
- నాగార్జున హైస్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య కేసులో సంచలనం
- ఆమె నోటి నుంచి వచ్చిన చివరి మాటలే పట్టించినయ్
- జల్సాల కోసం దారుణానికి ఒడిగట్టిన ఇద్దరు విద్యార్థులు
- రక్తపు మరకలున్న నోట్లు..
- అండర్‌వేర్‌లో దాచిన నగదు స్వాధీనం
- వివరాలు వెల్లడించిన
- నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్
నల్గొండ, వెలుగు: జల్సాలకు అలవాటుపడ్డ ఇద్దరు పదో తరగతి విద్యార్థులు డబ్బు కోసం స్కూల్ ప్రిన్సిపాల్‌ను దారుణంగా హతమార్చారు. లగ్జరీ లైఫ్ అనుభవించాలని, ఖరీదైన బైకులపై తిరగాలన్న కోరికలతో విద్యాబుద్ధులు నేర్పిన టీచర్నే పొట్టనబెట్టుకున్నారు. చనిపోతూ ‘బాబూ’ అని ఆమె పలికిన చివరి మాటే పోలీసులు కేసును ఛేదించేలా చేసింది. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్రంలో సంచలనం సృష్టించిన నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపాల్ కల్లు రూపారెడ్డి (49) హత్య కేసులో నిందితులు స్టూడెంట్లేనని తేలింది.
ఆమె పనిచేస్తున్న స్కూల్‌లోనే చదువుతున్న ఇద్దరు పదో తరగతి విద్యార్థులు రూపారెడ్డిని అత్యంత కిరాతకంగా చంపినట్టు నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించారు. డబ్బు కోసమే విద్యార్థులు దారుణానికి ఒడిగట్టినట్టు చెప్పారు. నిందితుల నుంచి రూ.1.54 లక్షల నగదు, కత్తి, ఐఫోన్, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు.
పోలీసుల విచారణలో నిందితులు చెప్పిన విషయాలు షాక్‌కు గురిచేస్తున్నాయి. హాస్టల్ గదిలో కలిసి ఉంటున్న వీరిద్దరు చెడు వ్యసనాలకు అలవాటు పడ్డారు. లగ్జరీ బైకులు కొనుక్కుని ఎంజాయ్ చేయాలని ఆశ పడినవారు తేలికగా డబ్బు ఎలా సంపాదించాలో ఆన్లైన్లో వెతికేవారు. గత నెలలో హాస్టల్ లో వీరి వద్ద మొబైల్ దొరకడంతో ప్రిన్సిపాల్ రూపారెడ్డి వీరిని తల్లిదండ్రుల సమక్షంలో మందలించారు. వారిని హాస్టల్నుంచి తొలగించడంతో ఆ తర్వాత ఇంటిదగ్గర నుంచే స్కూలుకు వస్తున్నారు. ఈ విషయంలో ప్రిన్సిపాల్మీద వారు కక్ష పెంచుకున్నారు.
యూట్యూబ్ లో చూసి చోరీ ప్లాన్.. ఐదు రోజులు రెక్కీ
స్కూల్ ఫీజుల డబ్బు రూపారెడ్డి వద్దే ఉంటాయని భావించిన విద్యార్థులు ఆమె ఇంట్లో చోరీ చేయాలని ప్లాన్చేశారు. ఇందుకోసం దొంగతనం ఎలా చేయాలో, పోలీసులకు దొరకకుండా ఎలా తప్పించుకోవాలో యూట్యూబ్ లో ఐదు రోజుల పాటు సెర్చ్ చేశారు. రూపారెడ్డి ఇంటి వద్ద ఐదు రోజుల పాటు రెక్కీ నిర్వహించారు. ఈ నెల 11న స్కూల్ ముగిసిన తర్వాత విద్యార్థులు పక్కా ప్లాన్ ప్రకారం కొండమల్లేపల్లి మార్కెట్లో కత్తి, గ్లౌజులు, మాస్కులు కొనుగోలు చేశారు. రూపారెడ్డి ఇంటి వద్దకు చేరుకుని ఒకరు బయట నిఘా పెట్టగా, మరొకరు ఇంటి వెనుక వైపు నుంచి లోపలికి ప్రవేశించారు. ఇంటిలోకి వచ్చిన రూపారెడ్డి ఆమె బ్యాగ్ ను బెడ్ రూమ్ లో పెట్టి బయటకు వచ్చి హాల్లో ఫోన్మాట్లాడుకుంటూ ఉంది.
రూపారెడ్డి బెడ్రూం నుంచి బయటకు వచ్చిన తర్వాత రూమ్‌లోకి ప్రవేశించి స్టూడెంట్బీరువాలో ఉన్న రూ.2.5 లక్షల నగదు తీసుకొని బయటకు వెళ్తుండగా రూపారెడ్డి గుర్తుపట్టారు. దీంతో తమ గుట్టు ఎక్కడ బయటపడుతుందోననే భయంతో తనతో తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతులో పొడిచాడు. విచక్షణారహితంగా 27 సార్లు పొడిచి ఆమె ప్రాణాలు తీశాడు. ఆ తర్వాత ఇద్దరూ విద్యార్థుఉల గోడ దూకి పరారయ్యారు. మార్గమధ్యంలో బట్టలు మార్చుకుని ఎరుపు రంగు హుడీని డ్రైనేజీలో విసిరేశారు. కత్తి, గ్లౌజులు, ఐఫోన్‌ను పొదల్లో పారేసి వెళ్లిపోయారు. ఈ నెల 12న హైదరాబాద్ వెళ్లి నాలుగు రోజలపాటు జల్సాలు చేసి 16న తిరిగి ఊరికి చేరుకున్నారు.
బాబూ.. అన్న మాటతో వీడిన మిస్టరీ
ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు 5 ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. దాదాపు 30 కిలోమీటర్ల పరిధిలోని 70 సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించడంతో పాటు 80 మందికి పైగా అనుమానితులను విచారించారు. హత్యకు గురయ్యే ముందు రూపారెడ్డి తన చిన్నమ్మతో ఫోన్‌లో మాట్లాడుతుండగా.. చివరిగా ఆమె నోటి నుంచి ‘బాబూ’ అనే పదం వచ్చింది. ఆ వెంటనే ఫోన్ కట్ అయింది. చిన్నమ్మ చెప్పిన వివరాల ఆధారంగా ‘బాబు’ ఎవరు? అనే కోణంలో పోలీసులు ఆరా తీయగా.. స్కూల్‌లో పిల్లలను ఆమె ఎప్పుడూ బాబు అని పిలుస్తుందని తెలిసింది. దీంతో దర్యాప్తు స్కూల్ విద్యార్థుల వైపు మళ్లింది. ఈక్రమంలో అనుమానాస్పదంగా కనిపించిన విద్యార్థుల కదలికలు, స్కూల్ రిజిస్టర్, సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు నిశితంగా పరిశీలించారు.
అండర్‌వేర్‌లో నగదు..
ప్రిన్సిపాల్ మరణంతో స్కూల్‌కు వరుసగా ఆరు రోజులు సెలవులు ఇచ్చారు. బడి తెరిచాక పోలీసులు అనుమానితులైన విద్యార్థులను విచారించడం ప్రారంభించారు. ఈ క్రమంలో మొదట ఐదుగురు విద్యార్థులను అనుమానించారు. ఇద్దరు విద్యార్థులు రెండ్రోజులుగా బడికి రాకపోవడంతో వారిపై నిఘా పెట్టారు. వీరిలో ఒక విద్యార్థి రూపం సీసీ టీవీ ఫుటేజీతో మ్యాచ్ అయ్యింది. బుధవారం ఉదయం పెండ్లిపాకల ఎక్స్ రోడ్డు వైపు నుంచి వస్తున్న ఆ ఇద్దరిని దొనియాల ఎక్స్ రోడ్డు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వారిని తనిఖీ చేయగా.. అండర్ వేర్ లో దాచిన రూ.1.54 లక్షల నగదు బయటపడింది. ఆ నోట్లలో మూడు రూ.500 నోట్లపై రక్తపు మరకలు ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో ఆ ఇద్దరు విద్యార్థులే ఈ దారుణానికి ఒడిగట్టినట్టు తేలిపోయింది. వారి నుంచి రూ.1.54 లక్షల నగదు, హత్యకు ఉపయోగించిన కత్తి, గ్లౌజులు, మాస్కులు, ఐఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు.
నిందితులు ఇద్దరూ మైనర్లు కావడంతో చట్టపరమైన నిబంధనల ప్రకారం వారిని జువైనల్ హోమ్‌కు తరలించనున్నట్టు ఎస్పీ తెలిపారు. సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ విశ్లేషణ ద్వారా కేసును ఛేదించిన దేవరకొండ డీఎస్పీ ఎంవీ శ్రీనివాసరావు, మల్లెపల్లి సీఐ నవీన్ కుమార్, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ జితేందర్ రెడ్డి, మల్లెపల్లి ఎస్‌ఐ రమేశ్, చింతపల్లి ఎస్‌ఐ రామ్మూర్తి సహా దాదాపు 40 మంది అధికారులు, సిబ్బందిని ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రత్యేకంగా అభినందించి, వారికి రివార్డులను ప్రకటించారు.