Ishqnama Trailer: సరిహద్దులు దాటిన ప్రేమ.. హృదయాలను కదిలిస్తున్న ‘ఇష్క్‌నామా’ ట్రైలర్

Ishqnama Trailer: సరిహద్దులు దేశాలను విడదీయగలవేమో కానీ ప్రేమను ఆపలేవనే సందేశంతో మరో ఎమోషనల్ రియల్ లవ్ స్టోరీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. షెహనాజ్ గిల్, జయ్ రంధావా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ పంజాబీ చిత్రం ‘ఇష్క్‌నామా’ ట్రైలర్ బుధవారం విడుదలై ప్రేక్షకుల హృదయాలను కదిలిస్తోంది. పాకిస్తానీ యువతి, భారతీయ యువకుడి నిజ జీవిత ప్రేమకథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం, ప్రేమ కోసం ఇద్దరు ప్రేమికులు చేసిన పోరాటాన్ని చూపించబోతోంది. 1981 నుంచి 1988 మధ్య జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా, పాకిస్తాన్‌కు చెందిన నసీమా, భారతదేశానికి చెందిన నిమ్మా ప్రేమకథను తెరపైకి తీసుకువస్తోంది. ట్రైలర్‌లో జయ్ రంధావా సిక్కు కవి నిమ్మా పాత్రలో కనిపిస్తుండగా, షెహనాజ్ గిల్ పాకిస్తానీ యువతి నసీమాగా ఆకట్టుకున్నారు. పాకిస్తాన్‌లో పరిచయమైన వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించడం, అనంతరం నసీమా భారతదేశాన్ని చూడాలనే కోరిక వ్యక్తం చేయడం, నిమ్మా ఆమెను భారతదేశానికి తీసుకురావడం వంటి సన్నివేశాలు భావోద్వేగంగా చూపించారు.
అయితే వారి ప్రేమ విషయం నసీమా కుటుంబానికి తెలియడంతో కథ ఊహించని మలుపు తిరుగుతుంది. ముఖ్యంగా ఆమె తండ్రి ఈ సంబంధాన్ని వ్యతిరేకిస్తూ నిమ్మాపై దాడి చేసే సన్నివేశాలు ప్రేమకు ఎదురైన అడ్డంకులను హృదయ విదారకంగా చూపిస్తున్నాయి. ప్రేమ, మతం, సరిహద్దులు, కుటుంబ పరువు వంటి అంశాల మధ్య ఇద్దరు ప్రేమికులు చేసిన పోరాటం ఈ మూవీకి హైలెట్ కానుంది. ఈ సినిమాలో తన పాత్ర గురించి షెహనాజ్ గిల్ స్పందిస్తూ, నసీమా పాత్ర తన కెరీర్ లో ఒక కొత్త అనుభవమని తెలిపారు. ఈ సినిమా తనను కంఫర్ట్ జోన్ నుంచి బయటకు తీసుకువచ్చిందని, ప్రేమను ఒక విప్లవంగా చూపించే అరుదైన కథలో భాగం కావడం ఆనందంగా ఉందని చెప్పారు. రియల్ స్టోరీతో వచ్చే ప్రేమ కథలు తనకు ఎంతో ప్రత్యేకమని ఆమె వెల్లడించారు. ఇక ఈ చిత్రానికి బి-ప్రాక్ సంగీతం అందించగా, ట్రైలర్‌లో సన్నివేశాలు సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి. ప్రేమ కోసం అన్ని అడ్డంకులను ఎదుర్కొన్న ఇద్దరు ప్రేమికుల నిజమైన గాథగా తెరకెక్కిన ‘ఇష్క్‌నామా’ జూలై 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ట్రైలర్‌కు వస్తున్న స్పందన చూస్తుంటే, ఈ చిత్రం ప్రేమకథల్ని ఇష్టపడే ప్రేక్షకులకు ప్రత్యేక అనుభూతిని అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి.