Used Smartphone Buying Guide: సెకండ్ హ్యాండ్ స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? ఇవి తప్పనిసరిగా చెక్ చేయండి.. లేదంటే అంతే..!

Used Smartphone Buying Guide: స్మార్ట్‌ఫోన్‌ల ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంతో చాలా మంది వినియోగదారులు ఇప్పుడు సెకండ్ హ్యాండ్ స్మార్ట్‌ఫోన్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు. శాంసంగ్, వన్‌ప్లస్, వివో, ఒప్పో, రియల్‌మీ వంటి ప్రముఖ కంపెనీలు ఇటీవల తమ పలు మోడళ్ల ధరలను పెంచడంతో కొత్త ఫోన్ కొనడం చాలామందికి భారంగా మారింది. పరిశ్రమ నిపుణుల అంచనా ప్రకారం, చిప్‌ల కొరత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీకి పెరుగుతున్న డిమాండ్ కారణంగా స్మార్ట్‌ఫోన్ ధరలు భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉంది.
ఈ పరిస్థితుల్లో తక్కువ ధరలో ప్రీమియం ఫోన్‌ను పొందేందుకు సెకండ్ హ్యాండ్ మార్కెట్ మంచి ప్రత్యామ్నాయంగా మారుతోంది. పరిశోధనా సంస్థ కౌంటర్‌పాయింట్ అంచనా ప్రకారం, 2026లో భారతదేశంలో రీఫర్బిష్డ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ సుమారు 12 శాతం వృద్ధి చెందనుంది. కొత్త మిడ్‌రేంజ్ ఫోన్ ధరలోనే ఒకటి లేదా రెండు సంవత్సరాల క్రితం విడుదలైన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే అవకాశం వినియోగదారులకు లభిస్తోంది.
ఉదాహరణకు, కొత్త ఐఫోన్ ప్రో లేదా శాంసంగ్ గెలాక్సీ అల్ట్రా ఫోన్‌ల ధర లక్ష రూపాయలకు పైగా ఉంటుంది. అయితే, రెండు తరాల పాత ప్రో ఐఫోన్ లేదా గెలాక్సీ అల్ట్రా మోడళ్లను సెకండ్ హ్యాండ్ మార్కెట్‌లో రూ.40 వేల నుంచి రూ.50 వేల మధ్య కొనుగోలు చేయవచ్చు. వీటిలో మెరుగైన కెమెరాలు, శక్తివంతమైన ప్రాసెసర్లు, ప్రీమియం డిస్‌ప్లేలు, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా యాపిల్, శాంసంగ్ వంటి కంపెనీలు చాలా సంవత్సరాల పాటు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు అందించడం కూడా వినియోగదారులకు ప్రయోజనంగా మారుతోంది.
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..
అయితే, సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తలు తప్పనిసరి. ముందుగా ఫోన్ IMEI నంబర్ సరైనదేనా, బాక్స్‌పై ఉన్న నంబర్‌తో సరిపోతుందా అనేది పరిశీలించాలి. ఆ ఫోన్ దొంగిలించబడిందా లేదా బ్లాక్‌లిస్ట్‌లో ఉందా అనే విషయాన్ని కూడా నిర్ధారించుకోవాలి.
అలాగే బ్యాటరీ హెల్త్, డిస్‌ప్లే నాణ్యత, టచ్ స్పందన, డెడ్ పిక్సెల్స్ వంటి అంశాలను పరిశీలించాలి. కెమెరాలోని అన్ని లెన్స్‌లు, వీడియో రికార్డింగ్, సెల్ఫీ కెమెరా సరిగా పనిచేస్తున్నాయా అనే విషయాన్ని పరీక్షించాలి. స్పీకర్, మైక్రోఫోన్, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ వంటి ఫీచర్లు కూడా సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో చూసుకోవాలి.
ఫోన్‌కు నీటి వల్ల నష్టం జరిగిందా లేదా అనేది లిక్విడ్ డ్యామేజ్ ఇండికేటర్ ద్వారా గుర్తించవచ్చు. అలాగే ఫోన్ స్క్రూలపై గుర్తులు ఉంటే, అది చాలాసార్లు రిపేర్ చేసిన ఫోన్ అయ్యే అవకాశం ఉంది. కొనుగోలు చేసే ముందు ఆ మోడల్‌కు ఇంకా సాఫ్ట్‌వేర్, సెక్యూరిటీ అప్‌డేట్‌లు వస్తాయా లేదా అనేది కూడా తెలుసుకోవడం మంచిది. వీలైతే విశ్వసనీయమైన రీఫర్బిష్డ్ ప్లాట్‌ఫారమ్ లేదా అధికారిక రీసెల్లర్ వద్ద నుంచే ఫోన్ కొనుగోలు చేయాలి. అలాంటి చోట్ల వారంటీ కూడా లభించే అవకాశం ఉంటుంది. మార్కెట్ ధరను ముందుగానే తెలుసుకుని, ఫోన్ పరిస్థితిని బట్టి బేరసారాలు చేయడం ద్వారా మరింత తక్కువ ధరకే మంచి ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు.
కొత్త స్మార్ట్‌ఫోన్‌ల ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో సరైన పరిశీలనతో సెకండ్ హ్యాండ్ లేదా రీఫర్బిష్డ్ ఫోన్ కొనుగోలు చేయడం ప్రస్తుతం చాలా మందికి తెలివైన, పొదుపైన ఎంపికగా మారుతోంది. సరైన తనిఖీలు చేసి కొనుగోలు చేస్తే, తక్కువ బడ్జెట్‌లోనే ప్రీమియం అనుభవాన్ని పొందే అవకాశం ఉంటుంది.