
ఖమ్మం, వెలుగు: ఖమ్మం జిల్లాలో సాగర్ ఆయకట్టు కింద రైతులు సాగు చేసిన పంటలు ఎండిపోకుండా సకాలంలో సాగునీరు అందించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆఫీసర్లను ఆదేశించారు. నీటి లభ్యతను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ, అందుబాటులో ఉన్న నీటిని సమర్థవంతంగా వినియోగించేలా సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్, నీటిపారుదల శాఖ అధికారులకు సూచించారు.
సాగునీటి సమస్యను సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు మంత్రి తెలిపారు. వారి ఆదేశాల మేరకు ఈనెల 15న అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు వద్ద సీతారామ ప్రాజెక్టు మోటర్లు ప్రారంభించి, గోదావరి జలాలను రాజీవ్ లింక్ కెనాల్‌కు విడుదల చేసినట్లు చెప్పారు.
ప్రస్తుతం ఆ నీటితో సాగర్ ఆయకట్టు పరిధిలోని ప్రధాన చెరువులకు నీరు చేరుతోందన్నారు. ప్రధాన, ఉప కాలువల్లో గండ్లు, లీకేజీలు లేదా సాంకేతిక సమస్యలు తలెత్తితే వెంటనే మరమ్మతులు చేపట్టి నీరు వృథా కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
తాగునీటికి కొరత లేకుండా చర్యలు..
జిల్లాలో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ దివాకర తెలిపారు. పాలేరు జలాశయంలో 17.3 అడుగులు, వైరా జలాశయంలో 16.8 అడుగుల నీటిమట్టం ఉందని చెప్పారు. పాలేరు నీరు ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల అవసరాలకు సుమారు 60 రోజులు, వైరా నీరు వైరా, మధిర నియోజకవర్గాలకు సుమారు 135 రోజులు సరిపోతుందని తెలిపారు.
ప్రస్తుతం తాగునీటికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, వర్షపాతం, ప్రాజెక్టులకు వచ్చే వరద ప్రవాహాలను బట్టి సాగునీటి విడుదలపై నిర్ణయం తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. రైతులు నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని తక్కువ నీటితో సాగు చేయగల పంటలను ఎంచుకోవాలని సూచించారు.
సాగునీరు విడుదల చేయాలి
వైరా, వెలుగు: వైరా రిజర్వాయర్ నుంచి వెంటనే సాగునీరు విడుదల చేసి పంటలను కాపాడాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ ఆధ్వర్యంలో సోమవారం వైరా నీటిపారుదల శాఖ ఆఫీస్ ఎదుట రైతులు, నాయకులు ఆందోళన నిర్వహించారు. అనంతరం డీఈ నాగబ్రహ్మయ్య ఛాంబర్‌లో నాయకులతో చర్చించారు. రిజర్వాయర్ కింద వేలాది ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయని, నీరందకపోతే పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని తెలిపారు.
వైరా ఎస్సై పుష్పాల రామారావు పరిస్థితిని పర్యవేక్షించారు. రైతు బోడేపూడి మాధవరావు సాగునీరు విడుదల చేసి తన పంటను కాపాడాలని కోరుతూ ఎస్సై కాళ్లపై పడి కన్నీళ్లు పెట్టుకున్నారు. లింగన్నపాలెం రెవెన్యూ పరిధిలో నాలుగు ఎకరాల్లో వరి సాగు చేస్తున్నానని, నీరు అందకపోతే పంట నష్టపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.