Reading Time: < 1 minute

పాపన్నగౌడ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తం : మంత్రి పొన్నం ప్రభాకర్

Caption of Image.
  •      నేడు ట్యాంక్ బండ్‌‌‌‌పై  సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ: మంత్రి పొన్నం

హైదరాబాద్, వెలుగు: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సామాజిక సమానత్వం కోసం పోరాడిన ధీరుడని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. మంగళశారం 376వ జయంతిసందర్భంగా నివాళులు అర్పిస్తూ మంత్రి ఓ నోట్ విడుదల చేశారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ నాటి సామాజిక, ఆర్థిక అసమానతలకు వ్యతిరేకంగా పోరాడి అణగారిన వర్గాల్లో ఆత్మగౌరవం, ధైర్యం, సమానత్వ భావనను పెంపొందించిన మహనీయుడని పొన్నం తెలిపారు.

పేదలు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం నేటి తరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. “ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్.. తాటికొండ, వరంగల్, భువనగిరి, కొలనుపాక తదితర ప్రాంతాల్లో తన ఆధిపత్యాన్ని విస్తరించి, గోల్కొండపై సైతం దండయాత్ర చేసి అప్పటి మొఘల్ పాలకులకు సవాల్ విసిరిన బహుజన వీరుడు” అని మంత్రి కొనియాడారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్‌‌‌‌పై  సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం ఆవిష్కరించనుండటం గర్వించదగ్గ విషయమని చెప్పారు.  

కార్యక్రమంలో బహుజనులు, సబ్బండ వర్గాలు , ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని, విజయవంతం చేయాలని మంత్రి కోరారు.  తెలంగాణ ప్రభుత్వం బహుజన మహనీయుల చరిత్రకు, వారి సేవలకు తగిన గౌరవం కల్పిస్తూ వారి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తోందన్నారు. 

©️ VIL Media Pvt Ltd.