
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో చక్కెర ధరలు భారీగా పెరిగాయి. కేవలం పది రోజుల వ్యవధిలోనే రూ.8 మేర పెరిగి వినియోగదారులకు షాక్ ఇచ్చాయి. ఆగస్ట్ 10 నాటికి ముంబైలో కిలో చక్కెర ధర రూ.50గా ఉంది. పది రోజుల గ్యాప్‌లోనే అది రూ.58కు చేరింది. రానున్న రోజుల్లో ధర మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.
దేశీయంగా చక్కెర ఉత్పత్తి పడిపోవడం, వినాయక చవితి, దసరా, దీపావళి పండుగ సీజన్‌కు ముందు అధిక డిమాండ్, ఇథనాల్ మిశ్రమ తయారీకి చెరుకు ఉపయోగం పెరగడమే చక్కెర ధరల ఆకస్మిక పెరుగుదలకు ప్రధాన కారణం అంటున్నారు వ్యాపారులు. అలాగే, సెప్టెంబర్ 30 నాటికి దేశంలో చక్కెర నిల్వలు గత కొన్ని దశాబ్దాలలోనే అత్యంత కనిష్ట స్థాయికి పడిపోతాయనే అంచనాలు కూడా మార్కెట్‌లో ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి.
ఇప్పటికే ఆకానంటుతున్న నిత్యవసర ధరలు, ఇంధన ధరలతో సతమతమవుతోన్న సామాన్య ప్రజలకు చక్కెర ధరల పెంపు మరింత గుదిబండగా మారింది. ఈ అసాధారణ ధరల పెరుగుదలను అరికట్టడంతో పాటు పండుగల వేళ సామాన్యులపై భారం తగ్గించడానికి ప్రభుత్వం నివారణ చర్యలు తీసుకుంటుంది.
ఇందులో భాగంగా చక్కెర నిల్వ పరిమితులను మరింత కఠినతరం చేస్తోంది. మార్కెట్‌లో కృతిమ కొరత సృష్టించేందుకు ఉద్దేశపూర్వంగా చక్కెరను నిల్వ చేస్తే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామని ప్రభుత్వం వ్యాపారులను హెచ్చరించింది.