
- బ్యాటరీపై అత్యధికుల్లో అసంతృప్తి
- వెల్లడించిన అమెజాన్ సర్వే
న్యూఢిల్లీ: కెమెరా, మ్యూజిక్, బ్యాటరీ.. ఇది వరకు ఫోన్ కొనేటప్పుడు వినియోగదారులు మొదట ఇవి ఎలా ఉన్నాయో చూసేవాళ్లు. ఇప్పుడు ట్రెండ్ మారింది. ఈ లిస్టులో మరొకటి చేరింది. అదే ఏఐ! ఫోన్లో కొత్తఏఐఫీచర్లు ఏమేం ఉన్నాయనేది కీలకంగా మారింది. ఈ విషయమై అమెజాన్ నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు బయటకువచ్చాయి.
స్మార్ట్ ఫోన్ కొనుగోలుదారులలో 82 శాతం మందికి ఏఐ ఫీచర్లు అత్యంత కీలకంగా మారాయి. ఏఐతో పాటు ఫోన్ పనితీరు, వేగం, బ్యాటరీ జీవిత కాలం, కెమెరా నాణ్యతకు కూడా ప్రాధాన్యం ఉంటోంది. ఈ సర్వేలో పాల్గొన్న స్మార్ట్ఫోన్ వినియోగదారులలో 42 శాతం మంది రూ.25 వేల నుంచి రూ.50 వేల ధరల మధ్య ఫోన్ కొంటామని చెప్పారు. దాదాపు సగం మంది రాబోయే మూడు నెలల్లోనే కొత్తఫోన్ను కొనడానికి ప్లాన్ చేసుకుంటున్నారు..
రివ్యూలు, రేటింగ్స్ కూడా ముఖ్యమే
మొబైల్ కొనేటప్పుడు ఆఫర్లు, ధరల తగ్గింపు కంటే రివ్యూలు, రేటింగ్లకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తు న్నారు. తమకు తక్షణ సహాయం అందించే ఏఐ ఫీచర్లను ఎక్కువగా కోరుకుంటున్నారు. తాము ఏం చేస్తున్నారో అర్ధం చేసుకుని దానికి తగిన సహాయం అందించే కాంటెక్చువల్ అసిస్టెన్స్ ఫీచర్ను అత్యధికంగా ఇష్టపడుతున్నారు. దీని తర్వాత జనరేటివ్ ఫోటో ఎడిటింగ్, విజువల్ సెర్చ్ వంటి ఫీచర్లపై ఆసక్తి చూపుతున్నారు.
బ్యాటరీ లైఫ్ తమకు చాలా ముఖ్యమని మెజారిటీ రెస్పాండెం ట్లు చెప్పారు. అనేక ఫోన్లలో ఇదే ప్రధాన లోపంగా మారుతోంది. ప్రస్తుత ఫోన్ను మార్చాలనుకుంటు న్న వారిలో అత్యధికులు బ్యాటరీ పనితీరుపై అసం తృప్తితో ఉన్నట్టు వెల్లడించారు. ఖరీదైన ఫోన్లను కొనడానికి వినియోగదారులు వెనకాడటం లేదు. మూడో వంతు మంది రెస్పాండెంట్లు రూ.50 వేలు లేదా అంతకంటే ఎక్కువ ధర ఉండే ప్రీమియం ఫోన్లను కొనాలని కోరుకుంటున్నారని అమెజాన్ సర్వే రిపోర్ట్ తెలిపింది.