Reading Time: 2 minutes
IND vs SL: రెండో టెస్టుకు కుల్‌దీప్ అవుట్? ఆ తండ్రి కల నెరవేర్చనున్న 33 ఏళ్ల ఆల్‌రౌండర్‌

IND vs SL: గాలే వేదికగా జరిగిన మొదటి టెస్టులో భారత్ మూడు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. రవీంద్ర జడేజా, మానవ్ సుతార్, కుల్‌దీప్ యాదవ్ ఈ విభాగాన్ని నడిపించారు. యంగ్ స్పిన్నర్ మానవ్ సుతార్ అద్భుత ప్రదర్శనతో ఏకంగా 10 వికెట్లు తీసి మ్యాచ్ విజేతగా నిలిచాడు. జడేజా రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 4 వికెట్లు పడగొట్టాడు. తిరుగులేని స్పిన్ పిచ్‌పై కూడా కుల్‌దీప్ యాదవ్ మాత్రం పూర్తిగా ప్రభావం చూపలేకపోయాడు. రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 25 ఓవర్లు బౌలింగ్ చేసిన కుల్‌దీప్ 103 పరుగులిచ్చి కేవలం ఒకే ఒక్క వికెట్ మాత్రమే తీసుకోగలిగాడు.

కొలంబోలో డెబ్యూకి సిద్ధమైన సారాంశ జైన్

ఇండియా టుడే నివేదికల ప్రకారం ఆగస్టు 23 నుంచి కొలంబోలో ప్రారంభమయ్యే రెండో టెస్టు మ్యాచ్‌లో కుల్‌దీప్ స్థానంలో సారాంశ జైన్‌కు అవకాశం ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 33 ఏళ్ల ఈ మధ్యప్రదేశ్ ఆఫ్ స్పిన్ ఆల్‌రౌండర్‌ను తుది జట్టులోకి తీసుకోవడం ద్వారా లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ బలాన్ని కూడా పెంచవచ్చని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. సారాంశ జైన్ తన అంతర్జాతీయ అరంగేట్రాన్ని ఎదురుచూస్తున్న తరుణంలో ఈ వార్త క్రికెట్ వర్గాల్లో తీవ్ర ఆసక్తి రేపుతోంది.

ఇది కూడా చదవండి: SL vs IND 2nd Test: ఆ రూల్ ఎఫెక్ట్.. 2వ టెస్ట్ కు ముందే ఊహించని షాక్.. ఏకంగా ముగ్గురు ఔట్..!

డొమెస్టిక్ క్రికెట్‌లో అద్భుత రికార్డులు

మధ్యప్రదేశ్‌కు చెందిన సారాంశ జైన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌ల్లో 188 వికెట్లు పడగొట్టడమే కాకుండా బ్యాట్‌తో 2223 పరుగులు సాధించాడు. అతని ఖాతాలో 2 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2021-22 సీజన్‌లో మధ్యప్రదేశ్ రంజీ ట్రోఫీ విజేతగా నిలవడంలో సారాంశ కీలక పాత్ర పోషించాడు. ఆ సీజన్‌లో 13 వికెట్లు తీయడంతో పాటు ఫైనల్‌లో 57 పరుగుల అమూల్యమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాతి సీజన్‌లో 360 పరుగులు చేసి 35 వికెట్లు పడగొట్టడంతో రంజీ ట్రోఫీ బెస్ట్ ఆల్‌రౌండర్‌గా లాల్ అమర్‌నాథ్ అవార్డు దక్కించుకున్నాడు.

ఇది కూడా చదవండి: Saaniya Chandhok: సచిన్ కోడలు సానియా చందోక్‌లో ఈ టాలెంట్ ఉందా? ఏం చేసిందో తెలిస్తే వావ్ అంటారు

తండ్రి కలను నెరవేర్చేందుకు అడుగులు

1993 మార్చి 31న ఇండోర్‌లో జన్మించిన సారాంశ జైన్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్, రైట్ హ్యాండ్ ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేస్తాడు. అతని తండ్రి సుబోధ్ జైన్ కూడా మధ్యప్రదేశ్ తరఫున రంజీ ట్రోఫీ ఆడిన మాజీ క్రికెటర్. తన పెద్ద కుమారుడిని క్రికెటర్‌గా మార్చాలని ప్రయత్నించినప్పటికీ, అది సాధ్యపడలేదు. దాంతో సారాంశ్‌పైనే కొండంత ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు చారిత్రక వేదికపై భారత క్యాప్ అందుకోవడం ద్వారా తండ్రి కలను నిజం చేసేందుకు సారాంశ సిద్ధమయ్యాడు.

ఇది కూడా చదవండి: Ravindra Jadeja: నో బాల్ పాపానికి ప్రాయశ్చిత్తం.. 131 బంతుల తర్వాత తప్పు సరిదిద్దుకున్న జడేజా 

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..