Reading Time: < 1 minute

చిన్నారెడ్డిపై క్రమశిక్షణచర్యలు తీసుకోవాలి..వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అనుచరుల డిమాండ్

Caption of Image.
  • పీసీసీ చీఫ్​కు ఫిర్యాదు చేసిన మేఘారెడ్డి

హైదరాబాద్, వెలుగు: ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆధ్వర్యంలో ఆయన అనుచరులు పెద్ద సంఖ్యలో గాంధీ భవన్ కు తరలివచ్చారు. ‘‘చిన్నారెడ్డి హఠావో.. కాంగ్రెస్ బచావో’’ అంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మేఘారెడ్డి పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్​ను కలిసి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు కాపీని ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్​కు పంపించారు.

అనంతరం మేఘారెడ్డి గాంధీ భవన్​లో మీడియాతో మాట్లాడారు. చిన్నారెడ్డి బీఆర్ఎస్ నాయకులతో టచ్​లో ఉన్నారని, అందుకే ఆయన కాంగ్రెస్ కు వ్యతిరేకమైన వ్యాఖ్యలు చేశాడని ఆరోపించారు. చిన్నారెడ్డి వనపర్తి బీఆర్ఎస్ నాయకులతో మాట్లాడిన ఫోన్ కాల్స్ ఆధారాలు తనవద్ద ఉన్నాయన్నారు. తాను చేసిన ఫిర్యాదులో ఈ అంశాన్ని పేర్కొన్నానని చెప్పారు. క్యాబినెట్ హోదాలో ఉన్న చిన్నారెడ్డి కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని విమర్శించారని, త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఆయనపై ఫిర్యాదు చేస్తానన్నారు.

పార్టీకి విధేయుడిని అని చెప్పుకునే చిన్నారెడ్డి.. కాంగ్రెస్ పార్టీ టికెట్ అమ్ముకున్నారని చేసిన వ్యాఖ్యలు ఆయన విధేయతను ప్రశ్నించేలా ఉన్నాయన్నారు. చిన్నారెడ్డి పార్టీ లైన్ దాటి తనపై విమర్శలు చేసినా తాను మాత్రం పార్టీ లైన్ లోనే మాట్లాడుతున్నానని స్పష్టం చేశారు.

©️ VIL Media Pvt Ltd.