Reading Time: 2 minutes

1937 తీర్మానానికి జై కొట్టిన కాంగ్రెస్.. వందేమాతరంపై CWC సంచలన నిర్ణయం

Caption of Image.

న్యూఢిల్లీ: జాతీయ గేయం వందేమాతరంపై కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీ అంతర్గత సమావేశాలు, పార్టీ కార్యక్రమాల్లో వందేమాతరం గీతంలోని మొదటి రెండు చరణాలను మాత్రమే ఆలపించాలని పునరుద్ఘాటించింది. ఈ మేరకు బుధవారం (ఆగస్ట్ 19) జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో 1937 నాటి పార్టీ తీర్మానానికే కట్టుబడి ఉంటామని కాంగ్రెస్ స్పష్టం చేసింది. వందేమాతరంలోని పూర్తి ఆరు చరణాలను ఆలపించాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేసిన నేపథ్యంలో సీడబ్ల్యూసీ తాజా తీర్మానం బీజేపీ, కాంగ్రెస్ మధ్య పొలిటికల్ వార్‎ను మరింత పెంచనుంది. 

అసలేం జరిగిందంటే..?

జాతీయ గేయం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మోడీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. జాతీయ గీతం జనగణమన మాదిరిగానే వందేమాతరానికి చట్టబద్ధత కల్పించింది. అధికారిక ప్రభుత్వ కార్యక్రమాల్లో వందేమాతరంలోని పూర్తి ఆరు చరణాలను ఆలపించాలని.. దానికి తగిన గౌరవ చట్టపరమైన రక్షణలు కల్పించాలని నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. 

అయితే, 2026, ఆగస్ట్ 15న ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా వందేమాతరం పూర్తి పాడకుండా.. కేవలం మొదటి రెండు చరణాలే మాత్రమే ఆలపించారు. ఈ ఘటనపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ నాయకత్వం జాతీయ గేయాన్ని గౌరవించడం లేదని ఆరోపించింది. ఈ క్రమంలో వందేమాతరం గేయంపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. 1937 నాటి సీడబ్ల్యూసీ తీర్మానం మేరకు పార్టీ కార్యక్రమాల్లో వందేమాతరంలోని మొదటి రెండు చరణాలను మాత్రమే ఆలపించాలని నిర్ణయించింది. 

1937 సీడబ్ల్యూసీ తీర్మానం ఏంటంటే..?

బంకిం చంద్ర ఛటర్జీ రాసిన వందేమాతరం గీతంలో మొత్తం ఆరు చరణాలు ఉన్నాయి. ఇందులో మొదటి రెండు చరణాలు కేవలం మాతృభూమి ప్రకృతి సౌందర్యాన్ని, విశిష్టతను వర్ణిస్తుండగా.. మిగిలిన చరణాల్లో కొన్ని చోట్ల మతపరమైన ప్రస్తావనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సెక్యులర్ దేశమైన భారత్‎లో అన్ని వర్గాల సెంటిమెంట్లను గౌరవిస్తూ మతపరమైన ప్రస్తావన ఉన్న వందేమాతరం చరణాలను ఆలపించకుండా.. కేవలం వందేమాతరంలోని తొలి రెండు చరణాలను మాత్రమే పాడాలని 1937లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానించింది. 

రవీంద్రనాథ్ ఠాగూర్ ఇచ్చిన ఈ సలహాను మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, మౌలానా అబుల్ కలాం ఆజాద్‌లతో కూడిన కాంగ్రెస్ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించింది. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఈ రెండు చరణాల వెర్షన్‌నే ఆలపిస్తోంది.

©️ VIL Media Pvt Ltd.