
ఎంసీ హరి, మనోజ్, శశిధర్ లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘అమీర్ లోగ్’. రమణా రెడ్డి సోమ దర్శక నిర్మాతగా రూపొందించారు. రానా దగ్గుబాటి సంస్థ స్పిరిట్ మీడియా ద్వారా ఆగస్టు 21న థియేట్రికల్ రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా రమణా రెడ్డి మాట్లాడుతూ ‘ఆర్కిటెక్చర్ రంగంలో సుమారు 20 ఏళ్ల అనుభవం ఉన్నా సినిమాలపై ఉన్న ఆసక్తితోనే ఈ ప్రయాణం మొదలైంది. నాకు కథలు రాయడం చాలా ఇష్టం.
హైదరాబాద్‌లోని బస్తీ జీవితాన్ని చూపించే చిత్రమిది. దీనికోసం రియల్ లొకేషన్స్‌లో షూట్ చేశాం. అలాగే సింక్ సౌండ్‌ను ఉపయోగించాం. డెమో షూట్‌తో కలిపి 43 రోజుల్లో చిత్రీకరణ పూర్తయింది. దర్శకుడిగా నాకెలాంటి అనుభవం లేకున్నా.. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. ఇందులోని ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది. స్మరణ్ సంగీతం అందించిన ఈ చిత్రంలో 10 పాటలు ఉన్నాయి. కథలో భాగంగా బిట్ సాంగ్స్‌గా వస్తాయి. కీరవాణి పాడిన పాట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉంటుంది. ఇప్పటికే వేసిన ప్రీమియర్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా నుంచి అందిస్తున్న సపోర్ట్ మరువలేనిది’ అని అన్నారు.