Reading Time: 3 minutes

లోక్‌‌‌‌సభ సీట్లు పెంచొద్దు..25 ఏండ్లపాటు 543 సెగ్మెంట్లే ఉండాలి:కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ

Caption of Image.
  • ఆ సీట్లకు తగ్గట్టుగానే మహిళా రిజర్వేషన్ అమలు చేయాలి
  • కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్లాలి
  • విద్యా వ్యవస్థ ప్రక్షాళనకు రోడ్‌‌‌‌మ్యాప్ రూపొందించాలి
  • సీడబ్ల్యూసీ మీటింగ్‌‌‌‌లో కీలక నిర్ణయాలు 
  • ఎన్డీఏ సర్కార్ వైఫల్యాలను ఎండగట్టాం: కేసీ వేణుగోపాల్ 
  • మోదీ సర్కార్‌‌‌‌‌‌‌‌తో విద్యార్థుల భవిష్యత్తు నాశనం: ఖర్గే
  • విద్యాసంస్థలు ఆర్ఎస్ఎస్ ఆధీనంలోకి వెళ్లాయని ఫైర్  
  • తెలంగాణలో పాలన భేష్.. సీఎం రేవంత్‌‌‌‌కు హైకమాండ్ ప్రశంసలు

న్యూఢిల్లీ, వెలుగు: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నియోజక వర్గాల పునర్విభజన(డీలిమిటేషన్) ప్రక్రియను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) తీవ్రంగా వ్యతిరేకించింది. రాబోయే 25 ఏళ్లపాటు లోక్‌‌సభ స్థానాల సంఖ్యను 543 వద్దే స్థిరంగా ఉంచాలని, ఆ సంఖ్యలోనే మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేసింది. అలాగే పేపర్ లీక్‌‌లు, దేశ విద్యా వ్యవస్థ ప్రక్షాళన, అయోధ్య విరాళాల చోరీ వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వ తీరును క్షేత్రస్థాయిలో ఎండగట్టాలని  నిర్ణయించింది. 

అరుణాచల్ ప్రదేశ్‌‌లో చైనా చొరబాట్ల విషయంలో మోదీ సర్కార్ లొంగుబాటు విధానాన్ని అనుసరిస్తోందని ఆరోపించింది. బుధవారం ఢిల్లీలోని ఇందిరా భవన్‌‌లో పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో సీడబ్ల్యూసీ భేటీ అయింది. ఈ సమావేశంలో పార్టీ మాజీ అధ్యక్షులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, జనరల్ సెక్రటరీలు ప్రియాంక గాంధీ వాద్రా, జైరాం రమేష్, కేసీ వేణుగోపాల్‌‌తో పాటు 88 మంది నేతలు పాల్గొన్నారు. 

అలాగే, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి(తెలంగాణ), వి.డి. సతీశన్ (కేరళ), సుఖ్విందర్ సింగ్ సుఖు (హిమాచల్ ప్రదేశ్), డి.కె. శివకుమార్(కర్నాటక) కూడా హాజరయ్యారు. సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆయా అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.  

కేంద్రం ఆత్మరక్షణలో పడింది.. 

పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిందని కేసీ వేణుగోపాల్ అన్నారు. మోదీ సర్కార్ వైఫల్యాలను ఎండగట్టడంలో ప్రతిపక్షాలు విజయం సాధించాయని చెప్పారు. సీడబ్ల్యూసీ మీటింగ్‌‌లో తీసుకున్న నిర్ణయాలను ఆయన మీడియాకు వెల్లడించారు. లోక్‌‌సభ స్థానాలను పెంచొద్దని, ఉన్న స్థానాలతోనే మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని తమిళనాడు అసెంబ్లీ కూడా తీర్మానాన్ని ఆమోదించిందని తెలిపారు. 

సమావేశంలో మొత్తం 33 మంది నేతలు అభిప్రాయాలు వ్యక్తం చేశారని తెలిపారు. ‘‘పేపర్ లీక్‌‌లు, చందా చోరీలు, చైనా చొరబాట్లు, ఇతర అంశాలపై చర్చించాం. విద్యార్థుల ఆందోళన, కేంద్ర ప్రభుత్వ తీరుపై చర్చ జరిగింది. ‘చందా చోరీ’ అనేది దేశ ప్రజలలో తీవ్ర ఆందోళన కలిగించే అంశం. ఇది ప్రజల మనోభావాలతో ముడిపడింది. ప్రజలను విభజించడానికి రామమందిరాన్ని వాడుకున్న వారి నిజస్వరూపం ఇప్పుడు బయటపడింది’’ అని వేణుగోపాల్ అన్నారు. ఈ అంశాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్తామని ఆయన చెప్పారు.

విద్యా వ్యవస్థ ప్రక్షాళనకు రోడ్‌‌మ్యాప్.. 

దేశ విద్యా, పరీక్షల వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయడానికి ఒక రోడ్‌‌మ్యాప్‌‌ను రూపొందించేందుకు విద్యా నిపుణులతో కలిసి పని చేయాలని సీడబ్ల్యూసీ నిర్ణయించినట్లు జైరాం రమేశ్ తెలిపారు. అలాగే, తనకు నివేదిక సమర్పించాలని పార్టీకి చెందిన ముఖ్యమంత్రులను కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే కోరారని చెప్పారు. 

మోదీ సర్కార్‌‌‌‌తో విద్యార్థుల భవిష్యత్తు నాశనం: ఖర్గే 

విద్యార్థుల భవిష్యత్తును మోదీ సర్కార్ నాశనం చేసిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఫైర్ అయ్యారు. యువత కోసం సమగ్రమైన ‘విద్య నుంచి ఉపాధి వరకు కార్యాచరణ ప్రణాళిక’ను రూపొందించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. సీడబ్ల్యూసీ సమావేశంలో ఖర్గే  ప్రారంభోపన్యాసం చేశారు. రామమందిర చందాల చోరీ అంశంపై ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని, ప్రజలకు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

‘‘గత 12 ఏండ్లుగా మోదీ సర్కార్ యువత భవిష్యత్తును దెబ్బతీసింది. కొత్త స్కూల్స్‌‌ను ప్రారంభించకపోగా, ఇటీవలి కాలంలో 94,000 స్కూళ్లను మూసివేసింది. ప్రైవేటీకరణ పరుగులో, ఉన్నత విద్య మరింత ఖరీదైనదిగా మారుతోంది. సామాన్య కుటుంబాలకు అందుబాటులో లేకుండా పోతోంది’’ అని ఖర్గే మండిపడ్డారు. విద్యాసంస్థలను ఆర్‌‌ఎస్‌‌ఎస్ వ్యక్తులు క్రమంగా తమ అధీనంలోకి తీసుకుంటున్నారని ఆరోపించారు.  

పేపర్ లీక్‌‌లు, నియామక పరీక్షల స్కాంలు, నియామకాలలో జాప్యం వంటి సమస్యలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వీటిపై యువత ఆగ్రహంతో ఉందని, వారి మాటలు వినే సమయం ఈ ప్రభుత్వానికి లేదన్నారు. కానీ దేశ యువత ఆందోళనలను కాంగ్రెస్ తన అజెండాలో చేర్చుకుందని స్పష్టం చేశారు. ‘ఛాత్రోం కీ గూంజ్(విద్యార్థుల గళం)’ ప్రోగ్రాంతో విద్యార్థుల గళాన్ని రాహుల్ గాంధీ జాతీయ స్థాయికి తీసుకువెళ్లారని ఖర్గే పేర్కొన్నారు. 

అలాగే, దేశ సరిహద్దుల్లో చైనా ఆక్రమణల వార్తల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘మన సాయుధ దళాల పట్ల అత్యంత గౌరవం ఉంది. కానీ సరిహద్దుల్లోని పరిస్థితుల గురించి అడిగే ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి”అని ఆయన స్పష్టం చేశారు.

సీఎం రేవంత్‌‌కు హైకమాండ్ ప్రశంసలు 

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై సీడబ్ల్యూసీ ప్రశంసలు కురిపించింది. కులగణన, ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డుల పంపిణీ, విద్యా వ్యవస్థలో తీసుకుంటున్న నిర్ణయాలను అభినందించింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను సీఎం రేవంత్ రెడ్డి సీడబ్ల్యూసీ మీటింగ్‌‌లో వివరించారు. అలాగే కేంద్రంలోని మోదీ సర్కార్ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, దానిపై రాష్ట్రంలో పార్టీ చేపడుతున్న కార్యక్రమాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. 

డబ్ల్యూసీ సమావేశంలో రాష్ట్రం నుంచి సీఎం రేవంత్ రెడ్డితోపాటు మంత్రి దామోదర్ రాజనరసింహా, సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు చల్లా వంశీచంద్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో రెండున్నరేండ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన, పార్టీ అభివృద్ధికి తీసుకున్న చర్యలు, డీసీసీల నుంచి మండల స్థాయిల వరకూ కమిటీల ఏర్పాటు తదితర అంశాలను రేవంత్ రెడ్డి వివరించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత తొలిసారిగా రేషన్ కార్డులు పంపిణీ చేశామని, దాదాపు1.06 కోట్ల మందికి స్మార్ట్ రేషన్ కార్డులు అందించినట్లు చెప్పారు. 

అర్హులందరికీ సన్నబియ్యం అందిస్తున్నామని వివరించారు. ఇందిరమ్మ ఇండ్ల పేరిట  ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలో విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు నిర్మిస్తున్నామని వెల్లడించారు. ఆరోగ్యశ్రీని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామన్నారు. కాగా, సీఎం పాలన తీరుపై అధిష్టానం సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రధానంగా తెలంగాణలో కుల గణన భేష్ అంటూ ప్రశంసలు కురిపించింది. ఇది దేశానికే రోల్ మోడల్‌‌గా నిలిచిందని అభినందించింది.  

©️ VIL Media Pvt Ltd.