Reading Time: < 1 minute
Tamil Nadu Tvk Mla Pallavi Attends Assembly With Newborn Baby

తమిళనాడు అసెంబ్లీ సమావేశాలకు టీవీకే ఎమ్మెల్యే ఎంఆర్. పల్లవి తన నవజాత శిశువుతో హాజరైంది. ప్రస్తుతం ఈ వార్త సంచలనంగా మారింది. అయితే సోషల్ మీడియా వేదికగా ఎమ్మెల్యేపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్యే ఆడంబర ప్రదర్శన చేస్తున్నారంటూ విమర్శించారు. మరికొందరు పల్లవి తీరును సమర్థించారు.

అసెంబ్లీ సమావేశాలకు వచ్చినప్పుడు ప్రాంగణంలో చంటి బిడ్డను సంరక్షకురాలి దగ్గర వదిలిపెట్టి సభా కార్యకలాపాలకు హాజరవుతున్నారు. సభ ముగియగానే బిడ్డను తీసుకుని వెళ్తున్నారు. అయితే ఎమ్మెల్యే తీరును కొందరు తప్పుబడుతూ విమర్శలు గుప్పించారు. ఆడంబర ప్రదర్శన చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. అయితే ఆ ఆరోపణలకు ఎమ్మెల్యే ధీటుగా బదులిచ్చారు. ఆరోపణలు అన్యాయమైనవని.. తాను బిడ్డను ఇంట్లో వదిలిపెట్టి రాలేక అసెంబ్లీకి తీసుకొస్తున్నట్లు సమాధానం ఇచ్చారు.

‘‘ఇలా గొప్పలు చెప్పుకోవడంలో అర్థమేముంది? పసికందును ఇంట్లో ఎలా వదిలి వెళ్లగలను? దయచేసి ఆలోచించి మాట్లాడండి. ఇతరుల బాధ మీకు అర్థం కాకపోయినా పర్వాలేదు. కానీ ట్రోల్ చేయకండి.’’ అని విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పల్లవి చెన్నైలోని తిరువిక్కా నగర్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్ 8 వరకు కొనసాగనున్నాయి. ఇదిలా ఉంటే అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి విజయ్.. చంటి బిడ్డను ఎత్తుకుని ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా వైరల్ అవుతున్నాయి.