
Turkey-Israel tensions: మిడిల్ ఈస్ట్‌లో మరో యుద్ధానికి రంగం సిద్ధమవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. గాజా యుద్ధం తర్వాత సిరియా వేదికగా టర్కీ, ఇజ్రాయిల్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఈ రెండు దేశాలు అమెరికాకు మిత్రదేశాలుగా ఉన్నాయి. టర్కీ నాటోలో సభ్యదేశంగా ఉంది. మరోవైపు ఇజ్రాయిల్‌కు ప్రతీ విషయంలో అమెరికా అండ ఉంటోంది. ఈ రెండు దేశాల మధ్య ఇప్పటికిప్పుడు యుద్ధం జరిగే అవకాశాలు లేకున్నా, పరిస్థితుల్ని బట్టి చిన్నపాటి సైనిక ఘర్షణను మాత్రం తోసిపుచ్చలేమని నిపుణులు చెబుతున్నారు.
గాజా యుద్ధం టర్కీ, ఇజ్రాయిల్ మధ్య ఉద్రిక్తతలకు ప్రధాన కారణంగా ఉంది. టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ఇజ్రాయెల్ సైనిక చర్యలను నిరంతరం విమర్శిస్తూ వస్తున్నారు. ఆయన పాలస్తీనాకు బహిరంగంగా మద్దతు తెలిపారు. గాజాలోని పౌరులను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపించారు. టర్కీ వైఖరి పట్ట ఇజ్రాయిల్ కూడా సంతృప్తిగా లేదు. పశ్చిమాసియాలో తమ ప్రయోజనాలకు టర్కీ ఒక సవాల్‌గా నిలుస్తోందని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ భావిస్తున్నారు.
సిరియా వేదికగా ఘర్షణకు ఆస్కారం..
సిరియాలో టర్కీ, ఇజ్రాయిల్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉంది. సిరియాలో పాలన మార్పు, బషర్ అల్ అసద్‌ను గద్దె దించడంలో టర్కీ అమెరికాకు సహకరించింది. టర్కీ, కొత్తగా ఏర్పడిన సిరియా ప్రభుత్వంతో సన్నిహితంగా ఉంటోంది. అక్కడ టర్కీ తన సైనిక ఉనికిని ఏర్పాటు చేయాని భావిస్తోంది. ఈ పరిస్థితుల్ని ఇజ్రాయిల్ నిశితంగా గమనిస్తోంది. సిరియాలో పెరుగుతున్న టర్కీ సైనిక ఉనికి తమ భద్రతకు ముప్పుగా ఇజ్రాయిల్ భావిస్తోంది.
మధ్యధరాలో కూడా టర్కీ వర్సెస్ ఇజ్రాయిల్..
టర్కీ, ఇజ్రాయిల్ మధ్య ఘర్షణ కేవలం గాజా, సిరియాలకు మాత్రమే పరిమితం కాలేదు. మధ్యధరా సముద్ర ప్రాంతంలో కూడా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఉన్నాయి. ఈ సముద్రంలో గ్యాస్ నిల్వల విషయంలో రెండు దేశాల మధ్య ఘర్షణ ఉంది. ఇజ్రాయిల్‌కు గ్రీస్, సైప్రస్‌లతో మంచి సంబంధాలు ఉండగా, టర్కీకి ఈ రెండు దేశాలతోనూ వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ దేశాలతో ఇజ్రాయెల్‌కు పెరుగుతున్న సాన్నిహిత్యం టర్కీకి ఆందోళన కలిగిస్తోంది. దీనిని కౌంటర్ చేసేందుకు ఇజ్రాయిల్ సరిహద్దు దేశం సిరియాతో టర్కీ స్నేహం చేస్తున్నట్లు తెలుస్తోంది.
యుద్ధం జరిగే ఛాన్స్ ఉందా..
ఈ రెండు దేశాల మధ్య నేరుగా యుద్ధం జరిగే అవకాశం లేదు. అయితే, సిరియాలో ఈ రెండు దేశాల సైన్యం ఎదురైతే తప్పకుండా ఘర్షణ జరగొచ్చు. ఈ రెండు దేశాల మధ్య ప్రత్యక్ష యుద్ధం చెలరేగితే, దాని ప్రభావం కేవలం టర్కీ మరియు ఇజ్రాయెల్‌కు మాత్రమే పరిమితం కాదు. మొత్తం మధ్యప్రాచ్యం ప్రభావితం కావచ్చు. అందువల్ల, రెండు దేశాలు ప్రత్యక్ష ఘర్షణను నివారించాలనుకుంటాయి. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ రోజురోజు కఠిన ఇజ్రాయిల్ వైఖరి తీసుకుంటున్నాడు. కానీ ఇజ్రాయిల్‌ను నేరుగా ఎదుర్కోవడం టర్కీకి అంత సులభం కాదని ఆయనకు కూడా తెలుసు. ఇది టర్కీ ఆర్థిక వ్యవస్థ, భద్రతపై గణనీయమైన ప్రభావం చూపిస్తుంది.