
కేబీఆర్ పార్క్ చుట్టూ జరుగుతున్న ఫ్లైఓవర్లు, అండర్‌పాస్ నిర్మాణ పనులు హైదరాబాద్ వాసులకు చుక్కలు చూపిస్తున్నాయి. పనుల కారణంగా అమలులోకి వచ్చిన ట్రాఫిక్ మళ్లింపులు ప్రయాణికులకు తీవ్ర నరకాన్ని తలపిస్తున్నాయి. పదే నిమిషాల్లో చేరుకోవాల్సిన గమ్యస్థానానికి ఇప్పుడు గంటల తరబడి సమయం పడుతోంది.రూట్లు అర్థంకాక వాహనదారులు తిరిగిన చోటే మళ్లీ మళ్లీ తిరుగుతూ అయోమయానికి గురవుతున్నారు. అధికారుల సరైన మార్గదర్శకత్వం లేకపోవడంతో సామాన్య ప్రజలు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు.
ఒక ప్రయాణికుడు తన ఆవేదనను ఇలా పంచుకున్నారు…వన్ వే అని మాకు తెలియదు! పెద్దమ్మ గుడికి పది నిమిషాల్లో వెళ్లేవాడిని.. ఇప్పుడు గంట అయినప్పటికీ వెళ్లలేకపోయాను. ఈ వన్ వే వల్ల ట్రాఫిక్ మరింత పెరిగి విపరీతంగా ఇబ్బంది అవుతోంది. రోడ్డు మీద పోలీసులేమో ఫోన్లు ఒత్తుకుంటూ ఉంటారు తప్ప ట్రాఫిక్ క్లియర్ చేయడం గానీ, దారి చెప్పడం గానీ చేయట్లేదు అని తీవ్రంగా మండిపడ్డారు.
మరో ప్రయాణికుడు మాట్లాడుతూ…సగం పెట్రోల్ ట్యాంక్ కేబీఆర్ పార్క్ చుట్టూ తిరిగేసరికే ఖాళీ అయిపోయింది! ఆఫీస్ నుంచి మా మేనేజర్ ఫోన్ చేసి ‘ఇంకా ఎందుకు రాలేదు?’ అని తిడుతున్నారు.. ఆయనకి నేను ఏం సమాధానం చెప్పాలి? అంటూ తన గోడు వెళ్లబోసుకున్నారు.
అభివృద్ధి పనులు ఎవరికోసమైనా, ప్రయాణికులు పడుతున్న ఈ అష్టకష్టాలకు అధికారులు త్వరగా చెక్ పెట్టి, స్పష్టమైన ట్రాఫిక్ మళ్లింపు బోర్డులను ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు. లేదంటే రోడ్లపై ప్రయాణం నిత్య నరకమే అవుతుందంటున్నారు వాహనదారులు