Reading Time: 2 minutes

రాష్ట్రంలో ఆర్ఆర్ఆర్ పాలన..సీఎం రేవంత్ సోదరులు భూములను చెరబడ్తున్నరు: కవిత

Caption of Image.
  • పేదల దగ్గర్నుంచి 30 వేల ఎకరాలను లాక్కున్నరు
  • మేం అధికారంలోకి వచ్చాక భూలక్ష్మి పేరుతో ఇంటింటికీ ఎకరం భూమిస్తం
  • సీఎం చేసేది సామాజిక న్యాయం కాదు.. ఆటవిక న్యాయమని మండిపాటు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఆర్​ఆర్​ఆర్ (రేవంత్​ రాక్షస రాజ్యం) పాలన సాగుతున్నదని తెలంగాణ రక్షణ సేన (టీఆర్​ఎస్) చీఫ్​ కవిత విమర్శించారు. ఇక్కడ జరుగుతున్న భూదోపిడీ గురించి దేశమంతా కథలుకథలుగా చెప్పుకుంటున్నారన్నారు. సీఎం రేవంత్​ ఏడుగురు అన్నాదమ్ములు భూములను చెరబడుతున్నారన్నారు.  మంగళవారం ఆమె హైదరాబాద్​ బంజారాహిల్స్​లోని టీఆర్​ఎస్​ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు.

సీఎం సోదరులు, వాళ్ల కుటుంబం మొత్తం భూ దొంగలని మండిపడ్డారు. రాష్ట్రంలో ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అనే పాలన కొనసాగుతున్నదన్నారు. ‘‘పొంగులేటిని గెలిపిస్తే వాళ్ల కొడుకు, శ్రీధర్ బాబును గెలిపిస్తే వాళ్ల సోదరుడు, భట్టిని గెలిపిస్తే వాళ్ల కుటుంబ సభ్యులు ప్రజల మీద పడుతున్నారు. మొత్తం 200 మంది ముఠా ప్రజల మీద పడి ఇబ్బందులు పెడుతున్నారు. ఇందిరమ్మ కాలంలో పేద ప్రజలకు ఇచ్చిన భూములను రాబందుల్లా లాక్కుంటున్నారు.

ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత పేదల దగ్గర నుంచి 30 వేల ఎకరాల భూములను లాక్కున్నారు. మీరు పేదలకు భూములు ఇవ్వలేదు. ఇందిరాగాంధీని ఒప్పించి పేదలకు పీవీ నర్సింహారావు ఇచ్చారు. తెలంగాణలో నిజాం కొంతమంది పేదలకు భూములు ఇచ్చారు. వాటిని మీరు లాక్కుంటున్నారు. రేవంత్ రెడ్డి కుటుంబానికి భూమి అంటే వ్యాపారం కావొచ్చు. కానీ ఆదీవాసీలు, పేదలు, మధ్య తరగతి వాళ్లకు భూమి అంటే పంచప్రాణం.

అందుకే పేదలకు భూ పంపిణీ జరగాల్సిందే. మానవత్వంతో కూడిన పాలన ఈ ప్రభుత్వంలో లోపించింది. మేం అధికారంలోకి వచ్చాక భూ లక్ష్మి పేరుతో ప్రతి కుటుంబానికి ఎకరం భూమి పంచుతాం. సోషల్ జస్టిస్ జరగాలంటే.. మళ్లీ ల్యాండ్ రీ డిస్ట్రిబ్యూషన్ జరగాల్సిందే’’ అని ఆమె పేర్కొన్నారు. 

సామాజిక న్యాయం కాదు

తాము సామాజిక న్యాయ సభ పెట్టిన తర్వాతే సీఎం రేవంత్​ రెడ్డి సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నారని కవిత అన్నారు. పైకి సామాజిక న్యాయం అంటున్నాడే కానీ.. ఆయన చేసేది ఆటవిక న్యాయమన్నారు. నిజంగా సామాజిక న్యాయంపై చిత్తశుద్ధి ఉంటే  16 మంది మంత్రుల్లో ముగ్గురే బీసీలు ఉంటారా? అని ప్రశ్నించారు. ఇద్దరు మహిళలకు మంత్రి పదవులు ఇచ్చామంటున్నారని, అది 33 శాతం అవుతుందా అని ప్రశ్నించారు.

విజయశాంతిని ఎమ్మెల్సీ చేసి సైలెంట్ చేశారని, ఆమెకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదన్నారు. యాదగిరి గుట్టలో డిప్యూటీ సీఎంను కింద కూర్చోబెట్టి అవమానించారని, ఎంపీ వంశీకి పుష్కరాల ఇన్విటేషన్​ కూడా ఇవ్వలేదని విమర్శించారు. బీసీ బిడ్డలైన మంత్రి వాకిటి శ్రీహరి, కొండా సురేఖను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఘోరంగా అవమానించారన్నారు. లంబాడాలు మినిస్టర్ గా లేని ఏకైక కేబినెట్ ఇదేనని మండిపడ్డారు.

 

©️ VIL Media Pvt Ltd.