Reading Time: < 1 minute
Telangana Police Recruitment 7437 Jobs Tgprb Apply Online

తెలంగాణ రాష్ట్రంలో పోలీసు, అనుబంధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 7,437 ఉద్యోగాల నియామక ప్రక్రియ నేటి ఉదయం 8 గంటల నుంచే ప్రారంభం అయింది. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక బోర్డు (టీజీపీఆర్‌బీ) ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ప్రక్రియ కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ tgprb.in లో దరఖాస్తులు సమర్పించవచ్చు.  సెప్టెంబర్ 9వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అప్లికేషన్లకు అవకాశం ఉంది. ఈ నియామకాల్లో పోలీసు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్), ఫైర్ సర్వీసెస్, జైళ్ల శాఖ విభాగాల్లోని పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో సబ్ ఇన్‌స్పెక్టర్ (సివిల్, ఏఆర్, టీజీఎస్పీ), అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఫింగర్ ప్రింట్ బ్యూరో), భారీ సంఖ్యలో సివిల్, ఏఆర్ కానిస్టేబుల్ పోస్టులతో పాటు ఫైర్ ఫైటర్లు, స్టేషన్ ఫైర్ ఆఫీసర్లు, జైళ్ల శాఖలో వార్డర్లు, డిప్యూటీ జైలర్ పోస్టులు ఉన్నాయి. ముఖ్యంగా 3,697 సివిల్ కానిస్టేబుల్ ఖాళీలు ఉన్నాయి.

ప్రభుత్వం ఈసారి అభ్యర్థుల వయోపరిమితిని పెంచడంతో దరఖాస్తుదారుల సంఖ్య మునుపటి కంటే భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. దరఖాస్తు ప్రక్రియలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా పారదర్శకత కోసం అధికారులు ఈసారి ఆధార్ ఫేస్ అథెంటికేషన్‌ను తప్పనిసరి చేశారు. దీనికోసం అభ్యర్థులు తమ ఫోన్లలో ముందుగానే ఆధార్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.

దరఖాస్తు విధానం పార్ట్-1, పార్ట్-2ల ద్వారా జరుగుతుంది. అభ్యర్థులు తమ మొబైల్ నంబర్‌తో నమోదు చేసుకున్న తర్వాత అవసరమైన విద్యార్హత ధ్రువపత్రాలు, కుల, నివాస ధ్రువీకరణ పత్రాలు, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, సంతకాన్ని నిర్దేశిత పరిమాణంలో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. చివరి తేదీ వరకు వేచి చూడకుండా అభ్యర్థులు తగిన సర్టిఫికెట్లతో వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సకాలంలో దరఖాస్తులు పూర్తి చేసి అభ్యర్థులు తమ అర్హతకు తగ్గ పోస్టులకు పోటీపడవచ్చు.