Reading Time: 2 minutes
DPL 2026: 54 బంతుల్లో 111 రన్స్ నాటౌట్.. విరాట్ కోహ్లీ ఇచ్చిన బ్యాట్‌తో ఊచకోత

DPL 2026: ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 2026లో సౌత్ డెల్లీ సూపర్‌స్టార్స్ ఓపెనర్ సనత్ సాంగ్వాన్ విధ్వంసకర శతకంతో చెలరేగిపోయాడు. వెస్ట్ డెల్లీ లయన్స్ బౌలర్లను ఊచకోత కోస్తూ 16 బౌండరీలతో మైదానాన్ని హోరెత్తించాడు. విరాట్ కోహ్లీ నుంచి ప్రత్యేకంగా బ్యాట్ అందుకున్న ఈ యంగ్ సెన్సేషన్ విరుచుకుపడిన తీరు చూసి క్రికెట్ అభిమానులు ఫిదా అవుతున్నారు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 2026లో భాగంగా సౌత్ డెల్లీ సూపర్‌స్టార్స్, వెస్ట్ డెల్లీ లయన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ ప్రేక్షకులకు అసలైన వినోదాన్ని పంచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్ట్ డెల్లీ లయన్స్ 19.5 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌటైంది. 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్ డెల్లీ సూపర్‌స్టార్స్ ఓపెనర్ సనత్ సాంగ్వాన్ మైదానంలో పరుగుల సునామీ సృష్టించాడు. మొదట్నుంచీ బౌలర్లపై విరుచుకుపడుతూ మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేశాడు. సనత్ ధాటికి ప్రత్యర్థి బౌలర్లలో ఏ ఒక్కరూ అతడిని నిలువరించలేకపోయారు.

తన ఇన్నింగ్స్‌లో సనత్ సాంగ్వాన్ కేవలం 54 బంతుల్లోనే 111 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతడి బాదుడు ఏ స్థాయిలో ఉందో తెలియజేయడానికి 205.56 స్ట్రైక్ రేటే నిదర్శనం. మైదానం నలుమూలలా విరుచుకుపడుతూ ఏకంగా 10 సిక్సర్లు, 6 ఫోర్లతో మొత్తం 16 సార్లు బంతిని సరిహద్దులు దాటించాడు. మరోవైపు తన ఓపెనింగ్ పార్ట్నర్ అన్మోల్ శర్మ (38 బంతుల్లో 55 నాటౌట్) చక్కటి సహకారం అందించడంతో తొలి వికెట్‌కు 171 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. ఈ విధ్వంసంతో సౌత్ డెల్లీ జట్టు వికెట్ నష్టపోకుండా 15.2 ఓవర్లలోనే, అంటే మరో 28 బంతులు మిగిలుండగానే విజయాన్ని అందుకుంది.

 

View this post on Instagram

 

A post shared by Sanat (@sanat.sangwan)

ఈ యువ సంచలనం సనత్ సాంగ్వాన్‌కు టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లీతో ప్రత్యేక అనుబంధం ఉంది. రంజీ ట్రోఫీ 2024-25 సీజన్‌లో ఢిల్లీ ఆఖరి మ్యాచ్ సందర్భంగా కోహ్లీ తన సొంత ఆటోగ్రాఫ్ చేసిన బ్యాట్‌తో పాటు పూర్తి క్రికెట్ కిట్‌ను సనత్‌కు బహుమతిగా ఇచ్చాడు. తన జెర్సీపై కూడా విరాట్ ఆటోగ్రాఫ్ చేసి ప్రోత్సహించాడు. ఆ సంఘటన నుంచి సనత్ సాంగ్వాన్ వెనక్కి తిరిగి చూడలేదు. వేర్వేరు ఫార్మాట్లలో వరుసగా శతకాలు బాదుతూ అదరగొడుతున్నాడు.

ఇది కూడా చదవండి: Shubman Gill: 41 రివ్యూలలో 5 మాత్రమే సక్సెస్.. గిల్ నిర్ణయాలతో పీకల్లోతు కష్టాల్లో టీమిండియా

ఈ విధ్వంసకర ఇన్నింగ్స్ తర్వాత సనత్ సాంగ్వాన్ పేరు దేశవాళీ క్రికెట్ వర్గాల్లో మారుమ్రోగిపోతోంది. టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ నుంచి పొందిన ప్రేరణే తనను ఈ స్థాయిలో రాణించేలా చేస్తోందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఇన్నింగ్స్ అతని భవిష్యత్తుకు మరిన్ని పెద్ద అవకాశాలను తెచ్చిపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.