Reading Time: < 1 minute
Bihar Govt Social Media Policy Earn 1 Lakh Creators

బిహార్ ప్రభుత్వం సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లు , ఇన్‌ఫ్లుయెన్సర్ల కోసం ఒక సరికొత్త ఆదాయ అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రంలో అమలువుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి ప్రాజెక్టులు, ప్రభుత్వ విజయాలపై వీడియోలు చేసే క్రియేటర్లకు ఆర్థిక ప్రోత్సాహకం అందించేలా ‘సోషల్ మీడియా అండ్ అదర్ ఆన్‌లైన్ మీడియా రూల్స్’ సవరణలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. డిజిటల్ మీడియా ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశం.

ఈ కొత్త విధానం ప్రకారం.. ఒక వీడియో పోస్ట్ చేసిన 30 రోజుల వ్యవధి పూర్తయిన తర్వాత వచ్చే ప్రతి 1 లక్ష వ్యూస్‌కు క్రియేటర్లకు అదనంగా రూ.10,000 చొప్పున చెల్లిస్తారు. ఒకే వీడియోకు ఇచ్చే గరిష్ట పరిహారం రూ. 1 లక్ష వరకు ఉంటుంది. ఉదాహరణకు, ఒక వీడియో కనీసం 10 లక్షల అర్హత కలిగిన వ్యూస్ సాధిస్తే సదరు క్రియేటర్ గరిష్టంగా రూ.10,000 చొప్పున లెక్కించి రూ. 1 లక్ష పొందే అవకాశం ఉంటుంది.

అయితే వైరల్ అయిన ప్రతి వీడియోకు ఈ డబ్బులు నేరుగా అందవు. కంటెంట్ కేవలం ప్రభుత్వ పథకాలు, ప్రజా సంక్షేమ అంశాలపైనే ఉండాలి. అలాగే సదరు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లేదా ఇతర సోషల్ మీడియా ఖాతాల ఫాలోవర్లు, పేజీల ప్రామాణికతను ప్రభుత్వం ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తుంది. వ్యూస్ నిజమైనవేనా లేదా అనే దానిపై వెరిఫికేషన్ ప్రక్రియ ఉంటుంది.

సమాచార , పౌర సంబంధాల శాఖ (IPRD) త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో అధికారిక నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఏయే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను అనుమతిస్తారు, వ్యూస్ ఎలా లెక్కిస్తారు, క్రియేటర్లు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ఎంపానెల్‌మెంట్ నిబంధనలు ఏంటి అనేది ఆ నోటిఫికేషన్‌లో స్పష్టత రానుంది. ప్రాంతీయ భాషల్లో వీడియోలు చేసే బీహార్ డిజిటల్ క్రియేటర్లకు ఇది మంచి ఆదాయ వనరుగా మారడమే కాకుండా.. సాంప్రదాయ మీడియాను చూడని గ్రామీణ ప్రజలకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారం సులభంగా చేరడానికి ఉపయోగపడుతుంది.