Reading Time: < 1 minute

కిలాడీ లేడీలు..బంగారం కొనడానికి వచ్చి.. 7తులాల బంగారం చోరీ

Caption of Image.

జహీరాబాద్ పట్టణంలో నలుగురు మహిళలు ఘరానా మోసానికి పాల్పడ్డారు.  బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే  దుకాణంలోకి వెళ్ల  షాప్ యజమానిని మాటల్లో పెట్టి లక్షల విలువైన బంగారాన్ని దోచుకెళ్లారు. బాధిత షాప్ యజమాని ,  పోలీసుల సమాచారం ప్రకారం.. నలుగురు మహిళలు కలిసి జహీరాబాద్‌లోని ఓ ప్రముఖ బంగారు ఆభరణాల దుకాణానికి కస్టమర్లుగా వెళ్లారు. తమకు ముక్కుపుడకలు కావాలని షాప్ యజమానిని కోరారు. యజమాని వారికి వివిధ రకాల డిజైన్ల ముక్కుపుడకలను చూపించే పనిలో పడ్డారు.

ఈ క్రమంలో ఆ మహిళల్లో కొందరు యజమానిని రకరకాల ప్రశ్నలతో, మాయమాటలతో పూర్తిగా గందరగోళానికి గురిచేశారు. ఆయన దృష్టి మరల్చిన సమయంలో, వారిలో ఒకరు చాకచక్యంగా సుమారు 7 తులాల బంగారాన్ని దొంగిలించారు. తాము కొనుగోలు చేయకుండానే అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యారు. ఆ తర్వాత దుకాణంలో స్టాక్ సరిచూసుకుంటున్న యజమానికి భారీ మొత్తంలో బంగారం తక్కువగా ఉండటంతో షాక్‌కు గురయ్యారు. వెంటనే షాప్‌లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. ఆ నలుగురు మహిళలు అత్యంత వ్యూహాత్మకంగా చోరీకి పాల్పడిన దృశ్యాలు స్పష్టంగా రికార్డయ్యాయి. 

బాధిత యజమాని వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన జహీరాబాద్ పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న ఆ మహిళల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

©️ VIL Media Pvt Ltd.