Reading Time: 2 minutes
Shahid Kapoor Ashwatthama The Saga Shelved Kalki 2898 Ad Impact

Shahid Kapoor: బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలో తెరకెక్కాల్సిన భారీ మైథలాజికల్ యాక్షన్ మూవీ ‘అశ్వద్ధామ: ది సాగా’కు బ్రేక్ పడింది. ఈ ప్రాజెక్ట్ ఇకపై పట్టాలెక్కదని నిర్మాత జాకీ భగ్నాని ఇటీవల ప్రకటించారు. సినిమా ఆగిపోవడానికి పలు కారణాలు ఉన్నాయని వెల్లడించిన ఆయన.. ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ కూడా వాటిలో ఒక కారణమని చెప్పడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. డైరెక్టర్ ఆదిత్య ధర్ గతంలో విక్కీ కౌశల్‌తో ‘అశ్వద్ధామ’ కథను తెరకెక్కించాలని భావించారు. ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చకపోవడంతో ఇదే కథను షాహిద్ కపూర్‌తో తెరకెక్కించేందుకు నిర్మాత జాకీ భగ్నాని ప్రయత్నించారు. కన్నడ డైరెక్టర్ సచిన్ బి.రవి దర్శకత్వంలో ఈ సినిమాను రూపొందించనున్నట్లు సుమారు రెండేళ్ల క్రితం అధికారికంగా ప్రకటించారు. అయితే అనేక కారణాల వల్ల ఇప్పటివరకు షూటింగ్ ప్రారంభం కాలేదు.

తాజాగా ప్రాజెక్ట్‌ను పూర్తిగా నిలిపివేసినట్లు ప్రకటించిన జాకీ భగ్నాని.. సినిమా బడ్జెట్‌ అనుకున్న దానికంటే భారీగా పెరగడం, విదేశాల్లో షూటింగ్‌ చేయాల్సి రావడం వంటి అంశాలను ప్రధాన కారణాలుగా వెల్లడించారు. వీటితో పాటు ‘కల్కి 2898 ఏడీ’ కూడా తమ ప్రాజెక్ట్‌పై ప్రభావం చూపిందని ఆయన పేర్కొన్నట్లు సమాచారం. ప్రత్యేకంగా ‘కల్కి 2898 ఏడీ’లో అమితాబ్ బచ్చన్ పోషించిన అశ్వద్ధామ పాత్రకు వచ్చిన స్పందన కూడా తమ సినిమాకు ప్రతికూలంగా మారిందని నిర్మాత అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఒకే తరహా కథను మళ్లీ మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తే వారు ఆదరించరని ఆయన పేర్కొన్నారు. ప్రేక్షకులు సినిమా కోసం ఎంత ఖర్చు చేశారనే దానికంటే.. కథలో ఎంత కొత్తదనం ఉందో చూస్తున్నారని, సరైన కంటెంట్ లేకుండా భారీగా డబ్బు పెట్టుబడి పెట్టడం వృథా అని జాకీ భగ్నాని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ‘అశ్వద్ధామ: ది సాగా’ కాన్సెప్ట్‌ను కొత్త కోణంలో పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని భావించి ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. అయితే ‘కల్కి 2898 ఏడీ’లో అశ్వద్ధామ పాత్ర ఉండటమే ఈ సినిమాను ఆపేయడానికి ఏకైక కారణం కాదని.. బడ్జెట్, షూటింగ్ ప్రణాళికలు సహా పలు అంశాలు ప్రభావం చూపినట్లు స్పష్టమవుతోంది. ఇక ప్రభాస్ నటిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్‌ విషయానికి వస్తే.. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 60 శాతానికి పైగా పూర్తయినట్లు సమాచారం. డైరెక్టర్ నాగ్ అశ్విన్ వచ్చే ఏడాది సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని పక్కగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.