July 17, 2026

Tollywood : డాన్సర్స్ అసోసియేషన్ వివాదంపై ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం

Tollywood : డాన్సర్స్ అసోసియేషన్ వివాదంపై ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం
Reading Time: < 1 minute
Tollywood Dancers Association Controversy Film Federation Emergency Meeting Today

తెలుగు చిత్రపరిశ్రమలో డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. ఇరువర్గాలు మెగాస్టార్ చిరుతో భేటీ అనంతరం తామంతా ఒకటేనని గ్రూపులు లేవని వెల్లడించాయి. కానీ వివాదం సమసిపోలేదు. దాంతో ఈ వివాదానికి శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి (ఫిలిం ఫెడరేషన్) రంగంలోకి దిగింది. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇండస్ట్రీలో జరుగుతున్న తాజా పరిణామాలపై ఈ భేటీలో కీలక చర్చ జరగనుంది.

గత కొన్ని రోజులుగా డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో అంతర్గత విభేదాలు, వరుస రాజీనామాలు, ఒకరిపై ఒకరు చేసుకుంటున్న తీవ్ర ఆరోపణల వల్ల వాతావరణం వేడెక్కింది. ఈ నేపథ్యంలో అసోసియేషన్‌లో చోటు చేసుకున్న క్రమశిక్షణా ఉల్లంఘనలపై ఫెడరేషన్ సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న డ్యాన్సర్స్ అసోసియేషన్ కమిటీ భవిష్యత్తు మరియు దాని మనుగడపై ఈ సమావేశంలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. టాలీవుడ్ డ్యాన్సర్ల సమస్యలకు, ఈ గొడవలకు ఒక ఫుల్‌స్టాప్ పెట్టాలని ఫెడరేషన్ భావిస్తోంది. ఇరు వర్గాల వాదనలను, ఆరోపణలను క్షుణ్ణంగా సమీక్షించిన తర్వాత, ఫెడరేషన్ పెద్దలు తమ తుది నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. ఈ అత్యవసర సమావేశం ముగిసిన వెంటనే మీడియా ముఖంగా అధికారిక ప్రకటన విడుదల చేయనున్నారు. ఈ మీటింగ్‌తో డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదానికి శుభం కార్డు పడుతుందో లేదో చూడాలి.