
రాజమహేంద్రవరం, ఆగస్ట్ 20: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాకినాడ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఆదివారం నూకరాజు కుటుంబసభ్యులతో కలిసి రాజమహేంద్రవరం వెళ్లిన నేపథ్యంలో.. వారు ఎవరెవరిని కలిశారు? ఎక్కడెక్కడికి వెళ్లారు? ఏ ప్రాంతంలో ఎంతసేపు ఉన్నారు? అక్కడ ఏం జరిగింది? అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు ఈ ఘటనకు కారణమైన సాధిక్ ఖాన్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. అతని నివాసంతో పాటు అతని రైఫిల్ షూటింగ్ అకాడమీ, బంధువుల ఇళ్ల వద్ద కూడా నిఘా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. సాధిక్ ఖాన్‌పై రాజమహేంద్రవరం టూటౌన్, సర్పవరం పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.
కారులో సెల్‌ఫోన్లు, ఇతర సామగ్రి స్వాధీనం
గోదావరిలో దూకే ముందు నూకరాజు కుటుంబం ప్రయాణించిన కారులో పోలీసులు నూకరాజు, ఆయన కుమార్తె సౌజన్యకు చెందిన సెల్‌ఫోన్లు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వాటి ఆధారంగా దర్యాప్తును మరింత వేగవంతం చేస్తున్నారు. ఆత్మహత్యకు పాల్పడే ముందు సెల్‌ఫోన్లలోని వాట్సప్ మెసేజ్‌లను డిలీట్ చేసినట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రెండు మొబైల్ ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపి, డిలీట్ చేసిన సమాచారం, ఇతర డిజిటల్ ఆధారాలను వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు. ఫోరెన్సిక్ నివేదిక ద్వారా కేసుకు సంబంధించి కీలక ఆధారాలు లభించే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. కేసులో కీలకంగా భావిస్తున్న సాధిక్ ఖాన్ కాల్ డేటాను పోలీసులు సేకరిస్తున్నారు. నూకరాజు కుటుంబ సభ్యులతో అతనికి ఉన్న ఫోన్ సంబంధాలు, ఘటనకు ముందు జరిగిన సంభాషణలు తదితర అంశాలను పరిశీలిస్తున్నారు. కుటుంబం రాజమహేంద్రవరం వెళ్లిన సమయంలో జరిగిన పరిణామాలపై కూడా పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు.
మూడో రోజూ గోదావరిలో గాలింపు
మరోవైపు నూకరాజు భార్య మీనా, కుమార్తె సౌజన్య కోసం గోదావరిలో మూడో రోజు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. నదిలో విస్తృతంగా గాలిస్తూ వారి ఆచూకీ కోసం రెస్క్యూ టీం అణువణువూ జల్లెడపడుతున్నారు. మరోవైపు కేసుకు సంబంధించిన ప్రతి కోణాన్ని పరిశీలిస్తూ పోలీసులు ఆధారాలను సేకరిస్తున్నారు. మొబైల్ ఫోన్లలోని డేటా, కాల్ వివరాలు, కుటుంబం ప్రయాణించిన మార్గం, సీసీటీవీ ఫుటేజీ, వారు కలిసిన వ్యక్తుల వివరాలను సమన్వయం చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఆధారాలన్నింటినీ విశ్లేషించిన తర్వాతే కుటుంబం ఆత్మహత్యకు దారితీసిన పూర్తి కారణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.