Reading Time: 2 minutes
Grow Green Chillies At Home In Pots Easy Tips For Fresh Chillies

Green Chillies at Home: వంటకాలకు పచ్చిమిరపకాయలు చక్కటి కారం, రుచిని అందిస్తాయి. కూర, పప్పు, చట్నీ ఇలా ఏ వంటకం అయినా కొద్దిగా పచ్చిమిరపకాయలు వేస్తే రుచి మరింత పెరుగుతుంది. అయితే మార్కెట్‌ నుంచి తెచ్చిన పచ్చిమిరపకాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండకపోవడంతో త్వరగా పాడైపోతుంటాయి. ఇలాంటి సమస్యను నివారించాలంటే ఇంట్లోనే తాజా పచ్చిమిరపకాయలను పెంచుకోవచ్చు. ఇందుకోసం పెద్దగా గార్డెన్‌ ఉండాల్సిన అవసరం లేదు. బాల్కనీ, టెర్రస్‌ లేదా మంచి సూర్యకాంతి వచ్చే కిటికీ దగ్గర ఒక కుండీలోనే పచ్చిమిరప మొక్కను పెంచుకోవచ్చు. అంతేకాదు.. ప్రత్యేకంగా ఖరీదైన విత్తనాలు కొనాల్సిన అవసరం కూడా లేదు. ఇంట్లో ఉపయోగించే పండిన పచ్చిమిరపకాయల నుంచే విత్తనాలను తీసుకుని మొక్కను పెంచుకోవచ్చు.

పచ్చిమిరప మొక్కకు ఏం కావాలి?

ముందుగా మొక్క వేర్లు విస్తరించడానికి సరిపడా స్థలం ఉన్న కుండీ లేదా గ్రో బ్యాగ్‌ను ఎంచుకోవాలి. సాధారణ మట్టిలో బాగా కుళ్లిన పశువుల ఎరువు లేదా సేంద్రియ ఎరువును కలిపితే మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది. ముఖ్యంగా మట్టిలో నీరు నిలిచిపోకుండా మంచి డ్రైనేజీ ఉండాలి. కుండీలో నీరు ఎక్కువసేపు నిల్వ ఉంటే వేర్లు దెబ్బతిని మొక్క ఎదుగుదల మందగించే అవకాశం ఉంటుంది.

ఇంట్లోని పచ్చిమిరపకాయలతోనే..

పచ్చిమిరప మొక్కను పెంచడానికి ప్రత్యేకంగా మార్కెట్‌లో విత్తనాలు కొనాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉన్న పండిన పచ్చిమిరపకాయ నుంచి విత్తనాలను తీసుకోవచ్చు. ముందుగా విత్తనాలను బాగా ఆరబెట్టాలి. ఆ తర్వాత వాటిని నీటిలో నానబెట్టి ఉంచాలి. సుమారు రెండు రోజుల తర్వాత విత్తనాలను నాటేందుకు సిద్ధం చేసుకోవచ్చు.

ఈ తప్పు చేయకండి:

తయారు చేసుకున్న కుండీలోని మట్టిలో విత్తనాలను నాటాలి. విత్తనాలను చాలా లోతుగా పాతిపెట్టకూడదు. సుమారు 2 నుంచి 3 అంగుళాల లోతులో వేస్తే సరిపోతుంది. విత్తనాలు వేసిన తర్వాత మట్టిని తేలికగా తడిగా ఉంచాలి. అయితే కుండీలో ఎక్కువ నీరు పోయడం మాత్రం చేయకూడదు. మట్టిలో నీరు నిలిచిపోతే విత్తనాలు లేదా మొక్క వేర్లు దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి అవసరానికి అనుగుణంగా మాత్రమే నీటిని అందించాలి.

సూర్యరశ్మి అవసరం:

పచ్చిమిరప మొక్క ఆరోగ్యంగా ఎదగడానికి సూర్యరశ్మి చాలా అవసరం. కుండీని ప్రతిరోజూ సుమారు 5 నుంచి 6 గంటల పాటు నేరుగా లేదా తగినంత సూర్యకాంతి లభించే ప్రదేశంలో ఉంచాలి. ఇంట్లో బాల్కనీ లేదా టెర్రస్‌ లేకపోతే మంచి వెలుతురు వచ్చే కిటికీ దగ్గర కుండీని పెట్టుకోవచ్చు. విత్తనాలకు తగినంత సూర్యరశ్మి, సరైన తేమ లభిస్తే కొన్ని వారాల్లోనే మొలకలు రావడం ప్రారంభమవుతుంది.

ఒకే కుండీలో ఎక్కువ మొక్కలు వద్దు:

సాధారణంగా 3 నుంచి 4 వారాల్లో మిరప మొక్కలు పెరగడం ప్రారంభిస్తాయి. ఈ సమయంలో ఒక కుండీలో ఎక్కువ మొక్కలు ఉండకుండా చూసుకోవాలి. ఒక కుండీలో నాలుగు కంటే ఎక్కువ మొక్కలను పెంచితే వాటికి అవసరమైన స్థలం, పోషకాలు సరిగా అందకపోవచ్చు. దీంతో మొక్కల ఎదుగుదల మందగించే అవకాశం ఉంటుంది. మొక్క పెరిగే సమయంలో క్రమం తప్పకుండా నీరు అందిస్తూ, తగినంత సూర్యరశ్మి ఉండేలా చూసుకోవాలి.

సుమారు 30 నుంచి 40 రోజుల్లో మొక్కపై చిన్న తెల్లని పువ్వులు కనిపించవచ్చు. ఈ పువ్వుల తర్వాత మిరపకాయలు ఏర్పడటం ప్రారంభమవుతుంది. సరైన సంరక్షణ, తగినంత సూర్యరశ్మి, నీరు అందిస్తే సుమారు రెండు నెలల్లోనే ఇంట్లోని కుండీ నుంచి తాజా పచ్చిమిరపకాయలను కోయవచ్చు. కాబట్టి పెద్ద గార్డెన్‌ లేకపోయినా బాల్కనీ, టెర్రస్‌ లేదా సూర్యకాంతి వచ్చే కిటికీ దగ్గర ఒక కుండీతోనే ఇంట్లో పచ్చిమిరప సాగును ప్రారంభించవచ్చు.