Reading Time: 2 minutes

తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్లకు, మల్టీప్లెక్స్లకు టికెట్ రేట్లను ఫిక్స్ చేసిన ప్రభుత్వం

Caption of Image.

హైదరాబాద్: తెలంగాణలో సినిమా టికెట్ రేట్లపై కీలక జీవో విడుదలైంది. కొత్తగా స్పెషల్ థియేటర్స్ కేటగిరి ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. 7.1, 2K/4K స్క్రీన్లను స్పెషల్ కేటగిరిగా గుర్తించింది. ప్రతి థియేటర్‌లో 25 శాతం సీట్లు నాన్ ప్రీమియం అని ప్రభుత్వం ప్రకటించింది. ఉదయం 8 నుంచి రాత్రి 1 వరకు 5 షోలకు అనుమతి ఇచ్చింది.

చిన్న సినిమాలకు రోజూ ఒక షో తప్పనిసరి స్క్రీనింగ్ ఇవ్వాలని స్పష్టం చేసింది. రూ.100 కోట్లు పైబడిన సినిమాలకు సూపర్ హైబడ్జెట్ హోదా కల్పించింది. తొలి 10 రోజులు టికెట్ ధరలు పెంచుకునే అవకాశం ఇచ్చింది. కార్మికుల సంక్షేమ నిధికి విరాళం ఇవ్వాలని షరతు విధించింది. సంక్షేమ నిధికి రూ.కోటి వరకు విరాళం తప్పనిసరి అని జీవోలో ప్రభుత్వం పేర్కొంది.

సినిమా టికెట్ల ధరల విషయంలో సింగిల్ స్క్రీన్ థియేటర్లకు, మల్టీప్లెక్స్లకు రేట్లను తెలంగాణ ప్రభుత్వం ఫిక్స్ చేసింది. నాన్ ఏసీ థియేటర్లలో ప్రీమియంలో కనిష్ఠంగా రూ.50, గరిష్ఠంగా రూ.100,  నాన్ ప్రీమియంలో కనిష్ఠంగా రూ.30, గరిష్ఠంగా రూ.70 మాత్రమే ఛార్జ్ చేయాలని ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీకి, థియేటరో యాజమాన్యాలకు స్పష్టం చేసింది.

ఏసీ థియేటర్లలో నాన్ ప్రీమియంలో కనిష్ఠంగా రూ.50, గరిష్ఠంగా రూ.150.. ఏసీ థియేటర్లలో ప్రీమియంలో కనిష్ఠంగా రూ.100, గరిష్ఠంగా రూ.200 మాత్రమే టికెట్ రేట్లు ఉండాలని తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెప్పింది. స్పెషల్ థియేటర్లలో నాన్ ప్రీమియంలో కనిష్ఠంగా రూ.100, గరిష్ఠంగా రూ.250 ఖరారు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ పరిణామంపై తెలుగు సినీ పరిశ్రమలో ఆసక్తికర చర్చ మొదలైంది.

©️ VIL Media Pvt Ltd.