
Star Couple: బాలీవుడ్ స్టార్ కపుల్ సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ త్వరలో కొత్త అవతారంలో కనిపించనున్నట్లు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. నటీనటులుగా ఇప్పటికే తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ స్టార్ కపుల్.. ఇప్పుడు నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా సిద్ధార్థ్ మల్హోత్రా కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లే కథలను తామే నిర్మించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సిద్ధార్థ్ మల్హోత్రా ‘షేర్షా’, ‘మిషన్ మజ్ను’ వంటి చిత్రాలతో నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే ఇటీవల తన కెరీర్‌కు మరింత సపోర్ట్ ఇచ్చే, వైవిధ్యమైన స్టోరీలు ఆశించిన స్థాయిలో రావడం లేదని సిద్ధార్థ్, కియారా భావిస్తున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అందుకే ఇతర డైరెక్టర్స్, నిర్మాతల నుంచి వచ్చే అవకాశాల కోసం ఎదురుచూడకుండా.. తమకు నచ్చిన కథలను ఎంచుకుని వాటిని స్వయంగా నిర్మించాలని ఈ జంట నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.
కొత్త తరహా కథలు, విభిన్న కాన్సెప్ట్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమాలను నిర్మించాలన్నది వారి ఆలోచనగా తెలుస్తోంది. అయితే ఈ నిర్మాణ సంస్థకు సంబంధించిన అధికారిక వివరాలు, తొలి ప్రాజెక్ట్ ఏమిటనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇక కియారా అద్వానీ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె పాన్ ఇండియా స్టార్ యష్ హీరోగా నటిస్తున్న ‘టాక్సిక్’ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార, హుమా ఖురేషి, కియారా అద్వానీ, రుక్మిణి వసంత్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘టాక్సిక్’ ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. మొత్తానికి నటులుగా కొనసాగుతూనే నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాలని భావిస్తున్న సిద్ధార్థ్, కియారా నిర్ణయం బాలీవుడ్‌లో ఆసక్తికరంగా మారింది. తమ నిర్మాణ సంస్థ ద్వారా ఎలాంటి కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారో చూడాలి.