
నేరడిగొండ/ఆసిఫాబాద్/ఆదిలాబాద్‌టౌన్, వెలుగు: కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాన్ని పూర్తిగా రద్దు చేసే కుట్రలు మానుకోవాలని, తిరిగి పథకాన్ని కొనసాగించాలని ఆదిలాబాద్జిల్లా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ డిమాండ్ చేశారు. ఇచ్చోడ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో మంగళవారం బీఆర్ఎస్నాయకులతో కలిసి భారీ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ఆడబిడ్డలకు తులం బంగారం అమలు చేస్తానని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆ తర్వాత విస్మరించిందన్నారు. మాజీ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను ఆనవాళ్లు లేకుండా చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
బంద్ చేస్తే ఊరుకోం
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాన్ని రద్దు చేయాలనే కాంగ్రెస్ కుట్రను సాగనివ్వమని,ఈ స్కీమ్ లు బంద్ చేస్తే ఊరుకోమని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఫైర్ అయ్యారు. కలెక్టరేట్ ఎదుట బీఆర్ఎస్ లీడర్లతో కలిసి ధర్నా చేశారు. హైకోర్టు తీర్పును సాకుగా చూపి పేదింటి ఆడబిడ్డలకు ఇచ్చే భరోసాను ఎత్తివేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని విమర్శించారు. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు అండగా నిలిచిన పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఆపే కుట్రను చేస్తోందని, దాన్ని సహించేది లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న ఫైర్అయ్యారు. పట్టణంలోని బీఆర్ఎస్కార్యాలయం నుంచి మహిళలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకుని నిరసన తెలిపారు.