Reading Time: 2 minutes

CJP చలో పార్లమెంట్‎కు నో పర్మిషన్.. పరిస్థితి అదుపు తప్పడంతోనే లాఠీ చార్జ్: ఢిల్లీ పోలీస్

Caption of Image.

న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టిన చలో పార్లమెంట్ నిరసన కార్యక్రమం చట్ట విరుద్ధమని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఆ కార్యక్రమానికి ఎలాంటి అనుమతి లేదని పేర్కొన్నారు. నిరసనకారులు మూకుమ్మడిగా బారికేడ్లను దాటి ముందుకు రావడంతో పరిస్థితి అదుపు తప్పిందని.. దాంతోనే నిరసనకారులపై బల ప్రయోగం చేయాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. ఈ మేరకు సుప్రీం కోర్టులో ఢిల్లీ పోలీసులు అఫిడవిట్ దాఖలు చేశారు.

కాగా, నీట్ యూజీ 2026 పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా 2026, జులై 20న సీజేపీ చలో పార్లమెంట్ కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం తీవ్ర హింసాత్మకంగా మారింది. నిరసనకారులపై ఢిల్లీ పోలీసులు దమనకాండ కొనసాగించారు. విచక్షణరహితంగా లాఠీచార్జ్ చేయడంతో పాటు టియర్ గ్యాస్, పెల్లెట్ గన్స్ ప్రయోగించారు. విద్యార్థులపై దాడులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఢిల్లీ పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. 

ఈ క్రమంలోనే విద్యార్థులపై పోలీసుల బలప్రయోగానికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన దేశ సర్వోన్నత న్యాయస్థాయం కౌంటర్ దాఖలు చేయాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీ పోలీసులు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ అఫిడవిట్‎లో పలు అంశాలు ప్రస్తావించారు. 

►ALSO READ | NEET పేపర్ లీక్ నిరసనలు: విద్యార్థులపై పోలీసుల అత్యుత్సాహంపై సుప్రీంకోర్టు హై-పవర్డ్ కమిటీ

చలో పార్లమెంట్ సందర్భంగా విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్‎కు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్లకు ఈ మేరకు ఢిల్లీ పోలీసులు అఫిడవిట్ దాఖలు చేశారు. సీజేపీ చలో పార్లమెంట్ మార్చ్‌కు ఎలాంటి అధికారిక అనుమతి ఇవ్వలేదని.. ఢిల్లీలో బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 163 అమలులో ఉందని పోలీసులు పేర్కొన్నారు.

జంతర్ మంతర్ దగ్గర సుమారు 30 వేల మంది గుమిగూడటంతో పాటు ఆందోళనకారులు బారికేడ్లను దాటి పార్లమెంట్ వైపు వెళ్లేందుకు యత్నించి పోలీసులపై దాడికి దిగారని వెల్లడించారు. పరిస్థితి అదుపు తప్పడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా బలప్రయోగం చేయాల్సి వచ్చిందని వివరించారు. నిరసనకారులపై తీవ్ర బలప్రయోగం చేసినట్లు సోషల్ మీడియాలో జరుగుతోన్న ప్రచారం అవాస్తవమని పేర్కొన్నారు. 

 

©️ VIL Media Pvt Ltd.