
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో పొలిటికల్ హీట్ మొదలైంది. 2027 మొదట్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచి రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తూ అస్త్రశస్త్రాలు సిద్ధం చేకుంటున్నాయి. ఈ నేపథ్యంలో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల వేళ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ప్రముఖ బ్రాహ్మణ నాయకుడైన సతీష్ చంద్ర మిశ్రాకు ఆమె కీలక బాధ్యతలు అప్పగించారు. పార్టీ లీగల్, మీడియా విభాగాలతో పాటు ఎన్నికల సంఘానికి సంబంధించిన కీలక బాధ్యతలను ఆయనకు అప్పజెప్పారు. 2027 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బ్రాహ్మణులను ఆకట్టుకునే వ్యూహాంలో భాగంగా మాయవతి ఈ నిర్ణయం తీసుకున్నారు.
మాయవతి దళిత-బ్రాహ్మణ సామాజిక వ్యూహం:
ఒకప్పుడు ఉత్తరప్రదేశ్‌ను పాలించిన బహుజన్ సమాజ్ పార్టీ పరిస్థితి ప్రస్తుతం ఆగమ్యగోచరంగా తయారైంది. 2007 అసెంబ్లీ ఎన్నికల్లో 206 స్థానాలు సాధించి అధికారంలోకి వచ్చిన బీఎస్పీ 2022 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 1 స్థానానికే పరిమితమైంది. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేదు. దీంతో తిరిగి పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని మాయవతి కంకణం కట్టుకున్నారు.
2027లో అధికారమే లక్ష్యంగా ఆమె వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా 2007లో బీఎస్పీకి అఖండ విజయం అందించిన ‘దళిత-బ్రాహ్మణ’ సామాజిక వ్యూహాన్నీ మళ్లీ తెరపైకి తెచ్చారు. రాష్ట్రంలో దళితుల తర్వాత అతిపెద్ద వర్గమైన బ్రహ్మణ సామాజిక వర్గాన్ని ప్రసన్నం చేసుకునేందుకు ఈ పాత ఫార్ములానే సరైన మార్గమని ఆమె భావిస్తున్నారు.
ఈ వ్యూహాంలో భాగంగానే 2027 అసెంబ్లీ ఎన్నికల టికెట్ల కేటాయింపులో బ్రహ్మణ వర్గానికి ప్రాధ్యానత ఇవ్వాలని ఆమె డిసైడ్ అయ్యారు. అలాగే, బ్రహ్మణులకు దగ్గరై ఓట్లు రాబట్టేందుకు ఆ సామాజిక వర్గానికి చెందిన కీలక నేత సతీష్ చంద్ర మిశ్రాకు ఎన్నికల వేళ పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించారు మాయవతి. వరుస పరాజయాలతో ఉనికి కోల్పోయిన బీఎస్పీని 2007 నాటి తన విజయవంతమైన సామాజిక ఇంజనీరింగ్ వ్యూహం ఏ మేర గట్టెక్కిస్తుందో చూడాలీ.
సాంప్రదాయకంగా బీఎస్పీ దళిత రాజకీయాలతో ముడిపడి ఉండేది. అయితే, ముస్లింలు, బ్రహ్మణుల ఓట్ల కోసం 2007 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మాయవతి ‘దళిత-బ్రాహ్మణ’ సామాజిక వ్యూహాన్నీ అమలు చేశారు. 2007 అసెంబ్లీ ఎన్నికలలో బీఎస్పీ 86 మంది బ్రాహ్మణ అభ్యర్థులను బరిలోకి దింపగా.. అందులో 41 మంది విజయం సాధించారు.
ఈ సక్సెస్ వ్యూహాన్ని మాయావతి సామాజిక ఇంజనీరింగ్‌గా అభివర్ణించారు. 2027 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ విజయం కోసం ఇదే వ్యూహాన్ని అవలంభించనున్నట్లు మాయవతి ప్రకటించారు. ఇందులో భాగంగానే ప్రముఖ బ్రహ్మణ లీడర్ సతీష్ చంద్ర మిశ్రాకు బీఎస్పీ లీగల్, మీడియా, ఈసీకి సంబంధించిన వ్యవహారాలను అప్పగించారు. తమ ఎన్నికల వ్యూహాలతో ప్రత్యర్థి పార్టీల్లో ఇప్పటి నుంచే ఆందోళన మొదలైందన్నారు.
బ్రాహ్మణ ఓట్ల ఈక్వెషన్ మళ్లీ వర్కవుట్ అవుతుందా..?
యూపీలో 2007 ఎన్నికల నాటి రాజకీయ పరిస్థితులు.. ఇప్పటి పొలిటికల్ సిట్యూయేషన్ పూర్తి డిఫరెంట్‌గా ఉంది. 2007 అసెంబ్లీ ఎన్నికల సమయంలో అప్పటి ములాయం సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వంపై తీవ్ర అధికార వ్యతిరేకతను ఎదుర్కొంది. ఇదే సమయంలో యూపీలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ పరిస్థితులు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఈ పరిణామాలన్నీ మాయవతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ వాదీ పార్టీకి బాగా కలిసొచ్చాయి.
మరోవైపు.. రాష్ట్రంలో మెజార్టీ ఓటర్లైన దళితులు, బ్రాహ్మణులు, ముస్లిం ఓట్ల కోసం మాయవతి ‘దళిత-బ్రాహ్మణ’ సామాజిక వ్యూహాన్నీ అమలు చేశారు. ఈ వ్యూహాం భారీ సక్సెస్ కావడంతో 2007 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ 206 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే, 2014 నుంచి యూపీ రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా మారిపోయింది. 2014 నుంచి ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ ఆధిపత్య రాజకీయ శక్తిగా అవతరించింది. మెజార్టీ బ్రహ్మణ ఓటర్లు ఎస్పీ, బీఎస్పీ కాకుండా బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు.
దీంతో బీజేపీ వరుసగా రెండుసార్లు యూపీలో అఖండ విజయం సాధించింది. ఈ పరిస్థితుల్లో 2007లో తనకు అధికారాన్ని కట్టబెట్టిన ‘దళిత-బ్రాహ్మణ’ సామాజిక వ్యూహాన్నీ మాయవతి మళ్లీ తెరపైకి తెచ్చారు. కానీ అప్పుడు వర్కౌట్ అయిన ఈ వ్యూహం.. 2027 ఎన్నికల్లో పని చేస్తుందా అన్నదే అతిపెద్ద ప్రశ్న. బ్రహ్మణులు ప్రస్తుతం బీజేపీకి బలమైన ఓట్ బ్యాంక్ గా ఉన్నారు. బీజేపీని కాదని పూర్తిగా ఉనికి కోల్పోయిన బీఎస్పీ వైపు బ్రహ్మణులు మొగ్గు చూపే అవకాశం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.