 69శాతం లోటుంది. అన్నమయ్య జిల్లాలో 58శాతం తక్కువగా ఉంది. రాయలసీమలో కనీవినీ ఎరుగని డ్రై స్పెల్ నడుస్తోంది. అకస్మాత్తుగా కొన్ని ప్రాంతాల్లో వచ్చే వర్షాలవల్ల రాష్ట్రవ్యాప్తంగా లోటు తక్కువగా కనిపిస్తున్నా, జిల్లాల మధ్య మాత్రం చాలా అంతరాలున్నాయి. దేశంలో కూడా ఇదే పరిస్థితి.

ఈ ఏడాది రుతుపవనాలు విభిన్నంగా ఉన్నాయి. కొన్ని వారాలపాటు చాలా తక్కువ వర్షం పడుతుంది. వెంటనే కొన్ని రోజులు అధిక వర్షపాతం, కుంభవృష్టి ఉంటుంది. వానల కోసం ఎదురుచూస్తున్న కొన్ని ప్రాంతాలు అకస్మాత్తుగా వరదలను, పంట నష్టాన్ని ఎదుర్కొంటాయి. మిగిలిన ప్రాంతాల్లో వర్షాభావం ఉంటుంది. భారీ వర్షాలు జాతీయ సగటును మార్చవచ్చు, కానీ వారాలకొద్దీ వానలు లేకపోవడం వల్ల భూమిలో తేమశాతం, భూగర్భ జలం వెంటనే పెరగవు. వ్యవసాయంలో ఎల్‌నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. జులై 17నాటికి 658 లక్షల హెక్టార్లలో ఖరీఫ్‌ విత్తనం పడింది. నిరుటి కంటే ఇది ఆరు శాతం తక్కువ. పప్పుధాన్యాలు, ఆయిల్‌సీడ్స్, పత్తి తదితరాల సాగు విస్తీర్ణం తగ్గింది. తెలంగాణలో జులై 14 నాటికి 60లక్షల ఎకరాల్లో మాత్రమే విత్తనం పడింది. వానాకాలంలో సాధారణ విస్తీర్ణం కంటే 45శాతం తక్కువ ఇది. వరి నాట్లు బాగా వెనకపడ్డాయి. ఏపీలో జులై మధ్య నాటికి 8.9 లక్షల ఎకరాల్లో సాగు మొదలైంది. ఇది సాధారణ విస్తీర్ణంలో సుమారు 29శాతం మాత్రమే. ఖరీఫ్‌ రైతాంగం ఇంకా వర్షం కోసం ఎదురుచూస్తోంది. వానల్లో జాప్యం వల్ల పంటలు ఆలస్యం కావచ్చు. సీజన్‌లో మొత్తం ఎంత వర్షపాతం నమోదైందని కాకుండా వర్షం ఎన్నిసార్లు కురిసింది, అన్ని ప్రాంతాల్లో వచ్చిందా లేదా అన్నది ముఖ్యం. అసలు ఖరీఫ్ సీజన్‌ దిగుబడులపైనే ఆశల్లేకపోతే.. ఇక రబీ.. కొన్ని ప్రాంతాల్లో మూడో పంట గురించి పూర్తిగా మర్చిపోవాల్సిందే అంటున్నారు నిపుణులు. కాబట్టి రాబోయే ఆహార సంక్షోభానికి సిద్ధం కావడం మినహా మనకు మరో ప్రత్యామ్నాయం లేదనేది నిపుణుల మాట.