
Hardik Pandya: ఐపీఎల్ 2027 వేలానికి ముందు హార్దిక్ పాండ్యాను వేరే జట్టుకు ట్రేడ్ చేసే అవకాశం ఉందంటూ గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో ఊహాగానాలు షికారు చేస్తున్నాయి. ఈ ప్రచారం తీవ్రస్థాయికి చేరిన తరుణంలో ముంబై ఇండియన్స్ తమ అధికారిక ఖాతాలో హార్దిక్ పాండ్యా నెట్స్ ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోలను షేర్ చేసింది. దాంతో ఫ్యాన్స్ రెండు వర్గాలుగా విడిపోయి విశ్లేషణలు మొదలు పెట్టారు. ఒక వర్గం ఈ పోస్ట్ ద్వారా పాండ్యాను జట్టులోనే ఉంచుకుంటున్నారని భావిస్తుంటే, మరో వర్గం మాత్రం ఇది కేవలం వీడ్కోలుకు ముందు ఇస్తున్న సంకేతమని కామెంట్లు పెడుతోంది.
ముంబై జట్టుతో హార్దిక్ ప్రయాణంలో హెచ్చుతగ్గులు
2015లో ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్ ప్రయాణాన్ని ప్రారంభించిన హార్దిక్ పాండ్యా, 2022 సీజన్ నాటికి గుజరాత్ టైటాన్స్ జట్టుకు కెప్టెన్‌గా వెళ్లి తొలి ఏడాదిలోనే ట్రోఫీ సాధించిపెట్టారు. ఆ తర్వాత మళ్లీ ప్రత్యేక ట్రేడింగ్ విండో ద్వారా ముంబై ఇండియన్స్ జట్టులోకి తిరిగి వచ్చిన ఆయనకు ఫ్రాంచైజీ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. 2024 సీజన్‌లో ముంబై జట్టు పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంతో తీవ్రంగా నిరాశపరిచింది. తర్వాతి ఐపీఎల్ 2026 సీజన్‌లో క్వాలిఫైయర్ 2 వరకు వెళ్లినప్పటికీ 9వ స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ ఫలితాల నేపథ్యంలో కెప్టెన్‌గా హార్దిక్ స్థానంపై నిరంతరం అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి.
ట్రేడింగ్ రూల్స్‌పై గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు
ఒక ఫ్రాంచైజీ నుంచి మరో ఫ్రాంచైజీకి ఆటగాళ్లను బదిలీ చేసే ప్రక్రియపై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రముఖ పత్రిక మిడ్-డేకి రాసిన కథనంలో ఆయన ఐపీఎల్ ట్రేడింగ్ పారదర్శకతపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆటగాళ్ల ట్రేడింగ్ జరుగుతున్నప్పుడు ఆ లావాదేవీలకు సంబంధించిన ఆర్థిక వివరాలు కేవలం రెండు ఫ్రాంచైజీలు, ఆ ఆటగాడు, బీసీసీఐకి మాత్రమే తెలుస్తున్నాయని తెలిపారు. దీనివల్ల ప్రతీ ఫ్రాంచైజీకి ఉండే శాసనబద్ధమైన శాలరీ క్యాప్ నిబంధనలు సక్రమంగా పాటిస్తున్నారో లేదో ఇతర జట్లకు తెలియకుండా పోతోందని వివరించారు.
Memo: Make it 𝑯𝑷 𝒄𝒐𝒅𝒆𝒅
pic.twitter.com/eabVkzk6s1
— Mumbai Indians (@mipaltan) August 19, 2026
పూర్తి పారదర్శకత ఉంటేనే లీగ్ గౌరవం
ప్రపంచంలోనే అతిపెద్ద టీ20 లీగ్‌గా గుర్తింపు పొందిన ఐపీఎల్ పవిత్రతను కాపాడటానికి ట్రేడింగ్ సమాచారాన్ని బహిరంగంగా వెల్లడించాలని గవాస్కర్ విజ్ఞప్తి చేశారు. ప్రతి ప్లేయర్ ట్రేడింగులో ఎంత సొమ్ము చేతులు మారిందో స్పష్టంగా తెలియజేస్తే ఎలాంటి అక్రమాలకు తావుండదని అభిప్రాయపడ్డారు. లీగ్ అభివృద్ధిపై అసూయపడేవారు వేళ్లు ఎత్తి చూపకుండా ఉండాలంటే లావాదేవీలు అత్యంత పారదర్శకంగా జరగాల్సిన అవసరం ఉందని ఆయన కుండబద్దలు కొట్టారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
